Advertisement


Home > Politics - Gossip
పూజ ఎవరి కోసం? ఫొటో ఎవరి కోసం?

ఆంధ్రలో గత మూడేళ్లుగా ఓ చిత్రమైన తీరు నడుస్తోంది. ఎవ్వరు ఏమనుకుంటే అనుకోండి. ఎలా అనుకుంటే అనుకోండి. మేం చేసేది మేం చేస్తాం. అన్నదే ఆ తీరు. ఇసుక అక్రమరవాణా కావచ్చు. రెవెన్యూలో పెచ్చు మీరిన అవినీతి కావచ్చు. ఇక రాజకీయంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు లాంటివి కావచ్చు. ఏదైనా, ఏవైనా. జనం మాత్రం అమాయికంగా చూస్తూ వుండాల్సిందే.

విజయవాడ కనకదుర్గ ఆలయం కార్యనిర్వహణాధికారిగా కొన్ని నెలలుగా సూర్య కుమారి పనిచేస్తున్నారు. ఆమె వచ్చాక నిజానికి ఆలయ ఆలన పాలన బాగుందని ప్రతి ఒక్కరు అంటూ వచ్చారు. టాప్ కేడర్ అధికారిణి అయిన ఆమె విజయవాడ దుర్గ గుడిలో వున్న సకల రాజకీయాలను తట్టుకుని, సమస్యలను చక్కదిద్దే పనిలో పడ్డారు. అలాంటిది ఒక్కసారిగా ఆమెకు బదిలీనే బహుమతి అయింది.

దీనికి కారణం దుర్గ గుడిలో జరిగిన అర్థరాత్రి పూజల వ్యవహారం. ఈ వ్యవహారంలో ఆది నుంచీ ఈవో సూర్యకుమారి ఎంత దాటవేతగా ప్రయత్నిస్తూ వస్తున్నారో. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంత అణచివేతగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. సాక్షాత్తూ దుర్గగుడి పాలక వర్గం, అంటే తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన వారు, పూజల వ్యవహారంపై గట్టిగా ధ్వజమెత్తారు.

సాక్ష్యాధారంగా విషయం బయట పెట్టారు. ఈవో ను బదిలీ చేసి వుంటే చంద్రబాబు అప్పుడే చేయాలి. కానీ బాబు అప్పుడేమన్నారు. ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించవద్దని పాలక వర్గాన్ని హెచ్చరించారు. గట్టిగా మాట్లాడితే, పాలకవర్గాన్ని రద్దు చేస్తా అని హెచ్చరించారు. 

నిజంగా చంద్రబాబు ఇలా మాట్లాడడం చాలా ఆశ్చర్యం అనిపించింది. గుడిలో ఒక తప్పు జరిగిందని తమ పార్టీ మనుషులే అన్నపుడు, వారిని వెనకేసుకు రావాల్సింది పోయి, దానిపై విచారణ జరిపించాల్సింది పోయి, పదవులు లేకుండా చేస్తానని అనడం ఏమిటి? ఇలా అనడానికి రెండే కారణాలు వుండాలి. ఒకటి ఇవో కచ్చితంగా బాబుగారికి నచ్చిన అధికారి అయివుండాలి. ఆమెను కాపాడడం కోసం లేదా ఈ వ్యవహారం బయటకు రాకుండా వుండడం కోసం.

తరువాత ఏం జరిగింది? తప్పని సరి పరిస్థితుల్లో విచారణ కమిటీ వేసారు. పోలీసు విచారణ మరో పక్క జరిగింది. ఏమని తేలింది. దాదాపుగా పాలక వర్గం ఆరోపించినట్లు అర్థరాత్రి పూజలు జరిగాయని నిర్థారణ అయింది. వెంటనే చంద్రబాబు చేసిన పని ఇవో సూర్యకుమారిని బదిలీ చేయడం. 

ఇవో సూర్యకమారిని ఎందుకు బదిలీ చేసారు. పూజలు జరిగాయి కాబట్టి, జరిగినా లేదని అబద్ధం చెప్పారు కాబట్టి. కానీ మరి ఆదిలో చంద్రబాబు కూడా ఇలాగే బుకాయించారు కదా? మరి దానికి ఏమనాలి?

సరే ఇప్పుడు మళ్లీ వెనక్కు వస్తే, పూజలు జరిగాయని అంగీకరిస్తే, ఎవరి కోసం జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్న పాయింట్లు తెరపైకి వస్తాయి. అలాగే అమ్మవారి మహిషాసురమర్దిని రూపాని ఫోటో తీసి వాట్సప్ చేసారని ఓ ఆరోపణ వుంది. అన్ని ఆరోఫణలు నిజాలై కూర్చుంటున్నాయి కాబట్టి, ఇది కూడా నిజమై వుండాలని భావించడంలో తప్పు లేదు.

ఇవో సూర్యకుమారి టాప్ ఆఫీసర్. నికార్సయిన, మొండి అధికారిణి. అలాంటి ఆవిడ చిన్న, చితకా వాళ్ల ఒత్తిడిలకు లొంగి అర్థరాత్రి ఇలాంటి పూజలు జరిపించి వుంటారని అనుకోవడానికి లేదు. చాలా అంటే చాలా పెద్ద అధికార హోదా వుంటే తప్ప ఆమె ఒత్తిడికి లొంగి వుండరు.

