Advertisement


Home > Politics - Gossip
రాజధానిలో అవన్ని నిర్మించేశారా!

ఆంధ్రప్రదేశ్‌కు అధ్బుతమైన రాజధాని నగరం వస్తుంది. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాలలో అమరావతి ఒకటి.. ఇవన్ని నిత్యం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేమాటలు. వినడానికి శ్రావ్యంగా ఉంటాయి. నిజమే చంద్రబాబు ప్రభుత్వం ముందుగా అమరావతి ఇదిగో అంటూ గ్రాఫిక్స్‌తో వీడియోలు తీసి సీడీలను ప్రపంచం అంతా పంపిణీ చేసింది.

ఏ మీడియా అయినా అమరావతి అంటే ఆ వీడియోలను, దానికి సంబంధించిన చిత్రాలను ప్రసారం చేస్తుంటాయి. ప్రచురిస్తుంటాయి. దానికి తగ్గట్లుగానే ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం చాలావరకు అయిపోయినట్లు కేంద్ర ప్రభుత్వానికి యుటిలైజేషన్‌ సర్టిపికెట్లు పంపించింది. ఇదేదో మనం ఊహించి చెప్పింది కాదు. స్వయంగా కేంద్రమంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ లోక్‌సభలో వెల్లడించిన విషయం. కాని చిత్రంగా మీడియాలో ప్రముఖంగా రాలేదు.

జర్నలిస్టు మిత్రులు చాలామందికి రావల్సిన ప్రశ్నలు రాలేదు. హైకోర్టు నిర్మాణం జరిగినట్ల, రాజ్‌భవన్‌ నిర్మించినట్లు, అసెంబ్లీ, సెక్రటేరియట్‌ వంటివి నిర్మాణం చేసినట్లు ప్రభుత్వం చెబుతుంటే ఇదేమిటని ప్రశ్నించాలి కదా. హైకోర్టు, రాజభవన్‌ వంటివి ఎక్కడకట్టాలో కూడా స్పష్టత రాలేదు. నిర్దిష్ట ప్లాన్‌ తయారు కాలేదు. డిజైన్‌ సిద్ధం చేయడానికి ఎంతోకాలం తీసుకున్నారు. పైగా వాటికి ఇంకా హైకోర్టు ఆమోదం రాలేదు.

అయినా కేంద్రం పంపించిన 1500కోట్లకు అదనంగా మరో ఎనభైకోట్లు ఖర్చు చేసినట్లు వినియోగ దృవీకరణ సరిఫికెట్లు ఎలా పంపింది? దానిని కేంద్రం ఎలా అంగీకరించింది? తాత్కాలికం పేరుతో నిర్మించిన రెండు, మూడు బిల్డింగులు మినహా అక్కడ ఒక్క శాశ్వత ప్రాతిపదిక ఇటుక కూడా పడలేదు. అక్కడకు వెళ్లి చూస్తే అంత కంపమొక్కలే స్థలాలలో కనిపిస్తాయి కదా. ఇప్పుడిప్పుడు పడుతున్న కొన్ని రోడ్లు కూడా ఉండవచ్చు.

అయినా వీటన్నిటిని కట్టేసినట్లు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసినట్లు ఎలా తేల్చింది. అదేమని సీఆర్డీఏ అధికారిని పీటీఐ జర్నలిస్టు అడిగితే మీ దృష్టిలో కట్టలేదు. నా దృష్టిలో కట్టినట్లు అని ఎలా ధైర్యంగా సమాధానం చెప్పగలిగారు? సాధారణంగా కేంద్రం ఏ పద్దు కింద డబ్బు పంపితే దానికే ఖర్చు చేయాలి కదా.. తన సొంత కిట్టిలో వేసుకుని ఇష్టం వచ్చినట్లు వేరే అవసరాల కోసం ఖర్చు చేయడం చెల్లుతుందా?

అసలు ప్రభుత్వాలు ఇలా తప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వవచ్చా? అలాంటప్పుడు నకిలీ సర్టిఫికెట్లతో మోసాలు చేసేవారికి, ప్రభుత్వానికి తేడా ఏమి ఉంటుంది? మరి వారు ఎలా శిక్షార్హులు అవుతున్నారు? ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, అధినేతలు ఎలా శిక్షలు లేకుండా తప్పించుకుంటున్నారు? తిమ్మిని బమ్మి చేసినట్లు చూపడమే ప్రభుత్వం పనా. ప్రజలు పిచ్చివాళ్లు.. వారికి ఏమి తెలియదు. తమ ఇష్టం వచ్చినట్లు చేసి, ఆ తర్వాత ఓట్లను డబ్బుతో కొనుగోలు చేస్తే గొర్రెల్లా ఓట్లు వేస్తారన్నది వీరి ధీమానా? ఏమో ఏమైనా కావచ్చు.

కాని ప్రజలు ఎల్లకాలం గొర్రెల్లగానే ఉండరు. వారిలో కూడా విచక్షణ ఉంటుంది. ఆత్మగౌరవం వస్తుంది. ఎల్లకాలం మోసాలు చేసేవారినే భరించుతారని అనుకుంటే పొరపాటు. అందమైన దృశ్యాల సీడీలతో అమరావతిని అద్బుత నగరంగా తయారు చేసేశామని నేతలు భ్రమపడుతూ, ప్రజలను కూడా భ్రమలలో పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు ఈ భ్రమలలో కొట్టుకుపోతారా? లేక వాస్తవాలను గమనించి ఇలాంటి వాటికి బదులు ఇస్తారా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.

