రాజుగారు..రెండు పార్టీలు

హమ్మయ్య..జగన్ చేసిన పనితో ఓ క్లారిటీ వచ్చేసింది. రఘరామరాజు కు ఢోకాలేదు అని తేలిపోయింది. వైకాపాలో ఎలాగూ ఇక అవకాశం లేదు. రెండోసారి ఆ పార్టీకి దూరం కావడం అన్నది తప్పదు. అయితే అది…

హమ్మయ్య..జగన్ చేసిన పనితో ఓ క్లారిటీ వచ్చేసింది. రఘరామరాజు కు ఢోకాలేదు అని తేలిపోయింది. వైకాపాలో ఎలాగూ ఇక అవకాశం లేదు. రెండోసారి ఆ పార్టీకి దూరం కావడం అన్నది తప్పదు. అయితే అది ఇప్పుడా?  ఎప్పుడోనా? అన్నది పాయింట్. కానీ ఆ తరువాత ఏంటీ? అన్నది క్వశ్చను.

చాలా మంది బ్యాంక్ డిఫాల్టర్ నాయకుల మాదిరిగానే భాజపాలో ఆశ్రయం పొందుతారని ఇన్నాళ్లూ వినిపిస్తూ వస్తోంది. అయితే ఎంత వరకు అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ క్లారిటీ వచ్చేసింది. భాజపా జనాలు అంతా రఘురామరాజును వెనకేసుకు రావడం ద్వారా, ఆయనకు భాజపా ద్వారాలు తెరిచే వుంటాయన్న స్పష్టత ఇచ్చేసారు.

ఇక రెండో క్లారిటీ ఏమిటంటే, భాజపా కాకుండా తేదేపా వుండనే వుందన్నది. గతంలో కూడా ఆ పార్టీలోకి వెళ్లి వచ్చారు రఘురామరాజు. ఈసారి తలుపులు కొట్టినా తీయరేమో అన్న అనుమానం అక్కరలేదు. భాజాపా కన్నా ఎక్కువ ఆందోళన చెందారు. ఆందోళన చేసారు చంద్రబాబు. అందువల్ల అలాంటి రఘురామరాజు పార్టీలోకి వస్తానంటే వద్దంటారా?

పైగా రఘురామరాజు గతంలో అనేక సార్లు చెప్పారు. ఢిల్లీ వెళ్లాలంటే ఎయిర్ ఇండియానా, స్పైస్ జెట్ నా, ఇండిగోనా అన్నది కాదు పాయింట్. వెళ్లాలి అంతే. అదే విధంగా ఎంపీ కావాలంటే ఏ పార్టీ అయినా తనకు ఒకటే. తాను పార్టీలకు సేవ చేయాలనుకోవడం లేదు. 

జనాలకు సేవ చేయాలనే అన్నారు. అందువల్ల భాజపా, తేదేపా ల్లో ఆశ్రయం పొందడానికి రెడీగా వుంటారు. కానీ ఇప్పుడే కాదు, మరో మూడేళ్లు ఇలాగే నానా యాగీ చేసేసి అప్పుడు వెళ్తారు.

సరే, పార్టీల మద్దతు వుంది అన్న క్లారిటీ వచ్చింది అనుకుందాం. కానీ మళ్లీ ఆయనను ఎంపీగా గెలిపించగలవా? ఈ పార్టీలు? అన్నది పాయింట్. మూడేళ్ల తరువాత పోనీ జగన్ చరిష్మా తగ్గిపోయింది, బాబు చరిష్మా పెరిగిపోతుంది అని అనేసుకుందాం. 

కానీ జనాల్లో రఘరామరాజు పట్ల ఆదరణ ఎలా వుంటుంది? ఇన్నాళ్లు ఆయన మాట్లాడిన మాటలు, పార్టీని పట్టుకుని, పదవిని పట్టుకుని వేలాడుతూ, ఆ పార్టీని, ఆ పార్టీ నాయకులను తూలనాడుతూ చేసిన ప్రసంగాలు. జనాలకు తెలుసు.

ఈ టోటల్ ఉదంతం అంతా తెలిసిన జనం ఎలా స్పందిస్తారన్న క్లారిటీ కూడా రావాల్సి వుంది. అది వచ్చేస్తే రఘరామరాజు పొలిటికల్ కేరీర్ ముందుకు వెళ్తుందా? బ్రేక్ పడిపోయినట్లా? అన్నది తెలిసిపోతుంది. కానీ అంతకు ముందే పోటీకి మరోసారి దిగే సాహసం చేస్తారా? చేయరా? అన్నది కూడా అనుమానమే. దానికి కూడా క్లారిటీ  కూడా రావాల్సివుంది.