cloudfront

Advertisement


Home > Politics - Gossip

మౌఢ్యం తర్వాత గేరుమార్చనున్న రేవంత్!

మౌఢ్యం తర్వాత గేరుమార్చనున్న రేవంత్!

ప్రస్తుతం శుక్రమౌఢ్యం నడుస్తోంది. అది ముగిసేదాకా ఎలాంటి శుభకార్యాలు చేయడానికి వీల్లేదు. శుభమా అని పెద్ద పదవులను ఆశించి పార్టీ మారితే.. మౌఢ్యంలో కార్యరంగంలోకి దిగడం ఎందుకు అనుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి. శుక్రమౌఢ్యం ముగిసిన వెంటనే.. ఆయన గేరు మార్చి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వీర బీభత్స రేంజిలో ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉద్యుక్తులు అవుతున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ.. ఆయన పదవి, హోదాల సంగతి ప్రయారిటీ సంగతి ఇప్పటిదాకా తేలనేలేదు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ.. పార్టీ మారిన రేవంత్ కు ఇలా ఏ పదవీ లేకుండా ఇన్నాళ్లు ఖాళీగా కూర్చోవడం ఇబ్బందికరమైన పరిణామమే. అయినా ఆయన తనే ఏదో పని కల్పించుకుని ప్రెస్ మీట్ లు పెట్టుకుంటూ పొద్దు గడిపేస్తున్నారు. అలాంటిది... తీరా ఇన్నాళ్లకు మరో నాలుగు రోజుల్లో ఆయనకు రాష్ట్రవ్యాప్త హోదా ఉండేలా పార్టీ పదవి దక్కబోతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో సత్సంబంధాలనే కలిగి ఉన్నారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ జానారెడ్డికి ఇంకా సన్నిహతులు. కాంగ్రెస్ లో అత్యంత సహజంగా ఉండే ముఠాకక్షల ప్రభావం రేవంత్ మీద కూడా ఉంది. కొన్నివర్గాలు పార్టీలో ఆయనకు దక్కబోతున్న ప్రాధాన్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ, ఆయనకు పార్టీ ఢిల్లీ వర్గాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి గానీ.. పదవి ఒక్కటే లేకుండాపోయింది. ఆ కొరత కూడా ఈ వారంలో తీరిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఆ లాంఛనం కూడా పూర్తికావడంతో పాటూ.. శుక్ర మౌఢ్యం కూడా ముగిసిన తరువాత.. ఆయన సమరశంఖం పూరించి కేసీఆర్ మీదకు కాలుదువ్వుతారని అంతా అనుకుంటున్నారు. ప్రెస్ మీట్ ల రోజులు దాటి.. మిగిలిన కాంగ్రెసు నాయకులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు సిద్ధం అవుతున్నారు గానీ.. రాహుల్ ను రాష్ట్రానికి తీసుకువచ్చి భారీ సభ నిర్వహించాలనే టీపీసీసీ కోరిక ఇప్పట్లో తీరేలాలేదు.