విజయవాడలో ఆమె వ్యవహార శైలి తెలిసిన వారు అనే మాట ఇది. అలాగే ఈ పూజలు కూడా ఆమె కోసం అయితే కాదు. అలా ఆమె కోసమే అయివుంటే, ఫోటో పంపమనే బదులు, అక్కడ సమక్షంలో వుండి పూజలు చేయించుకునేవారు. తెగించి, మూసిన తలుపులు తెరిపించ గలిగే తెగువ వున్నవారు, తమ కోసం పూజలు చేయించుకుంటే దగ్గర వుండడానికి ఏముంది?

అంటే మరెవరి కోసమో జరిగాయి. అమ్మవారిని, అర్థరాత్రి వేళ మూసిన తలుపులు తెరచి, సుప్రభాత సేవల్లాంటివి చేయకుండా, అర్థరాత్రి వేరే తరహా పూజలు చేయడం అంటే చాలా రిస్క్ తో కూడినపని. నమ్మకాలు వున్నవారు కచ్చితంగా అది రిస్క్ గానే భావిస్తారు. అలాంటి రిస్క్ చేయాలన్నా, చేయించాలన్నా రెండే మార్గాలు. భారీగా డబ్బు ఆశ చూపించడం. లేదా భయంకరమైన పలుకుబడి కలిగివుండడం. 

ఇక్కడ మొదటిదానికి అవకాశం తక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే సూర్యకుమారి అవినీతి అధికారిణి అని ఎక్కడా రికార్డు కానీ గుసగుసలు కానీ లేవు. పైగా ఆమెను కావాలని చంద్రబాబు అపాయింట్ చేసారు. అప్పట్లో కొన్ని గుసగుసలు విజయవాడలో వినిపించాయి. మహిళలకు కొన్ని ఇబ్బందులు వుంటాయని, అలాంటి ఆమెను దుర్గ లాంటి బలమైన శక్తి ఆలయంలో నియమించడం ఏమిటని? విజయవాడ వాసులు అక్కడక్కడ సణిగారు. అయినా సరైన అధికారిణి అని నమ్మి చంద్రబాబు నియమించారు. ఆయన నమ్మకాన్ని ఆమె వమ్ము చేయలేదు ఇఫ్పటి దాకా.

అంటే ఇక్కడ డబ్బుకు లొంగి ఈ పూజలు జరిపించి వుంటారు అని అనుకోవడానికి లేదు. డబ్బుకు లొంగితే, ఎవరైనా జరిపించుకోవచ్చు. కోట్లు వున్నవాళ్లు తమ జాతక దోష నివారణకో, మరోదానికో. ఇక మిగిలింది అధికార వత్తిడి. ఇవోను చిన్న చిన్న పనులకు ఎవరైనా వత్తిడి చేయవచ్చు. లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వరకు. కానీ ఇలాంటి రిస్క్ తో కూడిన అర్ధరాత్రి పూజలు జరిపించాలంటే అంతకన్నా బలమైన అధికారం కలిగినవారికే సాధ్యం అవుతుంది.

అలాంటి వారు ఎవరు?

ముఖ్యమంత్రి చంద్రబాబుకు అయితే ఇలాంటి నమ్మకాలు లేవు. ఆయన దేవుడినీ నమ్మరు. దెయ్యాన్నీ నమ్మరు. అని తెలుసున్నవాళ్లు సరదాగా చమత్కరిస్తుంటారు. కానీ ఆయన కొడుకు లోకేష్ కు, ఆయన బావమరిది కమ్ వియ్యంకుడు బాలయ్యకు ఇలాంటి నమ్మకాలు అపారంగా వున్నాయి. లోకేష్ పెళ్లయిన తరువాతే హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆఫీసును వాస్తు రీత్యా మొత్తం కరెక్ట్ చేయించారు. అమరావతి నిర్మాణం కోసం, చంద్రబాబు ఇంటి మీద కూడా వాస్తు కోసం చాలా మంది పెద్దలు పరిశీలనలు చేసి, సలహాలు ఇచ్చారు.

రాష్ట్రంలో చంద్రబాబు ఫ్యామిలీ తరువాత అంత బలమైన అధికారం వున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీలో కీలకమైన స్థానంలో వుండి లేదా, ఆ పార్టీతో కీలకమైన అనుబంధం వుండి, వున్నతమైన అధికారం వున్నవాళ్లు, లేదా ఆ పార్టీకి సన్నిహితమైన కీలకమైన వ్యక్తుల కోసం తప్ప, వేరే వారి కోసం ఇంతలా తెగించి, పూజలు జరిపించివుండరు. అది తర్కానికి నిలిచే పాయింట్. పైగా ఫోటో తీసి పంపారు అంటే, అవతలి వాళ్ల దగ్గర ఇవోకు ఎంత ఆబ్లిగేషన్, భయం, వత్తిడి వుండి వుండాలి. అవతలి వారు పూజ జరిపించే మహిషాసుర రూపం పట్ల ఎంత పట్టుదల కలిగి వుండాలి.

మొత్తానికి ఈ గుట్టు పూజలు జరిపించుకున్న వారికి, పూజలు జరగేలా చూసిన ఇవో సూర్యకుమారికి మాత్రమే తెలిసిన సమాధానాలు. లేదా అమ్మవారు తన ప్రభావం చూపించనపుడు అన్వయించుకుని, అర్థం చేసుకునే విషయాలు.