Advertisement


Home > Politics - Gossip
సామెతకత: జైలులో లాలూ వైభోగానికి స్కెచ్చేస్తే..

దరిద్రుడు తలకడగను బోతే వడగళ్ల వాన కురిసిందని సామెత! పాపం జార్ఖండ్ లోని బిర్సా ముండా జైలులో ఊచలు లెక్కపెడుతున్న లాలూప్రసాద్ యాదవ్ పరిస్థితి అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. లాలూ అంటే ఎవరు... బీహార్ లో ఒక కులాన్ని తన కనుసన్నల్లో శాసించే కొమ్ములు తిరిగిన నాయకుడు! ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేసే వాళ్లయినా అక్కడ బోలెడు మంది ఉంటారు. అలాంటి లాలూప్రసాద్ యాదవ్ జైల్లో ఒక సామాన్య ఖైదీ లాగా శిక్ష అనుభవిస్తూ గడపడమా? ఎంత అపర్దిష్ట! ఆయనకు జైలులో సకల భోగాలూ, సేవకులూ లేకపోతే ఎలాగ అని అనుకున్నారేమో.. ఆయన పార్టీ అనుచరులు చాలా పెద్ద స్కెచ్చే వేశారు.

లాలూప్రసాద్ కు జైలులో సమస్త సేవలు చేయడానికి ఓ ఇద్దరు మనుషుల్ని మాట్లాడారు. స్కెచ్ ఏంటంటే.. ఆ ఇద్దరి మీద ఒక చిన్న కేసు పెడతారు. ఆ కేసులో వారిని పోలీసులు అరెస్టు చేసేలాగా వాళ్లే జాగ్రత్తలు తీసుకుంటారు. బిర్సా ముండా జైలుకు వెళ్లే శిక్ష పడే విధంగా సదరు పోలీసులు తదనుగుణమైన కేసులను బనాయిస్తారు. తీరా జైలుకు వెళ్లిన తర్వాత మాత్రం.. వారు నిత్యం లాలూ ప్రసాద్ సేవలో ఉంటూ.. ఆయనకు పర్సనల్ అటెండెంట్స్ మాదిరిగా సేవ చేసి తరించాలన్నమాట. ఇంత పెద్ద స్కెచ్ వేసి.. పార్టీ నాయకులు ఇద్దరు మనుషుల్ని మాట్లాడుకున్నారు.

వారి మీద సుమిత్ యాదవ్ అనే వ్యక్తి దాడి మరియు దోపిడీ కేసు పెట్టాడు. ఆ కేసులో మరో అనుమానానికి తావివ్వకుండా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇక జైలుకు పంపడమే తరువాయి. ఈలోగా బహుశా సదరు త్యాగం  చేస్తున్నందుకు వారికి జరగవలసిన ‘చెల్లింపులు’ మొత్తం అయిపోయాయో ఏమో గానీ.. ప్లాన్ ఆ దశలో బెడిసికొట్టింది.

అరెస్టు అయిన తర్వాత.. లక్ష్మణ్ యాదవ్, మదన్ యాదవ్ అనే ఆ ఇద్దరు ‘కల్పిత దోపిడీ దొంగలకి’ బెయిల్ దొరికింది. బెయిల్ దొరికిన వెంటనే ఇద్దరూ అదృశ్యం అయ్యారు. ఆ తర్వాత ఇక లాలూప్రసాద్ సేవకు కాదు కదా.. అసలు తమను ఆ పనికి పురమాయించిన పార్టీ వారికి కూడా దొరకకుండా అదృశ్యం అయ్యారు. ఈ సంగతి మొత్తం పోలీసు ఉన్నతాధికార్లకు తెలిసింది. ఈ స్కెచ్ ఇలా నడవడానికి తొలిదశలో సహకరించిన పోలీసు అధికార్ల గురించి కూడా తెలిసింది. వారిద్దరినీ వెతకడంతో పాటూ.. ఈ కుట్ర గురించి కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారట.

ఒకవైపు తన వైభోగం బట్టబయలయ్యే వరకు పరప్పన అగ్రహారం జైలులో శశికళ ఇలాగే రాజభోగాలను అనుభవించారు. పాపం.. లాలూ ప్రసాద్ యాదవ్ విషయానికి వచ్చేసరికి.. వైభోగాలకు ప్లాన్ చేసిన తొలిదశలోనే బెడిసికొట్టింది.