Advertisement


Home > Politics - Gossip
పోలవరం : గృహహింసను మించిన వేధింపులు

‘ఈ వంటిల్లు మొత్తం ఇక నీ సామ్రాజ్యమే తల్లీ’ అని పెళ్లి అయి అడుగుపెట్టిన తొలిరోజు అత్తగారు జనాంతికంగా ఒక మాట చెబుతుంది. అక్కడికేదో.. ఇనప్పెట్టె తాళాలు కోడలి చేతికిచ్చినంత బిల్డప్ ఇచ్చనట్లుగా సెలవిస్తుంది. కోడలు స్వతంత్రించి ఏదో నాలుగు కూరలతో వంట చేసి వడ్డించిందనుకోండి.. ఆ వంటలకు , రుచులకు, వడ్డించిన పద్ధతికి సవాలక్ష లోటు పాట్లు చెబుతూ.. అత్తగారు మెటికలు విరుస్తుంటుంది.

ఒకవైపు కూరలు, దినుసులు తెచ్చుకోడానికి కోడలిచేతికి బడ్జెట్ విడుదల సక్రమంగా ఉండదు.. ఓ రోజు పాలవాడు ప్యాకెట్లు వేయడు, మరో రోజు పనమ్మాయి నాగా పెడుతుంది.. పనిభారం పెరుగుతుంది, మరోరోజు కూరలమ్మి మొహం చాటేస్తుంది.. కానీ భోజనాల బల్ల వద్దకు ఏలోటు జరిగినా.. కోడలికే తిట్లు తప్పవు. పాలవాడిని, కూరలమ్మిని మార్చేద్దాం అంటే.. ముందునుంచి ఉన్నవాళ్లతో పనిచేయడం నేర్చుకో.. అంటూ అత్తగారి సన్నాయినొక్కులు తప్పవు...

ఒక కుటుంబంలో ఇలాంటి వాతావరణం ఉన్నదనుకోండి... దాన్నే గృహహింస అంటాం.

ఇప్పుడు.. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న ధోరణులు ఇంతకంటె ఎంతమాత్రమూ భిన్నంగా కనిపించడం లేదు.

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో నిర్వహణ బాధ్యతను నెత్తికెత్తుకున్న ఏపీ సర్కారును కేంద్రం ఒక రేంజిలో ఆడుకుంటోంది. చేస్తున్న పనులకు అనుమతుల విషయం నుంచి వేధింపులు ప్రారంభం అయినట్టే భావించాలి.. పనులకు నిధులు సకాలంలో ఇవ్వకుండా మీ వద్ద ఉన్న డబ్బుల్తో చేసేయండి.. తర్వాత ఇస్తాం అంటారు.. పనులు పూర్తయిన వాటికి కూడా చెల్లింపులు సకాలంలో చేయరు.

పనుల గమనంలో ముందే అన్నీ ఓకే అయిపోయినప్పటికీ.. అర్థంతరంగా అన్నిటినీ ఆపించేసి.. ఇలా వద్దు మరోలాచేద్దాం అనేస్తారు. ఎలా చేయాలో తేల్చండి.. అంటే ఆలోచిస్తున్నాం అంటారు. ఓకే అయిన డిజైన్లను కూడా తుంగలో తొక్కేసి.. ఇలా కాదు అలా.. ఆరెండింటినీ అతికిద్దాం.. ఈ రెండింటి మధ్యలో చిన్న మాయ చేద్దాం వంటి మార్పులతో సన్నాయి నొక్కులు నొక్కుతారు.

పాతవాళ్లతో పనులు సాగడం లేదు బాబూ.. కొత్త టెండర్లు పిలుద్దాం అంటే.. అనవసరం అంటారు. మళ్లీ పిలవమంటారు.. తీరా తెరవబోతున్న సమయంలో.. టెండర్లు తెరవొద్దు . మరో వారం రోజులు వాయిదా వేయండి. ఈలోగా అసలు కొత్తవాళ్లు అవసరమా లేదా డిసైడ్ చేద్దాం.. అసలు ఈ డిజైన్లలోనే చేయాలా వద్దా కూడా డిసైడ్ చేద్దాం అంటారు..

ఇవీ.. పోలవరం పనుల విషయంలో రాష్ట్రప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం గానీ, పోలవరం అథారిటీ గాని వ్యవహరిస్తున్న తీరు ఇది. ఇలాంటి గృహహింసను ప్రస్తుతం ఏపీ సర్కారు అనుభవిస్తున్నదని అనుకోవాలి. కాకపోతే ఇక్కడ చంద్రబాబు సర్కారుకు , సెక్షన్ 498(ఏ) కింద పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేదు. ఎన్ని వేధింపులు ఎదురైనా భరిస్తూ ఉండాల్సందే. మూడుముళ్ల బంధం ఆ రేంజిలో ముడిపడిపోయి ఉంది మరి!!