cloudfront

Advertisement


Home > Politics - Gossip

పోలవరం 1 : అసలు అనుమానం తీరలేదు!

పోలవరం 1 : అసలు అనుమానం తీరలేదు!

పోలవరం పనుల్లో ప్రతిష్టంభన ఎందుకు ఏర్పడుతోంది? చంద్రబాబునాయుడు కేంద్రం మీద ఎలాంటి నిందలు వేయగలుగుతున్నారు? కేంద్రం ఎలాంటి సమాధానం చెప్పుకుంటున్నది? పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి.. ఇలాంటి అనేకానేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. పోలవరం పనుల పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా స్పష్టంగా ఆ అనుమానాలను మళ్లీ లేవనెత్తారు. ఆయన తర్వాత చంద్రబాబు కూడా మాట్లాడారు. కానీ.. మొత్తానికి కీలకమైన అనుమానాలన్నీ అలాగే మిగిలిపోయాయి.

‘కేంద్రం పోలవరానికి నిధులు ఇవ్వడం లేదు..’ అంటారు చంద్రబాబు.

‘మేం అడిగిన సందేహాలు తీర్చలేదు’ అంటుంది కేంద్రం (మరియు భాజపా నాయకులు).

‘అన్నీ ఎప్పుడో తీర్చేశాం’ అంటారు చంద్రబాబు.

ఈ పీటముడి విడిపోయేదెన్నటికి?

==

దీనిని నివృత్తి చేసే ప్రయత్నం బుధవారం నాడు పోలవరం పనుల పరిశీలనకు వచ్చిన నితిన్ గడ్కరీ స్వయంగా చేశారు. పోలవరం వద్ద సమావేశమైనప్పుడు.. ‘మీకెంత సమయం ఉంది సార్’ అని అధికారులు అడిగితే.. ‘వేరే పనులేం లేవు ఎంతసేపైనా తీసుకోండి’ అంటూ గడ్కరీ నింపాదిగా ఉండి సాంతం వారు చెప్పినదంతా విన్నారు. అంతగా ఆయన సమయం వెచ్చించి దీనికోసం వచ్చారు.

ఆ తర్వాత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగేలా.. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. పోలవరం పనుల విషయంలో ఉన్న సమస్యలను రెండు భాగాలుగా చూడాలని ఆయన చెప్పారు. సివిల్ పనులకు సంబధించి అంచనాలు పెరగడం ఒక భాగం, భూసేకరణ అంచనాలు పెరగడం రెండో భాగంగా ఆయన పేర్కొన్నారు. సివిల్ పనుల అంచనాలు పెరగడానికి సంబంధించి రాష్ట్ర కేంద్ర అధికారులు కలిసి కూర్చుని చర్చించి ఒక కొలిక్కి వచ్చి తనకు తెలియజేయాలని కూడా అన్నారు.

గడ్కరీ తర్వాత చంద్రబాబునాయుడు  కూడా మాట్లాడారు. భూసేకరణ వ్యయం ఎందుకు పెరిగిందో ఆయన చాలా చక్కగా వివరించారు. కేంద్రం భూసేకరణ చట్టం మార్చడం వల్ల అసైన్డ్ భూములకు కూడా ఇవ్వాల్సి వస్తోందని, భూసేకరణ విస్తీర్ణం పెరగలేదని- వ్యయం మాత్రమే పెరిగిందని దీనిని కేంద్రం ఒప్పుకోక తప్పదని, ఈ విషయాన్ని గతంలోనే తెలియజేశాం అని సీఎం చంద్రబాబు చక్కగానే వివరించారు.

కానీ, సివిల్ పనుల విషయంలో ఇష్టారాజ్యంగా అంచనాలు పెంచేయడానికి సంబంధించి మాత్రం ఈ ప్రెస్ మీట్ లో ఎలాంటి వివరణలు ఇవ్వలేదు. భూసేకరణ పెంపు గురించి క్లారిటీ ఉన్నట్లే. మరి సివిల్ పనుల్లో అంచనాలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదనేదే.. భాజపా చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఆ అవినీతిని సమర్థించడం ఇష్టం లేకనే.. తాము సందేహాలు లేవనెత్తినట్లు ఇండైరక్టుగా కేంద్రం చెబుతూనే వస్తోంది. రాష్ట్ర నాయకులు దెప్పిపొడుస్తూనే ఉన్నారు. కొత్తఅంచనాలతో టెండర్లు పిలవాలంటూ చంద్రబాబు ఆ నడుమ చేసిన హడావిడి అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కుదరదని గడ్కరీ పట్టుబట్టి కూర్చోడం వల్లనే, పాత ధరలకు పని చేయడానికి కొత్త కాంట్రాక్టరు ముందుకొచ్చారు.. ఇప్పుడు పనులు సాగుతున్నాయి.

కొత్తధరల వలన పెరిగే వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అని కూడా చంద్రబాబు అన్నారు. పాతధరకే కాంట్రాక్టరు రావడంతో.. ఆ పెంపు అనేది స్వాహాలకోసం ఉద్దేశించినదే అనే పుకార్లు వచ్చాయి. ఈ రకంగా సివిల్ పనుల అంచనాలు పెంచడంపై అవినీతి కోసమేననే సందేహాలు కేంద్రానికి చాలా ఉన్నాయి. వాటిని ఇప్పటికీ  కూడా.. బహిరంగంగా ప్రెస్ మీట్ లో గడ్కరీ సందేహాలు లేవనెత్తిన తర్వాత కూడా, చంద్రబాబు నివృత్తి చేయకపోవడం గమనార్హం. ఆయన భూసేకరణ పెంపు గురించి మాత్రం చెప్పి.. మిగిలిన విషయాలు మా అధికారులు ఢిల్లీ వచ్చి మాట్లాడతారు అంటూ ముక్తాయించారు. కారులో ప్రయాణిస్తుండగా.. గడ్కరీని అన్నీ వివరించినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు.

సివిల్ పనులు అంచనాలు పెంచిన మార్గంలో.. వందల కోట్లు దండుకోవడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. భాజపా ఆ అనుమానాలను పెంచుతోంది. గడ్కరీ వచ్చిన సందర్భంలో కూడా ప్రజల్లోని అలాంటి అనుమానాలను తీర్చేసే అవకాశాన్ని చంద్రబాబు వినియోగించుకోలేకపాయారు.