cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘ముందస్తు’.. మగతనం నిరూపణకేనా?

‘ముందస్తు’.. మగతనం నిరూపణకేనా?

అయిదేళ్ల కోమారు ఎన్నికలు జరిగే మన దేశంలో.. ప్రభుత్వ పదవీకాలం ఇంకా మిగిలి ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది మామూలు పరిస్థితుల్లో అయితే ఒక అసాధారణ నిర్ణయం. కొన్ని తప్పనిసరి, ప్రత్యేక పరిస్థితుల్లో అవసరం ఏర్పడుతుందని.. ఆ వెసులుబాటు మన చట్టంలో ఉంది. సాధారణంగా రాజకీయ అవసరాల కోసం ఇలాంటి ముందస్తు ఎన్నికల నిర్ణయాలు వస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు.

సహజంగా ఇది కూడా రాజకీయ నిర్ణయమే అని అంతా అనుకుంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి కేంద్రంలో చక్రంతిప్పుతూ ఉండాలనే కోరికతో ఉన్న కేసీఆర్, అందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరుపుతున్నారనేది ఒక ప్రచారం. అలాగే భారతీయ జనతాపార్టీతో కుమ్మక్కు అయ్యారని, ఎంపీ ఎన్నికల్లో అది బయటపడుతుందని, ఆ ప్రభావం ఎమ్మెల్యే ఎన్నికల మీద కనిపించకుండా ఉండడానికి ముందస్తు ఎన్నికలకు వస్తున్నారనే ప్రచారం ఎటూ ఉండనే ఉంది.

అయితే వీటన్నింటితో పాటూ కేసీఆర్ తన వ్యక్తిగత ప్రతిష్ట.. తన చరిష్మా నిరూపించుకోవడానికి కూడా ఇలా ‘అవసరం లేని’ ముందస్తు ఎన్నికలకు గంట మోగించారా? అనే అనుమానం కూడా ఆయన మాటలను బట్టి కలుగుతోంది. కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఎవ్వరికీ కలిసొచ్చిన దాఖలాలు లేవని చరిత్ర చెబుతోంది కదా.. అని విలేకర్లు ప్రశ్నించినప్పుడు ఆయన భిన్నంగా స్పందించారు.

‘‘కేసీఆర్ గెలుస్తాడు. చంద్రబాబు ఎన్టీఆర్ కన్నా మొగోణ్ని కావొద్దా’’ అంటూ కేసార్ నిలదీశారు. ‘‘చెన్నారెడ్డి వల్ల సాధ్యంకాని తెలంగాణ తెచ్చి చూపించి నిరూపించుకున్నా కదా’’ అని కూడా ముక్తాయించారు. చూడబోతే.. తన మగతనం చాటుకోవడానికే కేసీఆర్ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని అనిపిస్తోంది. నిజానికి ఎన్నికల రూపేణా ప్రభుత్వం మీద అధికవ్యయం భారం పడకుండా ఉండేందుకు ముందస్తు ఎన్నికలకు వెళితే అది మంచి నిర్ణయం.

రాజకీయంగా ఇప్పుడైతే అనుకూలం, తర్వాత పరిస్థితులు మారిపోతాయి... అని కొన్ని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నా అర్థం చేసుకోవచ్చు. అలాంటి నేపథ్యాలేమీ లేకుండా.. కేవలం ‘‘మగతనం’’ నిరూపించుకోవడానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది.