Advertisement

Advertisement


Home > Politics - Gossip

బీజేపీకి స‌ర్వేల జాకీలు కూడా లేవే ఈ సారి!

బీజేపీకి స‌ర్వేల జాకీలు కూడా లేవే ఈ సారి!

గ‌త ఏడాది జ‌రిగిన బిహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంలో.. ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు నుంచి.. అదిగో బీజేపీ కూట‌మిదే విజ‌యం, ఇదిగో బీజేపీ కూట‌మిదే విజ‌యం.. అంటూ బోలెడ‌న్ని స‌ర్వేలు పంపుకొట్టాయి. ఒక‌ట‌ని కాదు.. అన్ని సర్వేల‌దీ అదే పాట‌! లాలూ త‌న‌యుడి నాయ‌క‌త్వంలోని కూట‌మి చిత్తు చిత్తు అవుతుందంటూ శకునం చెప్పాయి వివిధ స‌ర్వేలు. 

జేడీయూ- బీజేపీ కూట‌మి ప్ర‌భంజ‌నం లాంటి విజ‌యం సాధిస్తుందంటూ స‌ర్వేలు ప్ర‌గ‌ల్బాలు ప‌లికాయి. ఈ స‌ర్వేల‌న్నీ చూసిన బిహార్ అవ‌త‌ల ప్ర‌జ‌లు.. ఆ ఎన్నిక‌లు పూర్తిగా వ‌న్ సైడెడ్ గా ఉంటాయ‌నే అనుకున్నారు. అయితే తీరా పోలింగ్ త‌ర్వాత క‌థ మారింది! వివిధ ఎగ్జిట్ పోల్స్ అనూహ్య‌మైన ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించాయి.

ప్రీ పోల్ స‌ర్వేల‌న్నీ క‌మ‌లం కూట‌మికి జై కొడితే, పోస్ట్ స‌ర్వేలు అబ్బే.. అంత సీన్ లేద‌న్నాయి. ఆర్జేడీ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌న్నాయి. ఆర్జేడీనే అధికారం సొంతం చేసుకోవ‌చ్చు కూడా అని అంచ‌నాలు వేశాయి! ప్రీపోల్ స‌ర్వేల‌కు భిన్నంగా పోస్ట్ పోల్ స‌ర్వేలు స్పందించ‌డంతో.. ఫ‌లితాల‌పై అంద‌రి ఆస‌క్తీ నెల‌కొంది. 

అటు ప్రీ పోల్ స‌ర్వేలూ నిజం కాలేదు, పోస్ట్ పోల్ స‌ర్వేల అంచ‌నాలూ నిజం కాలేదు. పోటాపోటీ ఫ‌లితాలు వ‌చ్చాయి. చివరికి అధికారం ఎన్డీయే కూట‌మి సొంతం అయ్యింది. 

ఆశ్చ‌ర్యం ఏమిటంటే..  ఒక‌వేళ ప్రీ పోల్ స‌ర్వేలు బిహార్ లో పోటాపోటీ ప‌రిస్థితి ఉందని చెప్పి ఉంటే.. అస‌లు క‌థ ఎలా ఉండేదో అని! మీడియా విస్తృతం అయ్యాకా.. కొన్ని రాజ‌కీయ పార్టీల‌కు అనుకూలంగా స‌ర్వేల‌ను వ‌ద‌ల‌డం జ‌రుగుతూ ఉంది. ఈ విష‌యంలో మీడియా అనేక విష వ్యూహాల‌ను ప‌న్నుతూ ఉంటుంది.

త‌ను అభిమానించే పార్టీనే ఎన్నిక‌ల్లో గెల‌వ‌బోతోంది అని చెప్పడంతో మొద‌లుపెడితే, ఆఖ‌రికి పండితుల జోస్య‌మంటూ కూడా త‌ను అనుకున్న పార్టీకి అనుకూలంగా ప్ర‌చారం చేసి పెడుతూ ఉంటుంది. బిహార్ స‌మ‌యంలో అదే జ‌రిగింద‌నే అభిప్రాయాలు బ‌లంగా ఉన్నాయి. ఎన్డీయే కూట‌మికి స్వీప్ చేస్తుందంటూ అప్పుడు ప‌దే ప‌దే మీడియా వ‌ర్గాలు జోస్యం చెప్ప‌డం  వెనుక కొన్ని వ్యూహాలున్నాయ‌నే అభిప్రాయాలు ఫ‌లితాల త‌ర్వాత బ‌ల‌ప‌డ్డాయి. 

ఇక బెంగాల్, త‌మిళ‌నాడు ఇత‌ర రెండు రాష్ట్రాల‌, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నిక విష‌యానికి వ‌స్తే.. ఈ సారి స‌ర్వేలు కూడా క‌మ‌లం పార్టీకి అనుకూలంగా రావ‌డం లేదు! ప్ర‌త్యేకించి బీజేపీ ఎటు తిరిగీ అధికారాన్ని సొంతం చేసుకోవాల్సిందే అనే లెక్క‌లేసిన ప‌శ్చిమ‌బెంగాల్ విష‌యంలో అయితే.. మ‌మ‌త‌కే మ‌రోసారి పీఠం అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి వివిధ ప్రీ పోల్ స‌ర్వేలు. 

వ‌ర‌స‌గా మూడోసారి ముఖ్య‌మంత్రి కావ‌డం అంటే అది ఎవ‌రికైనా మాట‌లు కాదు. అందునా.. బీజేపీ అత్యంత భారీ స్థాయిలో క‌స‌ర‌త్తు చేసింది ప‌శ్చిమ‌బెంగాల్ లో. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సానుకూల ఫ‌లితాల త‌ర్వాత బీజేపీ అక్క‌డ ఎంత క‌స‌ర‌త్తు చేసిందో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. టీఎంసీని చాలా వ‌ర‌కూ చీల్చి త‌నలో క‌లిపేసుకుంది.

బీజేపీ జాతీయాధ్య‌క్షుల వారితో స‌హా అనేక మంది ముఖ్య నేత‌లు బెంగాల్ రాజ‌కీయాల‌కు తీవ్రంగా ప‌దును పెడుతూనే ఉన్నారు. అయినా.. ప్రీ పోల్ స‌ర్వేలు మాత్రం మ‌మ‌త‌కే ప‌ట్టం క‌డుతున్నాయి. బీజేపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష స్థాయి వ‌ర‌కూ రావొచ్చంటున్నాయి.

మ‌రి ఈ ప్రీ పోల్ స‌ర్వేలు కూడా క‌చ్చితంగా నిజం అవుతాయ‌ని చెప్ప‌లేం కానీ, ఇది వ‌ర‌కూ వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీకి ముందుగానే ప‌ట్టం క‌ట్టిన స‌ర్వేల‌తో పోలిస్తే.. బెంగాల్ స‌ర్వేలు మాత్రం భిన్నంగా ఉన్నాయని మాత్రం స్ప‌ష్టం అవుతోంది.

నిస్సహాయ స్థితిలో ఎపి భారతీయ జనతా పార్టీ

పవన్ ఓ మానసిక రోగి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?