Advertisement


Home > Politics - Gossip
'చంపండి' తిట్లు ప్రశాంత్‌ ప్లానా?

రాజకీయ పార్టీలు వ్యూహకర్తలను నియమించుకోవడం ఈనాటి రాజకీయాల్లో ట్రెండ్‌. రాజకీయాలను, ప్రధానంగా ఎన్నికలను కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌లా, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లా నిర్వహించాలనుకుంటే అందుకు తగిన నిపుణులు అవసరం. వారు రాజకీయ నాయకులు కారు. ఐఐటీల్లో, ఐఐఎంల్లో చదువుకున్న ఉన్నత విద్యావంతులు. అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు చేసినవారు. వారి ఆలోచనలు రాజకీయ నాయకుల ఆలోచనల కంటే భిన్నంగా ఉంటాయి.

అలాగని నాయకులను కాదని ఏమీ చేయలేరు. నాయకుల ఆలోచనలు తీసుకొని, తమ బుర్రలకు పదును పెట్టి విభిన్న వ్యూహాలు తయారుచేస్తారు. ప్యూహకర్తలను నియమించుకున్నంతమాత్రాన పార్టీల అధినేతలు పనికిమాలినవాళ్లో, చేతకానివారో కాదు. గత సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో, బిహార్‌లో మహాకూటమి విజయంలో, పంజాబ్‌లో కాంగ్రెసు అధికారంలోకి రావడంలో ప్రశాంత్‌ కిషోర్‌ పాత్ర ప్రముఖంగా ఉంది కాబట్టే వైకాపా అధినేత జగన్‌ ఈయన్ని తన వ్యూహకర్తగా పెట్టుకున్నారు. 

ఆయన వ్యూహకర్త అయిన పాపానికి ఏపీ టీడీపీ నాయకులు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్‌ చేతకానివాడని, సొంతంగా గెలిచే సత్తా లేక వ్యూహకర్తను పెట్టుకున్నాడని రాళ్లు వేస్తున్నారు. ఈ మాట ప్రధాని మోదీని అనగలరా? భవిష్యత్తులో చంద్రబాబు కూడా వ్యూహకర్తను పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు. రాజకీయాల్లో ఇదో మార్పని అర్థం చేసుకోవాలి.

ఇదిలాఉండగా జగన్‌ చేసే ప్రతి పని వెనకా, మాట్లాడే ప్రతి మాట వెనకా ప్రశాంత్‌ కిషోర్‌ హస్తముందని, ఆయన సలహా ప్రకారమే నంద్యాల ఉప ఎన్నికలో జగన్‌ ప్రచారం సాగుతోందని టీడీపీ నాయకులంటున్నారు. ఒకటి రెండు పత్రికల్లో, ఓ టీవీ ఛానెల్లో ఇదే వాదన కనిపించింది. వ్యూహకర్త అంటే స్పూన్‌ఫీడింగ్‌ చేసేవాడని జగన్‌ ప్రత్యర్థులు అనుకుంటున్నారు. వ్యూహకర్త  అనేవాడు అధినేత మాట్లాడే మాటలను కూడా ప్లాన్‌ చేస్తాడా? స్క్రిప్టు రాసిస్తాడా? అనే ప్రశ్నలకు  'అవును' అనే అంటున్నారు కొందరు నాయకులు.

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో జగన్‌ చాలా వీరావేశంతో ప్రసంగాలు చేస్తున్నాడు. ఆయన ప్రసంగాలు వింటే వీరావేశం అనే మాట కూడా తక్కువేమోననిపిస్తోంది. ఆయనకు నిజంగానే ఆవేశం, ఆవేదన కలుగుతున్నాయా? వేడి పెంచడానికి, బాబుపై ప్రజలకు కోపం తెప్పించడానికి, వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కోసం ఇలా చేస్తున్నాడా? అనేది తెలియదు. సీఎం చంద్రబాబును నిలదీయడం, ప్రశ్నించడం, విమర్శించడం.. ఇదంతా బాగానే ఉంది.

కాని 'నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు' అనడం, దానిపై ఈసీకి వివరణ ఇచ్చిన మరుసటి రోజే 'ఇలాంటి ముఖ్యమంత్రిని ఉరి తీస్తే తప్పేమిటి?' అనడం సరైంది కాదనిపిస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఆవేదనతో పరుషంగా మాట్లాడానని ఈసీకి వివరణ ఇచ్చిన వెంటనే మళ్లీ అదే విధంగా అనడమేమిటో అర్థం కావడంలేదు. మొదటిసారి కాల్చమన్నారు. రెండోసారి ఉరి తీయాలన్నారు. అంటే రెండుసార్లూ 'చావు' మాటలే మాట్లాడారు. మరోసారి ఈసీకి వివరణ ఇచ్చుకోవల్సి వస్తుందేమో...!

మొదటిసారి ఆవేదనతో మాట్లాడారు. రెండోసారి ఆవేశంతో మాట్లాడారా? ప్రచారం ముగిసేలోగా ఇంకెన్నిసార్లు చంపుతారో...! జగన్‌ మాట్లాడిన 'చావు' మాటలు ఆయన స్థాయిని తగ్గిస్తాయా? పెంచుతాయా? ఈ ఆవేశం గెలుపుకు మార్గం వేస్తుందా? పరాజయానికి దారి తీస్తుందా? అనేది ఎవరికివారు ఆలోచించుకోవల్సిందే. టీడీపీ నాయకులు అనేకసార్లు జగన్‌ ఇలాంటి మాటలే అన్నారని వైకాపా నాయకులు సమర్ధించుకోవచ్చు. తప్పు లేదు.

కాని వారు చేసిన తప్పు వీరు చేయకుండా ఉంటే వారిని దోషులుగా నిలబెట్టవచ్చు. ఇప్పుడా అవకాశం లేదు. అందరూ ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక జగన్‌ ప్రసంగాల్లో 'చావు' తిట్లు ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహంలో భాగమేనని కొందరంటున్నారు. అంటే 'మీరు ఫలానవిధంగా తిట్టండి' అని జగన్‌కు ప్రశాంత్‌ చెప్పారా? ఇదేనా వ్యూహకర్త చేయాల్సిన పని?

ప్రశాంత్‌ను నియమించుకోకముందు జగన్‌ ఇంత ఆవేశంగా ఎప్పుడూ మాట్లాడలేదా? పరుష పదజాలం వాడలేదా? ఆవేశంగా, పరుషంగా మాట్లాడటమే ఈనాటి రాజకీయ నాయకుల ట్రెండ్‌. జగన్‌ కూడా ఆ తానులో ముక్కే కదా. ఎలా మాట్లాడాలనేది ప్రత్యేకంగా ప్రశాంత్‌ నేర్పిస్తాడంటే నమ్మశక్యంగా ఉందా? వ్యూహకర్తంటే ఫలానవాడిని చంపండి, నరకండి, ఉరేయండి.. అని చెప్పేవాడు కాదు. పార్టీ గెలుపు కోసం లోతుగా ఆలోచించి ప్లాన్స్‌ రూపొందించేవాడు. ప్రశాంత్‌ ఆ పనే చేస్తున్నాడు తప్ప జగన్‌కు తిట్లు నేర్పుతూ కూర్చోడు. అందుకు కాదు ఆయనకు భారీ ప్యాకేజీ ఇచ్చేది. జగన్‌ ఎలా మాట్లాడినా అందుకు ఆయనే బాధ్యత వహిస్తారు.