Advertisement


Home > Politics - Gossip
చంద్రబాబు రేంజిలో రఘువీరా సెలవిచ్చారే!

2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఒక పెద్ద కామెడీ ప్రకటన చేశారు. తెలంగాణ ఎన్నికల బరిలోకి అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ.. తెలంగాణ లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే గనుక.. బీసీలను ముఖ్యమంత్రిని చేస్తాం అని ఆయన చాలా ఘనంగా, ఆర్భాటంగా ప్రకటించారు. తీరా ఎన్నికల పర్వం సమయానికి తెలుగుదేశం తరఫున బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి అవుతారని కూడా సెలవిచ్చారు. బీసీల మీద చంద్రబాబు చూపిస్తున్న ప్రేమను గమనించి అప్పట్లో  యావత్తు తెలుగురాష్ట్రాల ప్రజలు.. విచ్చలవిడిగా నవ్వుకున్నారు.

ఎందుకంటే అప్పటికే తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో దారుణంగా దెబ్బతిని ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం లోకి వచ్చే ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అలాంటి పార్టీ తరఫున.. అధికారానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడాన్ని మించిన కామెడీ మరొకటి ఉండదని అంతా అనుకున్నారు.

ఇప్పుడు అదే కామెడీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘువీరారెడ్డి చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అందరికీ తెలుసు. 2014 ఎన్నికల్లో సర్వనాశనం అయిపోయిన ఆ పార్టీ 2019 ఎన్నికల్లోనైనా ఒక్క సీటునైనా గెలుచుకుంటుందంటే అనుమానమే. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిచోట్ల వారికి డిపాజిట్లు దక్కితే అంత గొప్పగా బాగుపడినట్లు లెక్క. అలాంటి పార్టీ.. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎన్ని శతాబ్దాలు పడుతుందో ఇప్పుడు చెప్పలేం. అంతగా శిథిలమైపోయింది.

ఆ పార్టీ పీసీసీ చీఫ్ మాత్రం చాలా డాంబికపు ప్రకటన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే దళితుడినే సీఎం చేస్తాం అని ఆయన అంటున్నారు. ఎటుతిరిగీ తమకు అధికారం దక్కే అవకాశం లేదన్నప్పుడు నాయకులకు నిమ్న కులాల మీద ఎక్కడలేని ప్రేమ పొంగుకొస్తుంది. తెలంగాణలో తమ పార్టీకి ఠికానా లేకుండాపోయాక.. చంద్రబాబు బీసీని సిఎం చేస్తా అన్నారు.

తెరాస అధికారంలోకి రావడం గురించి నమ్మకం లేని పాతరోజుల్లో.. దళితుడిని సీఎం చేస్తా అని కేసీఆర్ అన్నారు. అధికారం దక్కగానే మాట మార్చారు. ఇప్పుడు ఏపీలో పార్టీ సర్వనాశనం అయ్యాక.. గెలిపిస్తే దళితుడిని సీఎం చేస్తాం అని రఘువీరా అంటున్నారు. ఇదే కాంగ్రెస్ కు నిజంగా అధికారం దక్కితే.. ముఠానాయకులంతా పదవులకోసం కొట్టుకోకుండా ఉంటారా? అనేద జనంలో మెదలుతున్న సందేహం.