Advertisement


Home > Politics - Gossip
'ప్రశాంత్‌' కావాలి... గుజరాత్‌ గెలవాలి!

దేశంలోకెల్లా అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను కాంగ్రెసు పార్టీ పోగొట్టుకుంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెసు పరాజయం అత్యంత దారుణం. పోటీచేసిన 105 స్థానాల్లో  గెలుచుకున్నవి కేవలం ఏడు. నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి, బిహార్లో నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రి కావడానికి కారకుడైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెసు తరపున పనిచేసిన తరువాత ఇంత దారుణ పరాజయం సంభవించడంతో దేశమంతా ఆశ్చర్యపోయింది. ఇక ప్రశాంత్‌ ఏం చేయబోతున్నారు? అనే ప్రశ్న తో మీడియాలో కథనాలొచ్చాయి. ఈ సమయంలో 'ప్రశాంత్‌ కిశోర్‌ కనబడటంలేదు. ఆయన్ని వెతికి తెచ్చిన వారికి ఐదులక్షల బహుమానం ఇస్తాం'... అంటూ ఉత్తరప్రదేశ్‌లోని లఖనవ్‌లో కాంగ్రెసు పార్టీ కార్యాలయం ముందు ఓ కాంగ్రెసు నాయకుడు హోర్డింగ్‌ పెట్టాడు. కార్యకర్తలు అడిగే కొన్ని ప్రశ్నలకు ప్రశాంత్‌ సమాధానాలు చెప్పాల్సివుందని, కాబట్టి ఆయన వెతికి పట్టుకురావాలని ఆ హోర్డింగ్‌లోని సారాంశం. పార్టీ యూపీ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ దాన్ని పెట్టిన నాయకుడిని పార్టీ నుంచి ఆరేళ్లు సస్పెండ్‌ చేశారు. కాంగ్రెసు ఘోర పరాజయానికి ఇప్పటికిప్పుడు ఏ ఒక్కరినీ బాధ్యులను చేయలేమన్నారు.

పార్టీ ఓటమికి వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కారణమ నేది కొందరిలో ఉన్న అభిప్రాయం. అది తప్పుడు అభిప్రాయమని కాంగ్రెసు నాయకత్వం భావిస్తోంది. అందుకే ప్రశాంత్‌ను మళ్లీ తెరమీదికి తీసుకురావాలనే ఆలోచన చేస్తోంది. వచ్చే ఏడాది జరగబోయే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఆయన్ని వ్యూహకర్తగా పెట్టుకొని ఆ రాష్ట్రంలో పాగా వేయాలని కాంగ్రెసు అనుకుంటోంది. వచ్చే ఏడాది గుజరాత్‌తోపాటు నాగాలాండ్‌, కర్నాటక, మేఘాలయ, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇతర రాష్ట్రాల సంగతి అలా ఉంచితే కాంగ్రెసు పార్టీ గుజరాత్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఎందుకు? ఇది ప్రధాని మోదీ సొంతరాష్ట్రం. ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రం. ఇక్కడ విజయం సాధిస్తే మోదీని కోలుకోలేని దెబ్బ కొట్టినట్లవుతుందని కాంగ్రెసు ఆలోచన.  గుజరాత్‌లో బీజేపీ, ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్‌) ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. హస్తం నాయకత్వంతో టరమ్స్‌ అండ్‌ కండిషన్స్‌ అన్ని కుదిరితే గుజరాత్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా  పనిచేస్తారు. ఆ పార్టీకి ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. ప్రశాంత్‌ను మళ్లీ తీసుకురావాలని కాంగ్రెసు ఆలోచిస్తోందంటే యూపీలో దారుణ పరాజయానికి ఆయన కారణం కాదని భావిస్తున్నట్లే కదా...!  ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకున్న కాంగ్రెసు నాయకత్వం ఓటమికి తమ పార్టీ నాయకుల పెడధోరణులే కారణమని భావించివుండొచ్చు.

