Advertisement


Home > Politics - Gossip
రెడ్డితో రెడీ!

బలమైన సామాజికవర్గంపై చూపు

వైసీపీలో కీలక పరిణామాలు

వైరి పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే యత్నం

వైసీపీ తాజాగా సామాజిక సమీకరణలపైన దృష్టి సారించింది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికలలో కేవలం వైఎస్‌ఆర్‌, జగన్‌ ఇమేజ్‌తోనే గెలిచేయగల మన్న ధీమాతో చేసిన అనేక పొరపాట్లను ఈసారి సరిదిద్దుకోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో విశాఖ సహా, ఉత్తరాంధ్ర జిల్లాలలో బలమైన సామాజిక వర్గాలను గుర్తించి అక్కున చేర్చుకునేందుకు ప్రణాళిక లను రూపొందించింది. ఇందులో భాగంగా, విశాఖ నగర రాజకీయాలలో గతంలో కీలకమైన భూమిక పోషించి ప్రస్తుతం ఏ పార్టీకీ పట్టని వారుగా ఉన్న రెడ్డి కులస్థులను అక్కున చేర్చుకునేందుకు వైసీపీ వేగంగా పావులు కదుపుతోంది.

విశాఖ రాజకీయాలలో ఎంపీ లుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఆ సామాజిక వర్గానికి ఉంది. అంగబలం, అర్ధబలం కలిగిన ఈ కులస్థులను గతంలో కాంగ్రెస్‌ పార్టీ బాగా సమాదరించి పార్టీ, ప్రభుత్వ పదవులను కట్టబెట్టింది. విభజన తరువాత. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో ఆ పార్టీ కనుమరుగు కాగా, అధికార తెలుగు దేశం, బీజేపీలు ఈ సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం గానే పెట్టాయనే చెప్పాలి. ఈ పరిస్థితులను గమనిం చిన వైసీపీ వాటిని తనకు అనుకూలంగా చేసుకునేందుకు యత్నిస్తోంది.

రాజకీయంగానూ రాణించిన వారెందరో ఈ కులంలో ఉన్నారు. వారంతా సరైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీ సొంత సామాజికవర్గం పెత్తనం నగర రాజకీయాలలో బాగా పెరిగింది. అంతకు ముందు విశాఖ నగర తొలి మేయర్‌గా బీజేపీ తరఫున ఎన్‌ఎస్‌ఎన్‌ రెడ్డి గెలిచి దక్షిణాదిన తొలి కాషాయ బావుటా ఎగురవేశారు. ఆయన స్పూర్తితో ఆ సామాజిక వర్గానికి చెందిన అనేకమంది రాజకీయాలలోకి వచ్చి తన ఉనికిని బలంగానే చాటుకున్నారు.

అలా వచ్చిన వారిలో కాంగ్రెస్‌ తరఫున టి సుబ్బరామిరెడ్డి ప్రముఖ నాయకునిగా ఎదిగిన విషయం విధితమే. అదే కాంగ్రెస్‌ పార్టీలో టి సూర్యనారాయణరెడ్డి విశాఖ రెండవ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, విశాఖ నగరాభివృద్ధి సంస్ధ చైర్మన్‌గా కూడా పనిచేసి నగర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అలాగే, వైఎస్‌ఆర్‌ చలువతో తిప్పల గురుమూర్తిరెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గారు. నగర రాజకీయాలలో తిప్పల కుటుంబం తమదైన పాత్రను పోషిస్తూ వస్తోంది. ఇలా పలు రాజకీయ కుటుంబాలు నగరంలో తమ పలుకుబడిని ఇప్పటికీ చాటుకుంటూనే ఉన్నాయి.

నగర ప్రజానీకం సైతం కులం, ప్రాంతం అన్న తేడాలు లేకుండా ఈ సామాజికవర్గాన్ని గెలిపిస్తూ వస్తోంది. ఆ విధంగానే నెల్లూరుకు చెందిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి విశాఖ ఎంపీగా గెలిచారు. ఈ నేపధ్యాన్ని గమనంలోకి తీసుకున్న వైసీపీ వ్యూహకర్తలు పార్టీలో ఆ సామాజికవర్గం ప్రాధాన్యతను పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. తాజాగా ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జిగా సత్తి రామకృష్ణారెడ్డి నియామకం వెనుక ఈ సమీక రణలే బలంగా పనిచేశాయి. ఇక, పెందుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డిని మరోమారు నిలబెట్టాలని పార్టీ యోచిస్తోంది.

కాంగ్రెస్‌లో పనిచేసిన మరో నగర నాయకుడు కొయ్య ప్రసాదరెడ్డికి వైసీపీలో అధికార ప్రతినిధి బాధ్యతలను అప్పగించారు. ఇక, విశాఖలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఈసరికే నియమించిన అధినాయకత్వం ఆర్ధికంగా బలంగా ఉన్న రెడ్డి కులస్థుల సేవలను ఇతోధికంగా వినియోగించు కోవాలని చూస్తోంది. ఇక, తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కృష్ణారెడ్డిని ఈ మధ్యనే పార్టీలో చేర్చుకున్నారు. ఆయన మేయర్‌ సీటును ఆశిస్తున్నారు.

అయితే, గతంలో టీడీపీలో ఓ వెలుగు వెలిగిన అర్బన్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు దివంగత గంగిరెడ్డి తరువాత ఈ సామాజికవర్గాన్ని అంతగా ప్రోత్సహించిన దాఖలాలు లేవు. దాంతో, విశాఖలో పలు నియోజకవర్గాలలో ప్రభావం చూపే అవకాశం ఉన్న రెడ్డి కులస్థులు వైసీపీ వైపు చూస్తున్నారు. వైసీపీలో చేరే ప్రసక్తే లేదని ఈ మధ్యన ప్రకటించిన కాంగ్రెస్‌ నాయకుడు టి సుబ్బరామిరెడ్డితో పాటు, ఆయన వెంట ఉన్న సామాజికవర్గాన్ని కూడా ఈదిశగా తీసుకువచ్చేందుకు ఇంకా ప్రయత్నాలు సాగు తున్నాయన్న సమాచారం ఉంది. కాంగ్రెస్‌ తమకు సొంత పార్టీలా ఉండేదని, ఆ లోటును వైసీపీ భర్తీ చేస్తే తాము ఆ పార్టీకి మద్దతుగా నిలిచేందుకు ఏ మాత్రం అభ్యంతరం ఉండబోదని నగరంలోని రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

ప్రతీ రాజకీయ పార్టీకి తమకంటూ సొంత సామాజి కవర్గం ఉంటూ వస్తున్న వర్తమాన పరిస్థితులలో వైసీపీ అధినాయకత్వం ఇప్పటికైనా ఈ దిశగా అడుగులు వేయడం మంచి పరిణామమేనని అంటున్నారు. వైసీపీ వ్యూహం కనుక విజయవంతమైతే విశాఖతో పాటు, ఉత్తరాంధ్రలోని రెడ్డిసామాజికవర్గం ఫ్యాన్‌ నీడన సేదతీరే అవకాశాలు మరింతగా మెరుగుపడతాయి.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