Advertisement


Home > Politics - Gossip
రజనీకాంత్‌.. ఏమిటీ విచ్ఛిన్న రాజకీయం?

ఒకవైపు ఆధ్యాత్మిక రాజకీయం అంటాడు.. అదేమో కానీ, అవకాశవాద రాజకీయం మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని రెండు దశాబ్దాల నుంచి చెబుతున్న రజనీకాంత్‌, తమిళనాట కొంత రాజకీయ శూన్యత కనిపిస్తున్న సమయంలో పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. బహుశా జయలలిత చనిపోయే వరకూ, కరుణానిధి ముసలాడైపోయి వీల్‌ చైర్‌కు పరిమితం అయ్యేంత వరకూ రజనీని దేవుడు ఆదేశించలేదేమో!

ఇక ఇప్పుడు దేవుడి ఆదేశానుసారం రాజకీయాల్లోకి వస్తున్న రజనీకాంత్‌.. కావేరీ సమస్యపై స్పందించిన తీరును ఇక్కడ ప్రస్తావించుకోవాలి. తమిళ సినీ నటులు ఈ వ్యవహారంపై స్పందించడం కొత్త ఏమీకాదు. కావేరీ జలాల కోసం వీళ్లు ఏటా దీక్షలు, ధర్నాలూ చేస్తూ ఉంటారు. కరువు తీవ్రత ఎక్కువైన సందర్భాల్లో వీరుదీక్షలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలా ప్రజాసమస్య మీద స్పందించడం ఓకే. అయితే తమిళనాడులో ప్రజల సమస్యలు అంటే కావేరీ మాత్రమే కాదు. ఇంకాచాలా సమస్యలున్నాయి.

అయితే కావేరీ గురించి స్పందిస్తే.. పబ్లిసిటీ వస్తుంది. మరో రాష్ట్రంపై పోరాటం తరహా దీక్షలు చేస్తే తమిళనాట పబ్లిసిటీ వస్తుంది. అందుకే ఈ హీరోలంతా ఈ అంశాన్ని అలా వాడేసుకొంటూ ఉంటారు. ఇక జల్లికట్టు గురించి కూడా స్పందించారని అనుకోవచ్చు. అయితే జల్లికట్టు గురించి స్పందించడమే మూర్కత్వం. ప్రతియేటా జల్లికట్టు ఆడుతూ అనేకమంది గ్రామీణులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎద్దులకు మద్యం తాపించి, వాటి కళ్లలోకి కారంకొట్టి జల్లికట్టు ఆడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు.

జల్లికట్టు ఆడటం వల్ల సినిమా హీరోల కుటుంబీకులకు ఇబ్బందిలేదు. కేవలం గ్రామీణులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి దానికోసం హీరోలు పోరాటం జరిపారు. కాబట్టి ఆ పోరాటం ప్రయోజనమేంటో అర్థంచేసుకోవాలి. ఇక తాజాగా రజనీకాంత్‌ కావేరీ ఆగ్రహాన్ని ఐపీఎల్‌ వైపు మళ్లించాడు. కావేరీ కోసం పోరాటం సమయంలో ఐపీఎల్‌ అవసరమా? అని రజనీ ప్రశ్నించాడు. కావేరీ వ్యవహారానికి, ఐపీఎల్‌కు సంబంధం ఏమిటి? అంటే.. బీరకాయ పీచు సంబంధం. అంతకు మించి ఏమీలేదు.

అయితే రాజకీయాల్లోకి వచ్చినందుకు రజనీ ఇలా మాట్లాడాడు. ఇంకేముంది.. ఆందోళన కారులు చేపాక్‌ స్టేడియం మీదపడ్డారు. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌కు అవాంతరాలు కల్పించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఇలా అయితేకాదు అని.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను చెన్నై నుంచి తరలించేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశం రజనీకాంత్‌ విచ్ఛిన్న రాజకీయం. సమస్యను ఐపీఎల్‌ మ్యాచ్‌ల మీదకు మళ్లించాడు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు అవసరమా? అని ప్రశ్నించాడు.

మరి ఇలా ప్రశ్నించిన రజనీకాంత్‌.. త్వరలోనే కాలా సినిమాను రిలీజ్‌ చేసుకుంటున్నాడు. అప్పుడు కూడా కావేరీ సమస్య ఇలానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కాలా సినిమా ఎందుకు? అని తనను తాను ప్రశ్నించుకోగలడా? కావేరీ సమస్యకు ఐపీఎల్‌ అడ్డం అయినప్పుడు, కాలా సినిమా ఎందుకు అడ్డుకాదు? ఐపీఎల్‌ను అడ్డుకున్నట్టే, కాలాను కూడా అడ్డుకుంటే సరిపోతుందా? లేక కాలాలో రజనీకాంత్‌ నల్ల షర్టు వేసుకున్నాడు కాబట్టి.. ఆ సినిమాను ఆడించేయవచ్చా?