cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్‌తో దూరం.. చిరంజీవితో స్నేహం.?

పవన్‌తో దూరం.. చిరంజీవితో స్నేహం.?

'కాపు' సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసం తెలుగుదేశం పార్టీ, మెగాస్టార్‌ చిరంజీవికి గాలమేస్తోందా.? 'కాదు' అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి, తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుని దెబ్బ తీశారనీ, చిరంజీవి అడ్డుపడకపోయి వుంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వచ్చేదనీ చంద్రబాబు చాలా సార్లు చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేశారు. ఆ అక్కసుతో చిరంజీవిని టీడీపీ నేతలతో చంద్రబాబు ఏ స్థాయిలో తిట్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేవు. 

2014 ఎన్నికల్లో చిరంజీవి తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ సాయం తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైతేనేం అధికార పీఠమెక్కేశారు చంద్రబాబు. కొన్నాళ్ళ స్నేహం తర్వాత, పవన్‌కళ్యాణ్‌ని షరామామూలుగానే చంద్రబాబు వదిలించేసుకున్నారు. అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు, చిరంజీవికి గాలమేయడం మొదలు పెట్టారు. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన సమయంలో ఇచ్చిన నిధుల సహాయంతో మచిలీపట్నంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని చంద్రబాబు సర్కార్‌ చేపట్టిందట. ఆ కార్యక్రమాల పురోగతి గురించి మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా చిరంజీవికి తెలియజేశారు చంద్రబాబు. అబ్బబ్బా.. ఏం స్కెచ్‌ ఇది.! 

'దాదాపుగా అభివృద్ధి పనులు పూర్తయినట్లే.. వీలైతే, మీ నిధుల ద్వారా జరిగిన పనులకు సంబంధించి ప్రారంభోత్సవం మీతోనే చేయిస్తాం..' అని కొల్లు రవీంద్ర, చంద్రబాబు చెప్పిన మాటల్ని చిరంజీవి చెవిన వేసేశారు. దానికి చిరంజీవి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారండోయ్‌. 'ఎంపీగా చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌కి ఏం చేశారు.?' అని నిన్న మొన్నటిదాకా చిరంజీవిని టీడీపీ నేతలు నిలదీసిన విషయం విదితమే. అప్పుడు బహుశా ఆ నేతలకు చిరంజీవి వెచ్చించిన నిధులు కన్పించి వుండవు. 

ఇప్పుడంటే చిరంజీవి, రాజ్యసభ పదవికి దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎంపీ. కాంగ్రెస్‌ పార్టీ నేత అయినా, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటోన్న విషయం విదితమే. టీడీపీలోకి చిరంజీవి వెళ్తారని అనలేంగానీ, చిరంజీవిని మంచి చేసుకోవడం ద్వారా ఎంతో కొంత కాపు సామాజిక వర్గం మెప్పు పొందొచ్చన్నది చంద్రబాబుగారి ఆలోచన. అదిరిందయ్యా చంద్రం.!