cloudfront

Advertisement


Home > Politics - Gossip

'రక్తచరిత్ర' వెనుకాల వున్నది ఎవరు.?

'రక్తచరిత్ర' వెనుకాల వున్నది ఎవరు.?

పరిటాల రవి హత్యకు స్కెచ్‌ వేసి, అది కుదరక.. జైలు పాలైన మద్దెలచెరువు సూరి, పరిటాల రవి హత్య అనంతరం జైలు నుంచి బయటకొచ్చాడు.. 'సూరి బావ కళ్ళలో ఆనందం చూసేందుకోసమే..' అంటూ మొద్దుశీను రూపంలో ఓ కొత్త క్యారెక్టర్‌ పుట్టుకొచ్చింది.. ఆ మొద్దుశీను, తాను పరిటాల రవిని చంపానంటూ సంచలనం సృష్టించాడు. ఆ మొద్దుశీను కూడా జైల్లో హత్యకు గురయ్యాడు.

మద్దెలచెరువు సూరి కూడా హత్యకు గురయ్యాడు. ఈసారి సూరిని చంపింది, అతని అనుచరుడు భానుకిరణ్‌. ఎప్పుడో ఏడేళ్ళక్రితం జరిగిన సూరి హత్య కేసులో నేడు తీర్పు వెలువడింది. భానుకిరణ్‌కి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కానీ, ఈ శిక్ష సరిపోదంటూ సూరి సతీమణి భానుమతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భానుకిరణ్‌కి మరణశిక్ష పడాల్సిందేనన్నది ఆమె డిమాండ్‌.

'నా భర్తను చంపింది భానుకిరణ్‌.. కానీ, చంపించింది పరిటాల సునీత..' అంటూ గంగుల భానుమతి ఆరోపిస్తున్నారు. సూరి హత్య విషయంలో తనకు న్యాయం కావాలని డిమాండ్‌ చేస్తున్నారామె. ఫ్యాక్షనిస్టుల జీవితం ఎలా వుంటుందో పరిటాల రవి, సూరి హత్యలు చూస్తేనే తెలుస్తుంది. ఇలాంటివి రాయలసీమ ఫ్యాక్షన్‌లో కోకొల్లలు కన్పిస్తాయి.

ఫ్యాక్షన్‌, రాజకీయం కలగలిసి.. అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో హత్యలు జరుగుతున్నాయి. పరిటాల కుటుంబం తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తోన్న విషయం విదితమే. ఆ పరిటాల రవి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ బ్రదర్స్‌ కూడా టీడీపీలోనే వున్నారు. అప్పట్లో పరిటాల సునీత, తన భర్త మరణానికి జేసీ దివాకర్‌రెడ్డి కారణమని ఆరోపించారు.

కానీ, ఆ తర్వాత ఆమె టీడీపీలో, జేసీ బ్రదర్స్‌తో 'కాంప్రమైజ్‌' కావాల్సిన పరిస్థితి. గంగుల భానుమతి ప్రస్తుతానికి రాజకీయాల్లో లేరు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు దూరంగా తన కుమారుడ్ని కర్నాటకలో చదివిస్తున్నాననీ, అక్కడే సెటిలవుతాననీ ఆమె అంటున్నారు.

అయితే, పరిటాల కుటుంబానికి ప్రజలు బుద్ధి చెబుతారనీ, ఆ కుటుంబాన్ని ఓడించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున తాను సర్వశక్తులూ ఒడ్డుతానని గంగుల భానుమతి చెబుతుండడం గమనార్హం. ఎన్నికల్లో మాత్రం గంగుల భానుమతి పోటీ చేయబోరట.

మొత్తమ్మీద, పరిటాల రవిని హత్య చేసింది మొద్దుశీను అని తేలిపోయింది.. కానీ, చంపించిందెవరో తేలలేదు. సూరి విషయంలోనూ అంతే. చంపింది భానుకిరణ్‌ అని న్యాయస్థానం తేల్చింది.. కానీ, చంపించిందెవరో మాత్రం మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.  

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్