సీనియర్ నాయకుల పరంగా కమలదళానికి మరిన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. భాజపా మహిళా నాయకురాళ్లలో తలమానికంగా నిలిచిన సుష్మాస్వరాజ్ ఇప్పుడులేరు. అదే సమయంలో పార్టీకి ప్రస్తుతం ఉన్న మేధావి నాయకుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ తీవ్రంగా విషమించిన ఆరోగ్యంతో ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా భాజపా నాయకులు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.
అరుణ్ జైట్లీ సీనియర్ నాయకుడు. ఉద్ధండుడైన న్యాయవాది. మేధావి. 2014లో మోడీ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఏర్పడినప్పుడు ఆయన కేంద్ర కేబినెట్ లో పలుశాఖలు నిర్వహించారు. ఆర్థికశాఖ మంత్రిగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటిది ఆయన మంత్రిగానే ఉన్న కాలంలోనే ఆరోగ్యం బాగా క్షీణించింది. రెండు మూత్రపిండాలు పాడైపోవడంతో పాటూ, అంతుచిక్కని కాన్సర్ తో ఆయన కృశించిపోయారు. బడ్జెట్ సమర్పించే సమయానికి సభలో ఉండలేని పరిస్థితుల్లో ఆయన అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు.
మోడీ 2.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కేబినెట్ పదవులకు అరుణ్ జైట్లీ దూరంగా ఉండిపోయారు. ఆయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నప్పటికీ.. మంత్రిపదవి మాత్రం స్వీకరించలేదు. అనారోగ్యం కారణంగా పరిమితంగా మాత్రమే రాజకీయ కార్యకలాపాల్లో ఉన్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఆయన శ్వాస తీసుకోడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా, కుటుంబ సభ్యులు గమనించి ఎయిమ్స్ కు తరలించినట్లు వార్తలు వస్తున్నాయి.
పరిస్థితి చాలా తీవ్రంగా ఉండడంతో.. ప్రధాని మోడీ, అమిత్ షా సహా పార్టీకి చెందిన అనేకమంది కేంద్రమంత్రులు కీలక నాయకులు.. ఆస్పత్రి వద్దకు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరుణ్ జైట్లీకి తెలుగు రాష్ట్రాల రాజకీయంతో కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లును ప్రవేశపెట్టినప్పుడు.. ప్రత్యేకహోదా ఇవ్వకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా మనుగడ సాగిస్తుందంటూ.. గట్టిగా ప్రశ్నించడం ద్వారా జైట్లీ, అప్పటి ప్రధాని మన్మోహన్ ను ఒప్పించారు.
తీరా తాము అధికారంలోకి రాగానే.. అదే ప్రత్యేకహోదాను పక్కన పడేశారు. రాష్ట్రం నుంచి దానికోసం బేరసారాలు సాగినప్పుడు.. హోదాకు సమానమైన లబ్ధి చేకూరుస్తాం అంటూ ప్యాకేజీకి రూపకల్పన చేశారు. చివరికి అది కూడా కార్యరూపం దాల్చలేదు.