Advertisement


Home > Politics - Gossip
అతిగా ఆశ పడింది... తీరని వేదన మిగిలింది..!

చేసిన పాపం ఎప్పుడో ఒకప్పుడు బద్దలవుతుందని పెద్దలు చెబుతుంటారు. అది ఏదో ఒక రూపంలో జరుగుతుందంటారు.  నేరాలు, పాపాల నుంచి జీవితాంతం తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దివంగత జయలలిత ప్రియ సఖి, అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ అలియాస్‌ చిన్నమ్మ ప్రస్తుత పరిస్థితి ఇదే. కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించి, కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టడమే కాకుండా, తమిళ రాజకీయాలను శాసించాలనుకున్న ఆమె ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది.

భర్త నటరాజన్‌ తీవ్ర అనారోగ్యంతో, ఆపరేషన్‌లు చేయించుకొని ఆస్పత్రిలో ఉండగా, ఆమె జైల్లో మగ్గాల్సిరావడం విచారకరం. కాని స్వయంకృతాపరాధం అనుభవించక తప్పదు. భర్తను చూసేందుకు ఇచ్చిన ఐదు రోజుల పెరోల్‌లో మూడు రోజులు గడిచిపోయాయి. ఆస్పత్రిలో భర్తను చూసి కన్నీరుమున్నీరైంది. 'నా భర్తను కాపాడండి' అని వైద్యులను కన్నీటితో బతిమాలుకుంది.

ఒకవిధంగా చెప్పాలంటే ఆయన పరిస్థితి విషమంగానే ఉంది. డిశ్చార్జి చేసిన తరువాత కూడా కొన్నాళ్లు ఆయన పరిస్థితి ప్రమాదకరంగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ భర్తను దగ్గరుండి చూసుకోలేని దుస్థితి శశికళది. పెరోల్‌ ఇచ్చేముందు రాజకీయాలు మాట్లాడకూడదని, మీడియాను కలవకూడదని, నాయకులతో మంతనాలు జరపకూడదని నిబంధనలు విధించడంతో శశికళ చేతులు కట్టేసినట్లయింది.

ఈ నిబంధనలు పెట్టకుండా ఉన్నట్లయితే ఐదు రోజుల్లో ఆమె ఎంత రాజకీయం చేయాలో అంతా చేసేది. భర్త బాగోగులు చూసుకోవడంకంటే రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేదని ఆమె వ్యవహారశైలినిబట్టి అర్థమైంది. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, మంత్రుల్లో కొందరైనా వచ్చి తనను కలుసుకుంటారని ఆమె ఆశించింది.

పెరోల్‌పై వచ్చిన రోజు భర్తను చూసుకున్న తరువాత ఆమె దృష్టి నాయకులపైకి మళ్లింది. ఎవ్వరితో మాట్లాడకూడదనే నిబంధనలు, పోలీసుల నిఘా ఉన్నప్పటికీ తన కోసం నేతలు వస్తారనే ఉద్దేశంతో తెల్లవారుజామునే శుభ్రంగా తయారై కూర్చుందట...! కాని ఆశ నిరాశైంది. పెరోల్‌ నిబంధనలకు భయపడి నాయకులెవరూ ఆమె ఉంటున్న ఇంటి ఛాయలకు వెళ్లలేదు. ఇద్దరు ముగ్గురు ఆస్పత్రికి వెళ్లినా పోలీసులు అనుమతించలేదు.

ఆమె జైలుకు వెళ్లేంతవరకూ వెంట ఉండి జయజయధ్వానాలు చేసినవారు తెరమరుగైపోయారు. జైలు నుంచి బయటకు వచ్చేనాటికి పరిస్థితి ఇంకా మారిపోతుంది.  జయలలిత కన్నుమూసే వరకు ఆమె భక్తాగ్రేసరులైన, పాదాక్రాంతమైన నాయకులంతా ఆమె ప్రాణం పోయిందని తెలియగానే చిన్నమ్మకు దాసానుదాసులైపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకముందే భజన ప్రారంభించారు.  ప్రారంభమే 'హైపీచ్‌'లో ఉంది. ఆమె ముఖ్యమంత్రి అయితే ఇంకెంత పతాకస్థాయికి వెళ్లేదో.

శశికళపట్ల అన్నాడీఎంకే నాయకుల 'అతి భక్తి' ఆమె వ్యతిరేకులకూ అసహ్యం కలిగించింది. 'నాయకులు జయను అప్పుడే మర్చిపోయారు' అని వ్యాఖ్యానించారు.  నాయకులు జయలలిత దగ్గరకు వెళ్లినప్పుడు చొక్క జేబులో ఆమె ఫోటో పెట్టుకొని వెళ్లేవారు. వీరు పల్చటి తెల్లచొక్కాలు వేసుకుంటారు కాబట్టి జేబులోని ఫొటో బయటకు కనబడుతూ ఉంటుంది. జయను ఇంప్రెస్‌ చేయడంలో ఇదొక భాగం. ఆమె మరణించాక చొక్కా జేబులో శశికళ ఫోటో పెట్టుకొని తిరిగారు.  జయను దేవతగా ఆరాధించే  నాయకులు ఆమె ఎల్లప్పుడూ తమ హృదయంలోనే ఉంటారని,  తల్లివంటిదని ప్రశంసించారు.

'ఇదయతాయి' (హృదయంలోని తల్లి) అని భక్తిగా కొలిచారు. 'ఇదయ దేవతై' (హృదయంలోని దేవత)  అన్నారు.  'తమిళ్‌నాట్టిన్‌ నిరందర ముదలవర్‌' (ఎప్పటికీ తమిళనాడు ముఖ్యమంత్రి) అన్నారు. మదర్‌ థెరిస్సాతో పోల్చి 'తెన్నగత్తిన్‌ థెరిసా' (దక్షిణ భారత థెరిసా) అని వినయవిధేయతలు చాటుకున్నారు. తమిళనాడులో ప్రాచీన వీరవనిత అయిన కణ్ణగితోనూ  పోల్చారు.జయను స్తోత్రం చేయడంలో హద్దులు దాటేశారు. అక్రమాస్తుల గొడవ లేకుండా ఉన్నట్లయితే శశికళ ముఖ్యమంత్రి అయ్యేది. పోటీలు పడి స్తోత్రం చేసేవారు. జయలలిత చనిపోగానే ఓ నాయకుడు శశికళను ఉద్దేశించి 'తాయి తంద వరం' (అమ్మ ఇచ్చిన వరం) అన్నాడు. చివరకు ఆమె వరంగా కాకుండా భారంగా మిగిలిపోయింది.