Advertisement


Home > Politics - Gossip
రాహుల్‌ రాజీనామాయే పరిష్కారమా?

కాంగ్రెస్‌పార్టీ పగ్గాలను రాహుల్‌ గాంధీకి కాకుండా మరో నేతకు అప్పజెప్పాలని, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్వయంగా మళ్లీ పార్టీని 2004కు ముందు నడిపించినట్లు నడిపించాలని డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతున్నది. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎంపీలను ముందుకు నడిపించే నాథుడే లేకుండాపోయాడు. శీతాకాల సమావేశాల్లో పలు విన్యాసాలు చేసిన రాహుల్‌గాంధీ ఈ సమావేశాల్లో తోకముడిచి పలాయనం చిత్తగించారు. సోనియాగాంధీ తప్పనిసరై సభకు హాజరవుతూ కొంత అండగా నిలిచినప్పటికీ ఆమెలో మునుపటి వేగం, ఉత్సాహం కనపడడంలేదు. ఏమైనా కాంగ్రెస్‌ పార్టీ సంధిదశలో ఉన్నట్లు కనపడుతోంది. 

గతంలో పీవీ నరసింహారావు సమయంలో ప్రతిపక్షం అంత బలంగా లేకపోవడం, ఆ తర్వాత సోనియాగాంధీ రంగప్రవేశం చేయడంతో ఆ పార్టీ పుంజుకోగలిగింది. కాని ఇప్పుడు సోనియాగాంధీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉండడం, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఒక్క ఎన్నిక కూడా గెలిపించే స్థితిలో లేకపోవడం, రాహుల్‌గాంధీకి జనాకర్షణ లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా కుదేలయిపోయింది. నిజానికి గత కొంతకాలంగా సోనియాగాంధీ పార్టీ దైనందిన వ్యవహారాలు చూడడంలేదు. ప్రతి అంశానికి ఆమె రాహుల్‌నే ముందుకు తోస్తున్నారు. అయినప్పటికీ రాహుల్‌ గాంధీ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడం లేదు. ఆయన చెబుతున్నవి జనానికి ఎక్కకపోవడం, యువత కూడా ఆయన స్వీకరించే స్థితిలో లేకపోవడమే ఇందుకు కారణం. తన చుట్టూ ఆయన రాజకీయాలతో సంబంధంలేని వారిని చేర్చుకున్నారు.

వారికి రాజకీయాలతో సంబంధంలేదు. రాహుల్‌గాంధీ గురించి సోనియాకు పూర్తిగా తెలిసినందువల్లే ఆయనకు ఆమె ఒకేసారి పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టలేదు. ఉపాధ్యక్షుడుగా మాత్రమే నియమించారు. కాని బాధ్యతలు మాత్రం పూర్తిస్థాయిలో అప్పజెప్పారు. రాహుల్‌ కనుక ఉత్తరప్రదేశ్‌లో కనీసం తమకిచ్చిన వందసీట్లలో 50సీట్లైనా గెలిచి ఉంటే పార్టీ పగ్గాలు చేపట్టేవారు. కాని కాంగ్రెస్‌పార్టీ కుటుంబ నియోజకవర్గాలైన అమేథీ, రాయబరేలీలో కూడా దెబ్బతింది. మరి ఈ పరిస్థితుల్లో కూడా సోనియా రాహుల్‌ను ప్రోత్సహిస్తుందా.. అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాహుల్‌ లేకుండా సోనియా ఏమీ చేయలేరని, కాంగ్రెస్‌ పార్టీకి ఎంతనష్టం జరిగినా రాహుల్‌గాంధీనే ఆమె ప్రోత్సహిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఇది పూర్తిగా నిజం కాదేమో.

నిజానికి గత మూడేళ్లుగా రాహుల్‌గాంధీ పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ పార్టీ ఎక్కడా పుంజుకున్న దాఖలాలులేవు. రాహుల్‌గాంధీ 2014 ఎన్నికలముందే చురుకుగా పనిచేయడం ప్రారంభించారు. ఆయన చుట్టూ ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరిగేవారు. ఆయనను ఆకర్షించేందుకు వారు రకరకాల ప్రయత్నాలు చేశారు. రాహుల్‌గాంధీ కూడా పలు ఆకర్షణలకు లోనయ్యారు. పార్లమెంట సెంట్రల్‌ హాలులో ఆయన చేరితే ఆయన ఏమి మాట్లాడతారా అని అంతా చెవులు రిక్కించి వినేవారు. ఆయన ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను విమర్శించినా కాంగ్రెస్‌ నేతలు హర్షధ్వానాలు చేసేవారు.  కాని ఎక్కడా ఆయన పార్టీ యంత్రాంగాన్ని బాగుచేసిన దాఖలాలు కనపడడం లేదు. కనీసం రాజ్యసభ సీట్లను ఇచ్చే విషయంలో కూడా రాహుల్‌గాంధీ తన స్వంత విచక్షణ ఉపయోగించలేదు.

మళ్లీ పాత నాయకులే పాత ప్రలోభాలు చూపి రాజ్యసభకు ఎంపికయ్యారు. నాడు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేసినా రాహుల్‌గాంధీ ఏ మాత్రం కలుగ చేసుకోలేదు. రాష్ట్ర విభజన సమయంలో రాహుల్‌గాంధీ ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాలు తిరుగుతూ గడిపారు. మళ్లీ ఎన్నికలసమయంలో మాత్రం ప్రధాని అభ్యర్థిగా రంగప్రవేశం చేశారు. పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఆయన ఏ చర్యా తీసుకోలేదు. ఏఐసీసీలో పార్టీ ప్రధానకార్యదర్శులెవరితోనూ ఆయన పెద్దగా చర్చించిన పాపాన పోలేదు. ఎప్పుడో ఒకప్పుడు కాని ఆయన ఏఐసీసీ వచ్చేవారు. ఢిల్లీలో అజయ్‌ మాకెన్‌ లాంటి వారిని ఆయన ప్రోత్సహించారు. కాని కేజ్రీవాల్‌ రాకను రాహుల్‌ అడ్డుకోలేకపోయారు.

