cloudfront

Advertisement


Home > Politics - Gossip

కష్టాలొకటే : ఇవాళ తెరాస.. రేపు తెదేపా!

కష్టాలొకటే : ఇవాళ తెరాస.. రేపు తెదేపా!

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు పాకాన పడ్డాయి. విపరీతమైన అసంతృప్తుల సెగతో తెరాస రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలను ఇతర పార్టీలనుంచి తమ పార్టీలో కలిపేసుకుంది. ఎన్నికలు వచ్చేసరికి సిటింగ్ ఎమ్మెల్యేల కోటాలో వారందరికీ టికెట్లు ఇచ్చేసింది. మరి తెలంగాణ ఉద్యమకాలం నుంచి తెరాస పోరాటాల్లో భాగంగా ఉంటూ, రాష్ట్రంకోసం పోరాడిన వారి మాటేమిటి? అక్కడే అసంతృప్తులు రేగుతున్నాయి.

సాధారణంగా మొన్నమొన్నటి వరకూ.. అందరూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తిరుగులేని నాయకుడు.. పార్టీ మీద ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉంది అనే అనుకున్నారు. ఆయన ఏం చెబితే అది పార్టీలో శాసనంలా చెలామణీ కావాల్సిందే.. ఆయన మాటకు ఎదురుచెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు అనే అనుకున్నారు. అంతే ఘాటుగా వ్యవహారాలన్నీ నడిచాయి. అందరూ కేసీఆర్ అంటే అపరిమితమైన భయభక్తులతోనే నిన్నటిదాకా కనిపించారు.

కానీ ముందస్తు ఎన్నికల టికెట్లు ప్రకటించడం పూర్తయ్యేసరికి.. పార్టీ నాయకత్వం పట్ల ఒక్కొక్కరిలో ఎంతటి లెక్కలేనితనం ఉన్నదో బట్టబయలవుతోంది. కేవలం వలస ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా, ఇంకా అనేకచోట్ల అడ్డగోలుగా నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీని ఖాతరు చేయడంలేదు. ఇతర పార్టీల్లోకి వెళ్తామంటున్నారు. పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తాం అని కూడా అంటున్నారు.

ఇదంతా ఇవాళ్టి తెరాస పరిస్థితి. మరి రేపు ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశానికి కూడా ఇలాంటి దుస్థితి తప్పదనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు కూడా.. అధికార పార్టీగా తన తెలుగుదేశానికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కక్కుర్తిపడి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టి, బెదిరించి తమ పార్టీలో చేర్చేసుకున్నారనే ఆరోపణలున్నాయి.

మొత్తం 23 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి ఫిరాయించారు. ఈ 23 నియోజకవర్గాల్లోనూ తెదేపా పరిస్థితి ప్రస్తుతం ముఠా కుమ్ములాటల్లో మునిగి ఉంది. ఎన్నికలు వచ్చేసరికి ఇవి ఇంకాస్త ముదురుతాయని, వారిని చూసి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా జ్వాలలు రేగుతాయని.. ఇప్పుడు తెరాస పడుతున్న కష్టాలన్నీ.. పార్టీ మీద మోనోపలీ, గుత్తాధికారం కూడా లేని చంద్రబాబుకు ఇంకాస్త ఎక్కువ డోసేజీలో ఉంటాయని పలువురు భావిస్తున్నారు.