Advertisement


Home > Politics - Gossip
కమలానికి.. కస్తూరి పరిమళం: బాబుకు దడే!

‘కన్నడ కస్తూరి’ అన్నారు పెద్దలు. కానీ ఆ కస్తూరి పరిమళం ఇప్పుడు కమలానికి సోకింది. తాజాగా ఫలితాలు తేటతెల్లం అయ్యేసరికి భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది. కాషాయ కమలం కస్తూరి పరిమళాలను గుబాళిస్తోంది. కన్నడ ఫలితాలు ఓకే.. మరి దీని పర్యవసానాలు ఏమిటి? విశ్లేషకులు భావిస్తున్న దాన్నిబట్టి.. ఏపీ రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబునాయుడుకు గుండెదడ పట్టుకున్నదని పలువురు భావిస్తున్నారు. 

‘కర్నాటక ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ఏపీ సంగతి చూస్తారు’ అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించినప్పుడు.. తెలుగుదేశం నాయకులు అనేక వెటకారాలు ఆడారు. మోడీ అండ్ కో మీద బురద చల్లే క్రమంలో... ఈ అంశాన్ని కూడా వాడుకోవచ్చునని వారు భావించారు. అదే మాదిరిగా.. మోడీ మీద సెటైర్లు వేస్తూ... చెలరేగిపోయారు.

అదే సమయంలో.. కర్నాటక ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ ఓటమికి చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం కంకణం కట్టుకుని పనిచేసింది. చంద్రబాబునాయుడుకు ఆహ్వానాలు వచ్చినా సరే.. ఆయన స్వయంగా ప్రచారానికి వెళ్లలేదు గానీ.. ‘నేను భాజపాను ఓడించమని పిలుపు ఇచ్చానే తప్ప.. కర్నాటకలో కాంగ్రెస్ ను గెలిపించాలని చెప్పలేదు’ అంటూ ఆయనే చెప్పుకున్నారు. ఆయన ప్రత్యక్షంగా పూనుకోలేదు గానీ.. మంత్రులు పలువురు స్వయంగా కర్నాటకలో పర్యటించి.. భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.

అదే మాదిరిగా వేలాది మంది తెదేపా కార్యకర్తలు బృందాలుగా విడిపోయి కర్నాటక వ్యాప్తంగా తమకు పరిచయం ఉన్న తెలుగువారు నివసించే ప్రతిచోటా కమలవ్యతిరేక ప్రచారం నిర్వహించారు. తెదేపా సోషల్ మీడియా టీమ్.. విపరీతంగా నెగటివ్ ప్రచారానికి పాల్పడింది. ఇన్ని జరిగినప్పటికీ.. చంద్రప్రయత్నాలు మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. మోడీ తన హవా ఏమిటో నిరూపించి.. ఢంకా బజాయించి గెలిచారు.

ఇప్పుడిక బాబు కోటరీ మొత్తానికి దడ పట్టుకుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాగిన అవినీతి వ్యవహారాలపై కేంద్రం దృష్టిపెడుతుందనే అనుమానం బాబుకు కూడా ముందునుంచి ఉంది. కర్నాటక ఎన్నికలలో క్లియర్ మెజారిటీ వచ్చింది గనుక.. ఇక మోడీ సర్కారు ఎలాంటి శషబిషలు లేకుండా.. ధాటిగా నిర్ణయాలు తీసుకుంటుందని.. దేశంలో కమల ప్రాభవానికి ఇప్పట్లో ఢోకా లేదని భావించవచ్చు.