జన్మభూమికి రేషన్‌ కార్డుకు ఏమి సంబందం?

జన్మభూమి.. పేరు ఎంతబాగుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అని అన్నారు. కీర్తిశేషులు ఎన్‌టీఆర్‌. అనేకసార్లు ఈ శ్లోకం చెప్పేవారు. ఎలాగైతేనేమి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందులోని జన్మభూమిని తీసుకున్నారు. సంతోషమే. కాని అది ఇప్పుడు ఎలా జరుగుతోందో చూడండి. ఇప్పుడే కాదు. గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇలానే చేశారు.

ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చారు కనుక ఆయన మారతారేమోలే అని ఆశించినవారికి నిరాశే మిగిలింది. జన్మభూమి  గ్రామానికి ఏదైనా చేయడం. తప్పులేదు. కాని జన్మభూమి పేరుతో మాఫియాలను ప్రోత్సహించడం బాధాకరం. జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తిగా మారి మొత్తం గ్రామాలను శాసించే పరిస్థితిలో ఉన్నాయంటే జన్మభూమి ఎంత అద్వాన్నంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

పేదప్రజలు రేషన్‌ కార్డుల కోసం, పెన్షన్‌ల కోసం ఇతరత్రా చిన్న చిన్న పనులకోసం ఏడాదికోసారి జరిగే జన్మభూమి వరకు వేచి ఉండాలన్నమాట. అసలు రేషన్‌ కార్డుకు, పెన్షన్‌కు జన్మభూమికి సంబంధం ఏమిటి? రేషన్‌ కార్డు అన్నది ప్రజల హక్కు. ఒక వ్యక్తికి రేషన్‌ కార్డు లేకపోతే సంబంధిత అధికారి తనిఖీ చేసి వెంటనే కార్డు ఇవ్వాలి. అదిపోయి ప్రజలు నానాబాధలు పడుతూ జన్మభూమి సభలకు రావడం ఏమిటో?

అక్కడ జన్మభూమి కమిటీ దయాదాక్షిణ్యాలో, లేక దాష్టికానికో గురికావల్సిన దుస్థితి ఏమిటో తెలియదు. ఇది ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. పేదల ఆత్మగౌరవంతో పాలకులు చెలగాటమాడడమే. ఈ పరిస్థితి మారకపోతే ప్రజలే ప్రభుత్వ నేతలకు గుణపాఠం చెప్పేరోజు వరకు ఎదురు చూస్తారు. అంతేకాదు. కొన్ని దశాబ్ధాల కిందట వృద్దాప్య పెన్షన్‌ కావాలంటే తహాశీల్ధార్‌కు దరఖాస్తు చేసుకుంటే సరిపోయేది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా సాచ్యురేషన్‌ పద్ధతిలో కావల్సిన వారందరికి ఇచ్చారు. కాని మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత యధాప్రకారం జన్మభూమి కమిటీల తతంగం మొదలైంది. వీటికి కూడా కమిటీల దౌర్జన్యం ఎందుకు? వారు అర్హులా కాదా? అన్నదానిని అధికారులు చూడలేరా? వాటిని మంజూరు చేయలేరా? లేక ప్రజలు ఎన్నుకున్న పంచాయతీలు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించలేవా?

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తీరు పూర్తిగా అభ్యంతరకరం. పైగా ఆధార్‌ కార్డు వ్యవస్థ వచ్చాక దేనినైనా తనిఖీ చేసుకునే యంత్రాంగం ఏర్పడ్డాక కమిటీలతో పనిలేదు. ఇక జన్మభూమి సభలకు జనాన్ని తరలించే తీరుచూడండి. నిజంగానే ప్రజలంతా భాగస్వాములు అవుతుంటే స్కూళ్లకు సెలవులు ఇచ్చి మరీ బస్‌లలో డ్వాక్రా మహిళలనో, స్కూలు పిల్లలనో, అంగన్‌ వాడీలనో ఎందుకు తరలించడం. పైగా ప్రతిజ్ఞ పేరుతో ఒకతంతు. ఏదో జరిగిపోతోందన్న కలర్‌ ఇవ్వడం. ఏదైనా మంచిమాట చెబితే తప్పులేదు.

దానికోసం గంటల, గంటల ఉపన్యాసాలు వాటిని కచ్చితంగా వినాలన్నట్లుగా సభలు నిర్వహించడం.. ఇవన్నీ చూస్తుంటే అచ్చంగా రాజరికపు పోకడలతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నట్లు కనిపిస్తుంది. జన్మభూమి, మాఊరు అనడం బాగానే ఉంది. విపక్షనేత వైఎస్‌ జగన్‌ ఒక విషయం వెలుగులోకి తెచ్చారు. చంద్రబాబు నాయుడు పుట్టిన నారావారి పల్లె, ఆయన చదువుకున్న  స్కూలు, ఆయన ప్రాతినిథ్యం వహించిన చంద్రగిరి నియోజకవర్గాలలో ఉన్న దుస్థితిని బయటపెట్టారు. ముందు వాటిని సరిచేసి ఆ తర్వాత జన్మభూమి, మా ఊరుకు మేలు చేయండని ప్రజలకు చెబితే బాగుంటుంది కదా.

-కొమ్మినేని శ్రీనివాసరావు