cloudfront

Advertisement


Home > Politics - Gossip

అభ్యర్థులు లేక 'ఏనుగు' ఎక్కిన పవన్

అభ్యర్థులు లేక 'ఏనుగు' ఎక్కిన పవన్

ఉత్తరాది వారి పెత్తనాన్ని సహించం, దక్షిణాది సత్తాచూపిస్తాం అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కి వెళ్లి చేసొచ్చిన పని ఏంటి? బీఎస్పీ జాతీయ పార్టీనే, కానీ కచ్చితంగా ఉత్తరాది పార్టీనే. మరి దాన్ని తీసుకొచ్చి ఏపీపై రుద్దడం ఏంటి? ఏనుగుని ఏపీలోకి ఆహ్వానిస్తానంటూ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్ పొత్తులతో ఏం సాధించాలనుకుంటున్నారు. జనసైనికుల్లో అయోమయం తప్ప పవన్ లక్నో టూర్ తో ఒరిగిందేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ పవన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ప్రధాన పార్టీల టికెట్లు దొరకనప్పుడు, ఇండిపెండెంట్ గా పోటీచేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, గుర్తుతో ఇబ్బంది పడతామేమో అనే అనుమానం ఉన్నప్పుడు.. పలుకుబడి ఉన్న నేతలు ఏనుగు గుర్తుని ఎంపిక చేసుకుంటారు. బీఎస్పీ తరపున బీఫామ్ లు కొనుక్కుని మరీ పోటీలో నిలబడతారు. గెలిస్తే అధికార పార్టీలోకి ఫిరాయించడం కామన్. ఏపీలో ప్రతి జిల్లాలో బీఎస్పీ నాయకులు ఉన్నారు, కానీ వారు కూడా ఎన్నికల సమయానికి ఎవరో ఒకరితో అడ్జస్ట్ మెంట్లు చేసుకుంటారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటానంటూ ఒప్పందం చేసుకుని వచ్చారు పవన్ కల్యాణ్.

కేవలం తాను ఓ మేధావిని అని చెప్పుకోడానికి, కాన్షీరామ్ ఆలోచనలతో తాను రాజకీయాల్లోకి వచ్చానని రుజువు చేసుకోడానికే పవన్ కల్యాణ్ మాయావతితో పొత్తు పెట్టుకున్నట్టుంది. అంతకుమించి జనసేనకు ఇక్కడ ఒరిగేదేం లేదు. వామపక్షాలతో ఓ పక్క పొత్తు పెట్టుకున్నానని చెబుతున్న పవన్ ఇంకా వారికి స్థానాలు కేటాయించలేదు. ఈ లెక్కలు తేలకుండానే ఇప్పుడు మరో పార్టీని కలుపుకున్నారు. ఏనుగు గుర్తు కూడా మనదేనంటూ శ్రేణులకు చెబుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులని బట్టి చూస్తే వామపక్షాల పొత్తుతో పవన్ కి ఉపయోగంలేదు, ఇక బీఎస్పీతో సయోధ్య అసలు ఎందుకు అనే అనుమానాలు వస్తున్నాయి. వీటన్నింటికీ తెరవెనక ఒకే కారణం కనిపిస్తోంది. అన్ని పార్లమెంట్ స్థానాల్లో స్థానాల్లో పోటీచేయడానికి జనసేనకు అభ్యర్థులు దొరకలేదట. కేవలం కొన్ని స్థానాలకు మాత్రం ఎక్కువ మంది ఆశావహులు పోటీపడుతున్నారట. మరికొన్ని స్థానాల నుంచి అసలు అప్లికేషన్లే రాలేదని తెలుస్తోంది.

అందుకే పవన్ ఇలా కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కమ్యూనిస్టులతో సీట్ల సర్దుబాటు చేసుకున్న జనసేనాని, త్వరలోనే బీఎస్పీకి కూడా కొన్ని లోక్ సభ స్థానాలు కేటాయించబోతున్నారు. పొత్తుకు ఇదే అసలు కారణం అని తెలుస్తోంది.

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!