రాహుల్‌కు గనుక యువతలో ఆకర్షణ ఉంటే 2014లో నరేంద్రమోడీని గట్టిగా అడ్డుకునేవారు. కానినరేంద్రమోడీ ప్రభంజనం ముందు రాహుల్‌ కొట్టుకుపోయారు. మోడీ ఉపన్యాసాలకు ప్రజలు కేరింతలు కొడుతుంటే రాహుల్‌ ప్రసంగాలను బలవంతంగా వినాల్సివచ్చేది. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా కూడా రాహుల్‌ పెద్దగా రాణించలేకపోయారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ముందు ఆయన ఒక జోకర్‌గా తనను తాను నిరూపించుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలు చెబుతానని ఆయన ఒకరోజు ప్రకటించి తర్వాత తుస్సుమనిపించారు. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తే నేతలు ఆయనను పప్పుగా అభివర్ణించారు. సోషల్‌ మీడియాలో ఆయనపై జోకులు వెల్లివిరిసాయి. రాహుల్‌ గాంధీని నరేంద్రమోడీ చాలా తేలిగ్గా తీసుకుని కొట్టిపారేస్తే ఆయనను సమర్థించే కాంగ్రెస్‌ నేతలు లేకుండాపోయారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ నాయకత్వం మరింత పలచన బారింది. ఆయనను ఎంపీలు పెద్దగా గౌరవించే స్థితిలో కనపడడంలేదు. ఆయన పార్లమెంట్‌లో ప్రవేశిస్తే ప్రక్కకు తప్పుకునేవారు లేకపోయారు. ఈ విషయం తెలిసిన సోనియాగాంధీ అనారోగ్యంగా ఉన్నా తానే పార్లమెంట్‌కు రావాల్సి వచ్చింది. నిజానికి సోనియాగాంధీ కూడా స్వయంగా పార్టీ పగ్గాలు చేపట్టే స్థితిలో ఉన్నారా.. గతంలో బీజేపీ బలంగా లేనప్పుడు ఆమె అన్ని పార్టీలను కూడగట్టగలిగారు. ఎన్డీఏని బలహీనపరిచారు. పెద్దగా పార్టీని సోనియా పునరుద్దరించలేదు. యధాతథ స్థితిని కొనసాగిస్తూ తన విలువ, ఆధిపత్యం తగ్గకుండా చూసుకున్నారు. రాష్ట్రాల్లో పార్టీని ఏ మాత్రం ఆమె పునరుద్దరించలేదు. అహ్మద్‌పటేల్‌ లాంటివారు రాజ్యం చలాయించారు. చిదంబరం లాంటి వారు ఇష్టారాజ్యంగా వ్యవహించారు. ఆమె పార్టీ కన్నా కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీయే పూర్తిగా బలహీనంగా మారింది.

కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికలకు తావులేకుండా చేశారు. వర్కింగ్‌ కమిటీ సభ్యులందర్నీ నామినేట్‌ చేశారు. వర్కింగ్‌ కమిటీ సభ్యులకు కానుకలిచ్చి రాష్ట్రాల్లో పార్టీ నేతలు బలపడ్డారు. ఆ పార్టీ సంఖ్యాబలం గతంలో ఎన్నడూ లేనంతగా 44స్థానాలకు దిగజారింది. మిగతా పార్టీలు సోనియాగాంధీ నేతృత్వంలో కూడా పనిచేయలేని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ప్రజల్లోకి వెళ్లి జనరంజకంగా మాట్లాడి మెప్పించే సమర్థత ఎవరికీలేదు. తల్లీ కొడుకులు కాగితం చూస్తే కాని మాట్లాడే స్థితిలో లేరు. కాంగ్రెస్‌ హయాంలో నరేగా, రుణమాఫీ, సమాచార హక్కు, విద్యాహక్కు లాంటివి ఎన్నో మంచి చర్యలు తీసుకున్నా, అవి కుంభకోణాల మరుగున పడిపోయాయి. రాహుల్‌ లేకుండా కాంగ్రెస్‌పార్టీ ముందుకు సాగలేదా? ఆయన ఉంటే పార్టీకి మరింత నష్టం జరుగుతున్నప్పుడు ఆయన ఉంటే ఏమి, లేకపోతే ఏమీ అని ఎంపీలంతా చర్చించుకుంటున్నారు.

పార్టీలో యువనేతలకు కొదువలేదు. ఒకవేళ ప్రియాంకాగాంధీకి పగ్గాలు అప్పజెప్పడం సోనియాకు ఇష్టం లేకపోతే సచిన్‌ పైలట్‌, జ్యోతిరాదిత్య సింధియా, దీపాదాస్‌ మున్షీ, మనీష్‌ తివారీ, మిలింద్‌ దేవరా, రాగిణీ నాయక్‌ లాంటినేతలెందరో ఉన్నారు. ప్రతిరాష్ట్రంలో యువతకు పగ్గాలు అప్పజెప్పి, జాజీయ స్థాయిలో యువనేతలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు.