cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఓ జనసేనానీ.. కొత్త రక్తం అంటే ఇదేనా?

ఓ జనసేనానీ.. కొత్త రక్తం అంటే ఇదేనా?

నియోజకవర్గానికి వందమంది కొత్త నాయకుల్ని తయారు చేస్తాను. సాధారణ యువకులను లీడర్లుగా మలుస్తాను, చెక్కుతాను, తీర్చిదిద్దుతాను అంటూ చాలా చెప్పారు పవన్ కల్యాణ్. తీరాచూస్తే పవన్ కల్యాణ్ ఎవరికి ప్రాధాన్యతనిస్తోంది, ఎవరిని నెత్తినెక్కించుకుంటోంది, ఎవరికి పదవులు ఆఫర్ చేస్తోంది అందరూ చూస్తునే ఉన్నారు. తాజాగా జనసేన పార్టీలో చేరి, వెనువెంటనే పార్టీ సలహా మండలి అధ్యక్షుడిగా మారారు విష్ణురాజు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈయనకు పలు విద్యాసంస్థలు, సిమెంట్ కంపెనీ ఉన్నాయి.

ఏ పార్టీ అయినా ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేవారికే పదవులు ఇస్తుందనేది బహిరంగ రహస్యం. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తాను అలాంటి రాజకీయాలకి దూరం అని చెప్పుకుంటున్నారు. అదిచూసే, చాలామంది యువత జనసేన వైపు ఆకర్షితులయ్యారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన మహిళలు, వృత్తి నిపుణులు, వ్యాపారస్తులు.. ఇలా చాలామంది జనసేనతో రాజకీయ అరంగేట్రం చేద్దామని ఉవ్విళ్లూరుతున్నారు. ఎన్నారై కుర్రాళ్లు కూడా లక్షల జీతాలిచ్చే ఉద్యోగాలు వదలిపెట్టి మరీ జనసేన తరపున ఎన్నికల రణరంగంలో దిగేందుకు సొంత రాష్ట్రానికి వచ్చారు.

కానీ పవన్ మాత్రం రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు మినహా ఇప్పటివరకూ కొత్తవారిని అభ్యర్థులుగా ప్రకటించలేదు. మొన్నటికి మొన్న మహిళలకు కేటాయించిన పార్టీ పదవుల్లో కూడా ధనబలం ఉన్నవారే అందలమెక్కారు. జనసేన కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కనపెట్టారని దాదాపు అన్ని జిల్లాల్లో విమర్శలు వినిపించాయి. కానీ ఎవరూ బైటపడలేదనుకోండి.

ఇప్పుడిలా వ్యాపారస్తుల్ని పార్టీలో చేర్చుకుంటూ, వెంటనే పదవుల్ని అప్పగిస్తూ పవన్ కల్యాణ్ తానూ అందరలాంటి వాడినే అనిపించుకున్నారు. పార్టీకి పనికొచ్చేవారికే పదవులివ్వడాన్ని ఎవరూ తప్పుబట్టరు, అయితే పవన్ కల్యాణ్ తానేదో యువతను ఉద్ధరిస్తానని, వారిని నాయకులుగా తయారు చేస్తానంటూ ప్రగల్భాలు పలికి ఓ వర్గంలో లేనిపోని ఆశల్ని చిగురింపచేశారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఆ ఆశల్ని అడియాసలు చేస్తున్నారు. 

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?