cloudfront

Advertisement


Home > Politics - Gossip

రాహుల్ అంటే అంత వెటకారమా?

రాహుల్ అంటే అంత వెటకారమా?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఠికానా లేకపోవచ్చు గాక...  కానీ ఆ పార్టీ వారిలోనే తమ జాతీయ అధ్యక్షుడి పట్ల ఎంత వెటకారం ఉంటే ఎలా? ఇదేభావన బహుశా రాహుల్ కు కూడా కలిగి ఉండవచ్చు. బీభత్సంగా కష్టపడినప్పటికీ పార్టీ దారుణంగా ఓడిపోయిన తెలంగాణ నుంచి, ఎంపీగా పోటీ చేయాలంటూ, ఏకంగా రాహుల్ నే ఆహ్వానిస్తే అది వెటకారం కాక ఇంకేం అవుతుంది.

వివరాల్లోకి వెళితే ఈ వెటకారం పొంగులేటి సుధాకర్ రెడ్డి రూపేణా చోటుచేసుకుంది. పాపం... రాహుల్ గాంధీ తెలంగాణలో ఎందుకంత దారుణంగా ఓడిపోయామో... సమీక్షించుకోవడానికి... హస్తినలో సమావేశం పెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరినీ ఆహ్వానించారు. వారికి సుద్దులు చెప్పి, ఓటమికి కారణాలను వెతికి, భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించి, హితవు చెప్పి పంపాలనుకుంటే... ఆయనకు ఒక వెరైటీ అనుభవం ఎదురైంది.

ఖమ్మంజిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా రాహుల్ ను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కుదేలై పోగా... అంతో ఇంతో ఖమ్మం జిల్లాలో మాత్రం ఊపిరి నిలుపుకుంది. అంతే తప్ప పార్టీ బలంగా ఉన్న దాఖలాలు మాత్రంలేవు. 

అయితే ఆ మాత్రం ఉసురు ఉండడమే... మహద్భాగ్యం అని భావించారేమో తెలియదు గానీ... పొంగులేటి ఏకంగా రాహుల్ కు ఖమ్మం సీటు ఆఫర్ ఇచ్చారు. కావలిస్తే ఖమ్మంతో పాటు అమేథీలో కూడా పోటీ చేసుకోవచ్చునని వెసులుబాటు కూడా కల్పించారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో పంచుకోవడం విశేషం.

తన ప్రతిపాదనకు ‘సరే’ అంటూ రాహుల్ నవ్వుతూ బదులిచ్చారని... పొంగులేటి అంటున్నారు. పార్టీ సర్వభ్రష్టత్వం చెందిన తెలంగాణ నుంచి పోటీకి తనను ఆహ్వానిస్తోంటే... తానంటే పార్టీ నాయకులకు వెటకారం అయిపోయిందని రాహుల్ కు ఏడుపుతో కూడిన నవ్వు వచ్చి ఉండవచ్చు. అంతే కదా మరి.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?