Advertisement


Home > Politics - Gossip
రఘువీరా తలనొప్పికి మందేమిటి?

ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత ఒకే పార్టీ ఒక రాష్ట్రంలో బలంగా ఉండగా, మరో రాష్ట్రంలో బలహీనంగా ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ బలహీనంగా కనబడుతున్నా ఒక రాష్ట్రంలో మెరుగ్గా ఉంటూ, మరో రాష్ట్రంలో అధ్వాన స్థితిలో ఉంది. టిడిపితోపాటు కాంగ్రెసు, బిజెపి ఈ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఏపీలో టిడిపి బలం తగ్గలేదని తాజాగా జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికలు నిరూపించాయి.

కాని తెలంగాణలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఆంధ్రాలో బిజెపితో కలిసి పోటీ చేయబోతుంటే, తెలంగాణలో ఒంటరిగా మిగిలిపోయింది. తెలంగాణలో కాంగ్రెసు అంతో ఇంతో బలంగా ఉండి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుండగా, ఆంధ్రాలో పూర్తిగా నీరసించింది. మొన్నటి ఎన్నికల్లో ఇది మరింత స్పష్టమైంది. బిజెపి తెలంగాణలో బలంగా లేకపోయినా అధికారంలోకి వస్తామని రంకెలు వేస్తోంది. ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది.

ఆంధ్రాలో మొన్నటివరకు దాదాపు ఇలాంటి పరిస్థితే ఉన్నా, నంద్యాల, కాకినాడ ఎన్నికల తరువాత టిడిపికి అణిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. టిడిపి అండ లేకుంటే మనుగడ కష్టమని భావిస్తోంది. సరే..ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రెండు రాష్ట్రాల్లోనూ పూర్తిగా చితికిపోయాయనుకోండి. అదే వేరే కథ. ఇక కాంగ్రెసు విషయానికొస్తే... తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కొనసాగుతారు.

ఆయన నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయినా చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయనుకుంటున్నారు. ఈమధ్య బాగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అధిష్టానానికి దిక్కుతోచని పరిస్థితి ఉన్నది ఏపీలోనే. రాష్ట్రాన్ని విభజించిన పాపానికి గత ఎన్నికల్లో ప్రజలు 'శూన్యహస్తం' చూపించి శాస్తి చేశారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికలనాటికి అంతా మర్చిపోతారని, మళ్లీ ఆదరిస్తారని అనుకుంది నాయకత్వం. కాని అలాంటి సూచనలు కనబడటంలేదు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రఘువీరా రెడ్డిని మార్చాలని కొందరు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ బతకడం సాధ్యం కాదంటున్నారు. కాని అధిష్టానం ఆయన పట్ల సానుభూతి కారణంగానో లేదా మరో నాయకుడు కనబడకపోవడంవల్లనో పదవీ కాలం ముగిసి ఏడాది దాటినా ఆయన్నే కొనసాగిస్తోంది. రఘువీరా పట్ల సానుభూతి ఎందుకంటే విభజన తరువాత ఏర్పడిన క్లిష్ట పరిస్థితిలో పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి. 

తెలంగాణలో ఉత్తమ్‌ కుమార్‌ నేతృత్వంలోనే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించిన అధిష్టానం ఏపీలో అలాంటి ప్రకటన చేయలేకపోతోంది. అక్కడ ఎంతటి మొనగాడు అధ్యక్షుడైనా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. చెప్పుకోదగిన సీట్లు వస్తాయా? అంటే అదీ అనుమానమే. రఘువీరాను మార్చాలనుకుంటే ముందుకు వచ్చేదెవరు? మెగాస్టార్‌ చిరంజీవి అయితే బాగుంటుందనే ఆలోచన చేశారు. కాని ఆయన విముఖత వ్యక్తం చేశారని వార్తలొచ్చాయి.

అధికారం సంగతి తరువాత కనీసం చెప్పుకోదగిన స్థానాలు కూడా సంపాదించలేని స్థితిలో ఉన్న పార్టీకి నేతృత్వం వహించడమంటే తలనొప్పితో బాధపడటమే. రఘువీరా కూడా అధ్యక్ష పదవిని వదిలించుకుందామని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తనను ఏదైనా రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపితే బాగుండునని కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో కేంద్ర మాజీ మంత్రులు చిరంజీవి, రేణుకా చౌదరి రాజ్యసభ నుంచి రిటైర్‌ అవుతారు. వీరిని ఏం చేస్తారో...!

గత మూడేళ్లలో కాంగ్రెసు ఓటింగ్‌ పది శాతం పెరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు టిడిపి నాయకులతో చెప్పినట్లు గతంలో మీడియాలో వచ్చింది. కాని అలాంటి పరిస్థితి లేదని మొన్నటి ఎన్నికలు రుజువు చేశాయి. నంద్యాల ఉప ఎన్నికలో ఉనికి కోసం పోటీ చేసినా అదీ దక్కలేదు. గత ఎన్నికల్లో కంటే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెసుపై ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్న ప్రజాగ్రహం వచ్చే సాధారణ ఎన్నికల్లో అలాగే ఉంటుందేమో....!