Advertisement


Home > Politics - Gossip
గ్రాంటు.. అయినోళ్లకు పంచిపెట్టడానికేనా?

ప్రతి ప్రభుత్వమూ తాము చేస్తున్న ప్రతి పనినీ ప్రజాసంక్షేమం లక్ష్యంగా చేస్తున్నదే అని చెప్పుకుంటుంది. పైగా అలా చెప్పుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వానిది మరింతగా అందె వేసిన చేయి. చేసిన పనికంటె మించిన ప్రచారాన్ని రాబట్టుకోవడంలో వారికి తెలిసినన్ని వ్యూహాలు మరెవ్వరికీ తెలియవు.

అయితే చేసే పనుల్లో ఏవి నిజంగా ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడానికి ఉపయోగపడేవి.. ఏవి కాంట్రాక్టు పనుల రూపేణా అయినోళ్లు డబ్బులు దండుకోవడానికి, సొమ్ము సంపాదించుకోవడానికి ఉపయోగపడేవి అనేది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థం అవుతుంది. విద్యాభివృద్ధికి ఏర్పాట్లు, వైద్య రంగంలో ఆస్పత్రుల్ని ప్రమాణాలు మెరుగుపరచడం, హాస్టళ్లలో పౌష్టికాహారం అందేలా చూడడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వాస్తవంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే పనులు.

అలాకాకుండా.. రోడ్లు వేయడం, రోడ్ల రిపేర్లు, భవనాల రిపేర్లు.. (తప్పు అని మన ఉద్దేశం కాదు) ఇవన్నీ అచ్చంగా కాంట్రాక్టు పనులు నడిపించే వ్యవహారాలే. అంటే.. అయినోళ్లకు అప్పగించేసి.. ఎవడికి వాడు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకునే మార్గాలు సృష్టించడమే. ఈ రెండు రకాల మీద ప్రభుత్వాలు సమానంగా ఫోకస్ పెడితే పరవాలేదు. కానీ మొదటి రకాన్ని గాలికొదిలేసి, రెండో రకం మీదనే ధ్యాస పెడితే ఘోరం.

ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం అదే పనిచేస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని గ్రాంటు రూపేణా 16వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు వారికి లేఖ రాశారు. ఇస్తారా లేదా తర్వాతి సంగతి.. ఒకవేళ ఇస్తే ఆ నిధులతో ఆయన సంకల్సిస్తున్నది మొత్తం నిర్మాణ, రిపేర్ల పనులే. అంటే ఈ ఎన్నికల సంవత్సరంలో మొత్తం కాంట్రాక్టర్లకు, ఆ రూపేణా పార్టీ వారికి, వారినుంచి వాటాల రూపేణా ఎమ్మెల్యేలకు డబ్బు పంపిణీ అధికారికంగా జరిగేలా చంద్రబాబు ఒక స్కెచ్ సిద్ధం చేశారన్నమాట.

కేంద్రం ఇవ్వడానికి సిద్ధపడితే గనుక.. చంద్రబాబు చేయదలచుకున్న పనులన్నీ.. గ్రామీణ రోడ్లను నిర్మించడం, హాస్టళ్లకు, బ్రిడ్జిలకు రిపేర్లు చేయించడం, అవసరమైతే కట్టడం ఇలాంటి పనులే ఉన్నాయి. నిధులు వచ్చి వాటిని కాంట్రాక్టు పనులకు కేటాయించేస్తే అందులోంచి వాటాలుగా లభించే సొమ్మునే పార్టీ ప్రజాప్రతినిధులు రాబోయే ఎన్నిలకు నిధులుగా వాడుకోవాలన్నమాట. ఈ వ్యూహం అలా ఉన్నదని ప్రజలు అనుమానిస్తున్నారు.

అసలు శంకుస్థాపన ఫలకాలు తప్ప సింగిల్ బిల్డింగ్ లేని  అమరావతిలో గ్రీనరీ, పార్కుల అభివృద్ధి ఇత్యాది అవసరాలకు ఏకంగా 1484కోట్ల అడిగారు. మొక్కల పెంపకంలో ఎంత ఖర్చో ఎంత కటింగో ఎవరికి ఎప్పటికి అర్థమవుతుంది. పైగా తొలుత బిల్డింగులు లేపడంపై దృష్టిపెట్టకుండా ఈ డెకరేషన్ పార్కుల ఏర్పాటు గురించి నిధులు అడగడం ఇదంతా.. ప్రజలకు ప్రభుత్వ చిత్తశుద్ధి మీద అనుమానాలు రేకెత్తేలా ఉన్నదని పలువురు అంటున్నారు.