కేంద్రంలో బీజేపీని, బిహార్లో మహాకూటమిని అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేసిన ప్రశాంత్‌ యూపీలో ఎందుకు విఫలమయ్యారు? అక్కడి వైఫల్యానికి ఆయన కారణంకాదు. ఆయన్ని కాంగ్రెసు నాయకులు పనిచేయనివ్వకపోవడమే కారణం. ప్రశాంత్‌ ఇచ్చిన కీలక సలహాలను కాంగ్రెసు నాయకులు చివరి నిమిషంలో పెడచెవిన పెట్టారు. ఎవరికి వారు సొంత ఆలోచనలు చేశారు. ప్రశాంత్‌ను వ్యూహకర్తగా పెట్టడాన్ని కొందరు నాయకులు వ్యతిరేకించి సహకరించలేదు. దీంతో గుజరాత్‌లో పనిచేయడానికి ఒప్పుకుంటే కాంగ్రెసుకు పలుకండిషన్లు పెట్టాలని ప్రశాంత్‌ అనుకుంటున్నారు. తన వ్యూహాలకు అడ్డుపడకూడదని, సలహాలను పెడ చెవిన పెట్టకూడదని, ఈ విషయంలో గ్యారంటీ ఇస్తేనే పనిచేస్తానని మొహమాటం లేకుండా చెప్పాలనుకుంటున్నారు. తన కండిషన్లకు అంగీకరిస్తేనే పనిచేస్తారని సమాచారం. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత శంకర్‌ సింగ్‌ వాఘేలా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌ సింగ్‌ సోలంకీ మార్చిలో ప్రశాంత్‌ను కలుసుకొని మాట్లాడారు.  దీనిపై ఢిల్లీ అధిష్టానమూ సుముఖంగానే ఉంది. యూపీ ఎన్ని కల్లో మాదిరిగా గుజరాత్‌ కాంగ్రెసులో ప్రశాంత్‌ను ఎవ్వరూ వ్యతిరేకించడంలేదు. నిర్ణయం ప్రశాంత్‌ చేతుల్లో ఉంది.

యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీని బ్రహ్మాస్త్రంలా ప్రయోగిద్దామని ప్రశాంత్‌ సలహా ఇచ్చారు. ప్రియాంక అరంగేట్రం బ్రహ్మాండంగా జరిపేందుకు మొదట్లో కాంగ్రెసు అంగీకరించింది. కాని ఆ తరువాత వెనకడుగు వేసింది. అనుకున్నది కాకపోవడంతో ప్రశాంత్‌కు గట్టిదెబ్బే తగిలింది. కాంగ్రెసు పరాజయానికి తొలి అడుగుపడింది. కాంగ్రెసును ఒంటరిగా గెలిపించాలనేది ప్రశాంత్‌ వ్యూహం. ఒంటరిగా పోటీ చేసి గెలవాలనేదే ఆ పార్టీ ఆలోచన కూడా. ఒంటరిగానే పోటీ చేయాలనుకున్న ప్పుడు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను కాకుండా ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, దీంతో పార్టీ దశ తిరిగే అవకాశం ఉంటుందని ప్రశాంత్‌ ప్రతిపాదించారు. వర్కవుట్‌ కాలేదు. చివరకు ప్రియాంక ప్రధాన ప్రచారకర్తగా కూడా రంగంలో లేదు. ఎన్నికల్లో ఒక్కోదశ ముగుస్తున్నకొద్దీ ఎస్పీ-కాంగ్రెసు కూటమి గాడి తప్పతోందనే అభిప్రాయం కలిగింది. ముఖ్యంగా నాలుగోదశ అయిపోయే సమయానికి ప్రియాంకను తీసుకురాకపోవడం పెద్ద పొరపాటని కాంగ్రెసు నాయకులు అభిప్రాయపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 50 సభల్లో ప్రసంగించిన సోనియమ్మ కూతురు ఈసారి రాయబరేలీ నియోజకవర్గంలో ఒకటో రెండో సభల్లో నామమాత్రంగా పాల్గొన్నారు. 

యూపీలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం రైతురుణ మాఫీ అని భావిస్తున్నారు. ప్రధానిమోదీ ఈ ప్రకటన చేయడానికి ఆరునెలల ముందే ప్రశాంత్‌ రాహుల్‌ చేత కిసాన్‌ యాత్ర ఆలోచన చేసి ప్రారంభింపచేశారు. కాని ఈ యాత్ర ప్రజలపై ప్రభావం చూపించలేకపోయింది. సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకోవడంలో కూడా కాంగ్రెసు జాప్యం చేసింది. పొత్తు కుదరక ముందు నుంచే ప్రియాంకగాంధీని ప్రధాన ప్రచారకురాలిగా రంగంలోకి దించి విస్తృతంగా ప్రచారం చేయించాలని ప్రశాంత్‌ ప్లాన్‌ చేశారు. చివరకు అదీ కాలేదు. ఎప్‌పీతో పొత్తు కుదిరాక కాంగ్రెసు పోటీచేసే 150 నియోజక వర్గాల జాబితాను ప్రశాంత్‌ తయారుచేశారు. కాని అఖిలేష్‌ అతి కష్టమ్మీద 105 సీట్లు కేటాయించారు. మధ్యలో రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు సీట్ల పంపకంపై అఖిలేష్‌తో ప్రియాంక గాంధీ ఒంటరిగా చర్చలు జరిపారు. రాహుల్‌ తిరిగొచ్చాక ఎంత ప్రయత్నించినా సీట్లు పెరగలేదు. 'ది బాయ్‌ వండర్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌'గా మీడియా ప్రశంసించిన ప్రశాంత్‌ ఫలితాల ముందురోజు వరకు కూడా కాంగ్రెసు-ఎస్పీ కూటమికి 190 సీట్లు, బీజేపీకి 150 కంటే తక్కువగా, బీఎస్పీకి 70 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కాని అంచనా దారుణంగా తప్పింది. పంజాబ్‌లో కాంగ్రెసు విజయం సాధించడంలో ప్రశాంత్‌ కృషి ఉన్నప్పటికీ అదంతా అమరీందర్‌ సింగ్‌ ఖాతాలోకి పోయింది. ఇక 22 ఏళ్ల క్రితం గుజరాత్‌లో కోల్పోయిన అధికారాన్ని సాధించడం కాంగ్రెసు కల. 

గుజరాత్‌లో ప్రశాంత్‌ను వ్యూహకర్తగా పెట్టుకోవాలని కాంగ్రెసుకు ఎందుకు ఆత్రంగా ఉంది? ఆయనలో ఏం చూసి మళ్లీ బాధ్యత ఇవ్వాలనుకుంటోంది? ఈ ప్రశ్నలకు కాంగ్రెసు నాయకులు కొందరు సమాధానాలు ఇస్తు న్నారు. ఏమిటవి? 1. గుజరాత్‌ రాజకీయాలు ప్రశాంత్‌ కిషోర్‌కు కొత్త కాదు. 2012లో నరేంద్ర మోదీ ప్రచార విభాగానికి ఆయనే అధిపతి. 2. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి ప్రశాంత్‌ వ్యూహ బృందం ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐపిఎసి) కృషే కారణం. 3. బీజేపీతో బంధం తెగిపోయాక 2015లో బిహార్లో గ్రాండ్‌ అలయన్స్‌ను గెలిపించి నితీష్‌ సీఎం అయ్యేందుకు దోహదం చేశారు. ఆ కూటమిలో కాంగ్రెసు కూడా భాగస్వామిగా ఉంది. 4. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీని, ఉత్తరాఖండ్‌ను గెలవలేకపోయినా పంజాబ్‌లో ఘన విజయం సాధించడానికి ప్రశాంత్‌ కృషే కారణం. ఆయన పాత్రను కాంగ్రెసు అధికారికంగా ప్రశంసించింది. సీఎం అమరీందర్‌ సింగ్‌ కూడా కొనియాడారు. 

-నాగ్‌ మేడేపల్లి