cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ కావాలా? చంద్రబాబు కావాలా?

పవన్ కావాలా? చంద్రబాబు కావాలా?

అంతేనా... వార్ చంద్రబాబుకు- పవన్ కల్యాణ్ మధ్య మాత్రమే ఉన్నదా? జగన్ గురించి ప్రస్తావించే అవసరం కూడా లేదా...? అని ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు! ఈ వ్యవహారం తెలంగాణలో రాజకీయ పొత్తులకు సంబంధించినది. పైగా ఇక్కడ ఆ రెండు పార్టీలు కూడా సోదిలో లేని పార్టీలే. కాబట్టి.. ఇక్కడ పవన్ ను గానీ, చంద్రబాబును గానీ కోరుకునే ఆలోచన చేస్తున్నది ప్రజలు కూడా కాదు. ఇదంతా కూటమిగా ఆవిర్భవించడానికి సీపీఎం చేస్తున్న ప్రయత్నం మాత్రమే.

తెలంగాణలో ప్రస్తుతం కేసీఆర్ హవా నడుస్తోంది. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను అడ్డుకోవడం, అధికారంలోకి రాకుండా చూడడం అనేది తర్వాతి సంగతి... ముందుగా తమ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చిన్నాచితకా పార్టీలన్నీ కష్టాలు పడుతున్నాయి. గతంలో అయితే.. తెలంగాణ అంటే లెఫ్ట్ పార్టీలకు ప్రతి ఎన్నికల్లోనూ నికరంగా కొన్ని సీట్లు కట్టెబట్టే ఆదరణ కనిపిస్తూనే వచ్చింది. కానీ ఇవాళ పరిస్థితి వేరు. అందుకే లెఫ్ట్ పార్టీలు ప్రధానంగా కంగారు పడుతున్నాయి.

సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం మాత్రం... బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రూపంలో కేసీఆర్ ను దెబ్బకొడతాం అని సవాళ్లు విసురుతున్నారు. దెబ్బకొట్టగల బలం తమకున్నదని ఆయన ఎలా అనుకుంటున్నారో గానీ.. బలం సంతరించుకోవడం కోసం ఆల్రెడీ పవన్ కల్యాణ్ ప్రాపకం కోసం ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తాజాగా అసెంబ్లీ రద్దు నిర్ణయం తర్వాత.. తెదేపా కూడా తమ పొత్తు వ్యూహాల గురించి సంకేతాలు ఇచ్చింది. సీపీఐ, టీజేఎస్ తమతో పొత్తుకు సిద్ధంగా ఉన్నాయని... సీపీఎంను కూడా కలుపుకోవడం పెద్ద విషయం కాదని తెదేపా ఏపీ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తమ్మినేని మాత్రం తెదేపాతో వెళ్లబోయేది లేదు.. పవన్ ను సంప్రదిస్తున్నాం అని అంటున్నారు.

ఏతావతా, చంద్రబాబు కావాలా- పవన్ కావాలా తేల్చుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ సీపీఎం ఉన్నదన్నమాట. నిజానికి తమ్మినేని పవన్ వైపు మొగ్గుతున్నారు గానీ.. చంద్రబాబు వారితో పొత్తు కోరుకుంటే ఢిల్లీ సీపీఎం పెద్దల ద్వారా అటునుంచి నరుక్కు రాగలరని ఊహాగానాలున్నాయి. మరి వీరి పొత్తుబంధాలు ఎలా మలుపులు తిరుగుతాయో చూడాలి.