Advertisement


Home > Politics - Gossip
ప్రజలకేం ఒరిగింది అమరేశ్వరా?

చెన్నైలోని సదావర్తి భూముల విషయంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా అక్రమంగా విక్రయించారనే వ్యవహారం ఇప్పుడే ఒక కొలిక్కి వచ్చింది. మొత్తం 83 ఎకరాల భూమి... కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదంటూ తమ సొంత మనుషులకు చంద్రబాబు కేవలం 22 కోట్లకు కట్టబెట్టేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు పుణ్యమాని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దానిని 27 కోట్లకు సొంతం చేసుకోబోతున్నారు.

ఈ వ్యవహారం మొత్తాన్ని మరింత లోతుగా గమనిస్తే... పార్టీలు- విభేదాలతో నిమిత్తం లేకుండా వందల, వేల కోట్ల రూపాయల విలువైన భూములను నాయకులు- నాయకులు కలిసి పంచేసుకున్నట్లుగా ఉన్నదే తప్ప.. ప్రజలకు లేదా ప్రభుత్వానికి ఏం ఒనగూరినట్లు? ఈ భూములను అసలైన ధరకు విక్రయించగలిగినప్పుడు... ప్రభుత్వానికి (ప్రజలకు) ఒనగూరగల లాభంతో పోలిస్తే.. ఇప్పటికీ వందల కోట్ల అన్యాయమే జరుగుతోంది. ఈ ఘోరాన్ని చక్కదిద్దేదెవరు? ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన వ్యాజ్యం ద్వారా ప్రజా ప్రయోజనం సిద్ధించిందా... అనేది అనుమానంగానే ఉంది!!

చెన్నైలో ఉన్న సదావర్తి భూముల వ్యవహారం ఇటీవలి కాలంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. తమకు కావాల్సిన వారికి అడ్డగోలుగా అమ్మేసింది. ఈ భూములు గుంటూరు జిల్లా అమరావతి లోని అమరేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న సదావర్తి సత్రానికి చెందిన ఆస్తి. చెన్నైకు అత్యంత సమీపంలో ఉన్న ఈ భూముల మార్కెట్ విలువ వేల కోట్ల రూపాయలని విపక్షం చెబుతుంటుంది.

అంత కాకపోయినా 83 ఎకరాల సువిశాల విస్తీర్ణంలోని భూములు వందల కోట్ల ధర పలుకుతాయన్నది వాస్తవం. అయినవారికి దోచిపెట్టడంలో... తద్వారా అక్రమాలకు తెరతీయడంలో శాస్త్రీయమైన దోపిడీ విధానాలను చంద్రబాబు ప్రభుత్వం ఆవిష్కరిస్తూ ఉంటుంది. అలాగే... ఈ సదావర్తి భూములను కూడా తమకు అయినవారికి దోచిపెట్టేశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారనే సామెత చందంగా తెలుగుదేశం నాయకులు కొందరు కలిసి కేవలం 22 కోట్ల రూపాయలకు ఈ 83 ఎకరాల భూములను.. ఒక రకంగా కాజేశారు. దాని మీద తొలినుంచి వైఎస్సార్ సీపీ గొడవ చేస్తూ వచ్చింది.

సహజంగానే.. మాటలతో దబాయించి తిమ్మిని బమ్మి చేసే తన వైఖరినే చంద్రబాబు ఇక్కడ కూడా ప్రయోగించారు. అవి పనికిరాని భూములు. కావాలంటే ఓ 5 కోట్లు ఎక్కువ ఇచ్చేసి మీరే తీసుకోండి.. అంటూ ప్రల్లదనపు మాటలు పలికారే తప్ప.. అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ఈలోగా.. కోర్టు వ్యాజ్యాల ద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి ఊపిరి ఆడనివ్వకుండా, వారి అరాచకాలు సాగనివ్వకుండా పోరాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దాని మీద విచారణ సాగింది.

ఇప్పటికి హైకోర్టు తీర్పు చెబుతూ.. 5 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించి (అంటే మొత్తం 27 కోట్లకు) ఆ భూములను వ్యాజ్యం వేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకోవచ్చునంటూ పేర్కొన్నది. తనకు స్థోమత లేదు గనక, ఆ మొత్తం చెల్లించగల మరో వ్యక్తిని తీసుకువస్తానంటూ ఆళ్ల కోర్టుకు నివేదించారు.

కట్ చేస్తే... 

ఈ వ్యవహారంలో ఇప్పటికైనా ప్రజలకు- లేదా భూముల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఒనగూర వలసిన మేలు ఏం జరిగినట్లు? భూమి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుందన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం. కోర్టులో వాద ప్రతివాదనలు కూడా అలాగే జరిగాయి. కానీ అంత విలువైన భూమిని ఇదివరలో 22 కోట్లకు తెలుగుదేశం నాయకులు దోచుకుంటే.. ఇప్పుడు 27 కోట్లకు వైకాపా నాయకులు, లేదా వారి అనుకూలురు  పొందుతున్నారు.

ఏం జరిగితే బాగుండేది...

కేవలం అయిదుకోట్లు అదనంగా చెల్లించి ఆళ్ల తీసేసుకోవచ్చునంటూ హైకోర్టు తీర్పు ఇవ్వకుండా మరోలా చేసి ఉంటే ప్రభుత్వానికి మరింత లాభం జరిగేది. 27 కోట్లు ప్రారంభ ధరగా నిర్ణయించి.. ప్రభుత్వం వాటికి బహిరంగ వేలం నిర్వహించాలని.. 27 కోట్ల కంటె అదనంగా వేలం పాట పాడగల వారెవ్వరూ రాని పక్షంలో, ఆ మొత్తానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకోవాల్సి ఉంటుందని తీర్పు వచ్చి ఉంటే ప్రభుత్వానికి, ప్రజలకు లాభం ఒనగూరి ఉండేది.

చంద్రబాబు ప్రభుత్వం.. ఎంత భారీగా ప్రభుత్వ ఖజానాకు కన్నం వేయదలచుకున్నదో కూడా ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమై ఉండేది. ఇంతకూ అమరేశ్వరుడి భూములు మాత్రం.. అనుచితమైన విలువకే ధారాదత్తం అయిపోతున్నాయి.