Advertisement


Home > Politics - Gossip
'సేఫ్‌ రూట్‌' చూసుకుంటున్నారు...!

సరిగ్గా చెప్పాలంటే సాధారణ ఎన్నికలు జరగడానికి పూర్తిగా రెండేళ్ల సమయం కూడా లేదు. కాలం ఎంతలోకి గడుస్తుంది...! చూస్తుండగానే ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేస్తాయి. అందుకే అన్ని పార్టీల అధినేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారు. పేరుకు ప్రజాసేవ చేస్తున్నా ధ్యాసంతా వచ్చే ఎన్నికల మీదనే ఉంది. ఈ సమయంలో ముఖ్యమంత్రులతో సహా అందరినీ వేధిస్తున్నవి రెండే ప్రశ్నలు.

ఎన్నికల్లో గెలుస్తామా? గెలవమా? నాయకులకు గెలుపే ప్రధానం. ప్రస్తుతం తామున్న పార్టీ నుంచి గెలిచే అవకాశం లేదనుకుంటే, లేదా అధినేత టిక్కెట్టు ఇవ్వడనుకుంటే మరో పార్టీలోకి చేరడానికి మార్గాలు వెతుక్కుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ నాయకులు 'సురక్షిత మార్గం' (సేఫ్‌ రూట్‌) అన్వేషిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీల మధ్య ఫిరాయింపులు జోరుగా జరిగే అవకాశం ఉంది.

పార్టీల అధినేతలు 'గెలుపు గుర్రాలు' కోసం ఎదురుచూస్తుంటారు కాబట్టి తమ పార్టీల్లో బలహీనంగా ఉన్నవారిని (ప్రజాదరణ, ఆర్థిక కారణాల రీత్యా) పక్కన పెట్టి వేరే పార్టీ నుంచి బలమైన నాయకులొస్తే టిక్కెట్లు ఇవ్వడానికి వెనకాడరు. ప్రతి సాధారణ ఎన్నికల్లో అప్పటికప్పుడు ఫిరాయించేవారికి టిక్కెట్లు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. వచ్చే ఎన్నికల్లోనూ ఈ దృశ్యం కనబడక తప్పదు.

రాబోయే రోజుల్లో పార్టీల బలాబలాల గురించి  మీడియా పరంగా అనేక సర్వేలు జరిగే అవకాశముంది. పార్టీలు సర్వే చేయిస్తాయి. బడా నాయకులు సొంతంగా సర్వే చేయిస్తారు. ఇలాంటి సర్వేల ద్వారా ఏ పార్టీలో ఉంటే గెలుస్తామో అంచనా వేసుకుంటారు. ప్రతి పార్టీలోనూ అసంతృప్తవాదులుంటారు. ఏవో కారణాల వల్ల వారు పార్టీలో ఇమడలేరు. టిక్కెట్టు వస్తుందనే నమ్మకం ఉండకపోవచ్చు. ఇలాంటివారు ఉన్న పార్టీ నుంచి బయటపడి 'లాభం' కలుగుతుందని భావించిన పార్టీలో చేరుతుంటారు. 

ఓ పార్టీలో నిరాదరణకు గురైన నాయకుడు మరో పార్టీలో చేరి గెలుపు గుర్రం కావొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ఎప్పుడు ఎవరు ఏ పార్టీ వంక చూస్తారో తెలియదు. పార్టీ మారబోతున్నారంటూ అప్పుడప్పుడు కొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇలా పేర్లు బయటకు వచ్చినప్పుడు కొందరు పార్టీ మారడం అబద్ధమని ఖండిస్తుండగా, కొందరు మౌనంగా ఉంటున్నారు.

ఇప్పటికే ప్రధాన పార్టీల్లో కొందరు ప్రముఖ నాయకులు తమ పార్టీలతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే వారు ఏ క్షణమైనా బయటకు వెళ్లిపోవచ్చని అర్థం. ఇలాంటివారిలో వైకాపా ఎంపీ బుట్టా రేణుక పేరు తరచూ వినబడుతోంది. తాజాగా ఆమె వైకాపా సమావేశానికి హాజరు కాకుండా మంత్రి లోకేష్‌తో సమావేశమయ్యారని, దీనిపై జగన్‌ ఆగ్రహించారని వార్తలొచ్చాయి. వెంటనే 'నేను పార్టీ మారడంలేదు' అని ఆమె వివరణ ఇచ్చింది.

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్టీకి దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం ఆయన ఆశించిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌ పదవి దక్కకపోవడమే. ఆ పదవి కోసం టీడీపీ నాయకుల మధ్య పోటీ ఎక్కువ కావడంతో సిట్టింగ్‌ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఆ పదవి ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేశారు. ఇంకా దాన్ని భర్తీ చేయలేదు. రాయపాటి తరచుగా ఏవో వ్యాఖ్యలు చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

తనకు టిక్కెట్టు వస్తుందని కూడా అనుకోవడంలేదు. ఈయన మరో మార్గం చూసుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో రాయపాటితో పోటీ చేసి ఓడిపోయిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి టీడీపీకి దగ్గరవుతున్నట్లు సమాచారం. ఈయన బంధువైన గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి వైకాపా వైపు చూస్తున్నారట...! ఈయనకు టీడీపీలో అసౌకర్యంగా ఉందట...! రాబోయే రోజుల్లో ఇలాంటి వార్తలు మరిన్ని వినాల్సివస్తుంది.