cloudfront

Advertisement


Home > Politics - Gossip

రాష్ట్ర విభజన అంశం.. ఈసారి ఎవరి చేతుల్లోకి!

రాష్ట్ర విభజన అంశం.. ఈసారి ఎవరి చేతుల్లోకి!

2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన అంశమే పార్టీ గెలుపోటములను నిర్ణయించింది. ప్రజలు కాంగ్రెస్ కి పాడికట్టిందీ.. ప్రత్యేక హోదా, అభివృద్ధి మాయలో ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిందీ అందుకే. మన దౌర్భాగ్యం ఏంటంటే ఐదేళ్ల పాలన తర్వాత కూడా నేడు అదే రాష్ట్ర విభజన అంశం ఎన్నికల్లో ప్రధానంగా ఉండటం. బీజేపీ పక్షపాతం, టీడీపీ అసమర్థత కలసి మనకి ప్రత్యేకహోదా రాకుండా చేశాయి.

అదే సమయంలో దాదాపు పదేళ్ల పాలనకు దూరంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఆవురావురంటూ రాష్ట్ర నిధుల్ని భోంచేయడం మొదలుపెట్టేశారు. అభివృద్ధి జాడ లేకుండా అన్నిరంగాల్లో అవినీతి పేరుకుపోయింది. ఇక 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్ర విభజన అంశమే ప్రధాన అజెండాగా మారింది.

ఈ దఫా మొదటగా ఈ అంశాన్ని ప్రస్తావించిన క్రెడిట్ జగన్ ఖాతాలోకే వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీని పరమాన్నంగా భావించిన సమయంలో ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలను ప్రజలకు, ముఖ్యంగా యువతకు వివరించి వారిలో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు జగన్.

రాష్ట్రమంతా యువభేరి సదస్సులు పెట్టారు. ఎంపీలతో రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత ఎందుకో జగన్ ప్రత్యేక హోదా అంశంపై కాకుండా బాబుపై విమర్శలు చేస్తూ, తన నవరత్నాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు.

ఈలోగా ప్రత్యేక హోదాని టీడీపీ భుజానికెత్తుకోవాలని చూసింది కానీ దాని పప్పులు ఉడకలేదు. విభజన, ప్యాకేజీ, హోదా అంటూ నాలుక అడ్డదిడ్డంగా తిప్పేసి కల్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేసినా అది బెడిసికొట్టింది.

ప్రత్యేకహోదా తెస్తాం అంటూ టీడీపీ జనాళ్లోకి వెళ్తే ప్రజలు తరిమికొట్టేట్టున్నారు. అందుకే ఈమధ్య కాలంలో టీడీపీ కూడా వీలైనంత తక్కువగా హోదా అంశాన్ని ప్రస్తావించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే ప్రత్యేక హోదా ప్రకటిస్తామని హామీలిస్తున్నా తెలుగు ప్రజలు నమ్మి మోసపోయేంత వెర్రివాళ్లు మాత్రం కాదు.

ఇకపోతే జనసేన. వారానికో మాటమార్చే పవన్ కల్యాణ్ కూడా.. ప్రత్యేక హోదాపై ఒకప్పుడు గట్టిగానే మాట్లాడారు. ప్యాకేజీతో సరిపెడితే ఊరుకోబోమని, ప్రత్యేకహోదా కావాల్సిందేనని పట్టుబట్టారు. ఈ విషయంలో వైసీపీ పోరాటం బాగుందని, టీడీపీ మాత్రం వెనకడుగేస్తోందని కూడా అన్నారు.

అయితే ఆ తర్వాత మళ్లీ హోదా అంశాన్ని పక్కనబెట్టి లోకల్ సమస్యలపై ఎక్కువగా దృష్టిపెడుతూ పోరాట యాత్రలు చేపడుతున్నారు. తాజాగా ఇప్పుడు మళ్లీ హోదాని, విభజన కష్టాలను భుజానికెత్తుకున్నారు పవన్. తుని, పెద్దాపురం సభల్లో రాష్ట్ర విభజన కష్టాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రస్తుతానికైతే పవన్ కల్యాణే హోదా గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అంశాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందింది. ఈ ఎన్నికల్లో దీన్ని ఎవరు హైజాక్ చేసి ఓట్లు కొల్లగొడతారో చూడాలి. 

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్