cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఎన్నికల వేళ ఆ ఒక్క ఛాన్స్ మిస్ అయిన పవన్

ఎన్నికల వేళ ఆ ఒక్క ఛాన్స్ మిస్ అయిన పవన్

ఎన్నికల సీజన్లో బయోపిక్ ల హవా నడుస్తోంది. టీడీపీ సపోర్ట్ గా ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 1 విడుదలైంది, పార్ట్-2 రెడీ అవుతోంది. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర.. వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపుతోంది. ఇక చంద్రబాబు జీవిత చరిత్రతో కూడా ప్రయోగాలు జరిగాయి. చంద్రోదయం విడుదలకు మార్చిలో మహూర్తం ఖరారైంది.

అంతా బాగానే ఉంది కానీ ఇంత పవర్ ఫుల్ మీడియంని, జనాలపై చెరగని ముద్రవేసే సినిమాని అందులోనూ మాంచి పొలిటికల్ సీజన్ లో మిస్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా పవన్ కల్యాణే. ఈ సీజన్లో పవన్ కల్యాణ్ మాంచి పొలిటికల్ డ్రామా రిలీజ్ చేసి ఉంటే ఆ సందడే వేరుగా ఉండేది.

జనసేనకు ఓట్లు ఎంతమేర పెరుగుతాయో చెప్పలేం కానీ, పార్టీకి, ప్రచారానికి మాత్రం అది కచ్చితంగా ప్లస్ అయి ఉండేది. నాకు డబ్బా కొట్టే మీడియా లేదు, సోషల్ మీడియానే నాకన్నీ అంటూ చెప్పుకుంటున్న పవన్ తన చేతిలో ఉన్న సినిమా అనే బ్రహ్మాస్త్రాన్ని పక్కనపెట్టేశారు. అది కూడా సరిగ్గా ఎన్నికల టైమ్ లో.

పవన్ కల్యాణ్ తన భావజాలాన్ని పుంఖానుపుంఖాలుగా ఉపన్యాసాలు దంచడం ద్వారా కాకుండా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని పగడ్బందీగా తెరకెక్కించి ఉంటే ఆ లెక్కే వేరుగా ఉండేది. అదిచ్చే కిక్కు ఎంతో ఇంపాక్ట్ చూపించేంది. తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్ కి ఆనాటి ఎన్నికల సీజన్లో చేసిన బొబ్బిలిపులి లాంటి సినిమాలు ఎంత పాపులారిటీ తెచ్చిపెట్టాయో అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి సిచ్యుయేషన్ ని పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్నారు.

పొలిటికల్ పంచ్ డైలాగులు లేకపోయినా కనీసం మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో అయినా ప్రేక్షకుల మధ్యకి వచ్చి ఉంటే పవర్ స్టార్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం కనిపించేది. కానీ సినిమాలకు తాను దూరంగా ఉంటానని ప్రచారంలోకి వచ్చిన రోజే పవన్ తేల్చిపారేశారు. మొత్తానికి పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల సీజన్లో మంచి సినిమా ఛాన్స్ మాత్రం మిస్సయ్యాడు.

ఇక్కడ పవన్ అభిమానులు సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. బొబ్బిలిపులి కోసం ప్రయత్నించి పవన్, మరో కొమరం పులిని బైటకు తెచ్చుంటే సీన్ తలకిందులు అయ్యుండేది.