Advertisement


Home > Politics - Gossip
సీమలో జగన్‌ పాదయాత్ర.. ఎలాంటి ప్రభావం?

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాయలసీమలోని రెండు జిల్లాలను దాదాపుగా పూర్తి చేసుకుంది. వైఎస్సార్‌ కడపజిల్లాతో మొదలైన ఈయాత్ర కర్నూలును దాటుకుని అనంతపురం వరకూ వచ్చేసినట్టే. ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకూ జగన్‌ పాదయాత్ర ఎలా సాగింది? అంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్సే వస్తోంది. జగన్‌ పాదయాత్ర విజయవంతం అయినట్టే అని.. జగన్‌ నడవడం మొదలుపెట్టడం సానుకూలాంశమే అని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో వైసీపీ బలోపేతానికి, జగన్‌ ప్రజలకు మరింత చేరువకావడానికి పాదయాత్ర ఉపకరిస్తోంది అనేది వారు చెబుతున్న మాట.

కడపజిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాలు, కర్నూలు జిల్లాలో మరో అరడజను నియోజకవర్గాల్లో జగన్‌ పాదయాత్ర సాగింది. ఇక అనంతపురం జిల్లాలోనూ జగన్‌ పాదయాత్ర ఐదారు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. వీటన్నింటిలోనూ దాదాపు ఒకేస్థాయి స్పందన ఉందనే మాట వినిపిస్తోంది. జగన్‌ నడిచిన నియోజకవర్గాల్లో కొన్ని వైసీపీ చేతుల్లోని నియోజకవర్గాలున్నాయి, మరికొన్ని ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలు-మంత్రుల చేతుల్లో ఉన్నాయి, ఇంకొన్ని పక్కా టీడీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్నాయి. ప్రత్యేకించి ఫిరాయింపుదారులైన మంత్రుల నియోజకవర్గాల్లో వైసీపీ నిర్వహించిన సభలు విజయవంతం కావడం.. గమనార్హం.

ఇక ఇదే సమయంలో గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. జగన్‌ పాదయాత్రకు వెళ్లే జనాలను అడ్డుకోవడానికి తెలుగుదేశం వాళ్లు ఎత్తుగడలు వేస్తుండటం. మరి వాళ్లేమీ ఓట్లు వేయడానికి పోలింగ్‌ బూత్‌కు వెళ్తున్న జనాలు కాదు. జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో వెళ్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్లను అడ్డుకోవాలని చూడటం గమనార్హం. తెలుగుదేశం పార్టీ మరీ ఇంతలా ఎందుకు రియాక్ట్‌ అవుతోంది? అనేది గమనించాల్సిన విషయం. ఒకవైపు జగన్‌ పాదయాత్రకు జనాలు వెళ్లినంతమాత్రానా వాళ్లంతాఓట్లు వేస్తారా? అని ఆదినారాయణ రెడ్డి లాంటివాళ్లు ప్రశ్నించారు. మరోవైపు జగన్‌ పాదయాత్రకు వెళ్తారా? అని అటాక్స్‌ చేస్తున్నారు.

ఈ తీరు మర్మమేమిటో తెలుగుదేశం వాళ్లే చెప్పాలి. ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ నియోజకవర్గంలో కూడా జగన్‌ పాదయాత్ర సక్సెస్‌ ఫుల్‌గా సాగింది. అక్కడ గత ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపిన చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో అక్కడ జగన్‌ పాదయాత్ర మరింత ఆసక్తిదాయకంగా నిలిచింది. చెరుకుపాడు నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవిని జగన్‌ పత్తికొండ అభ్యర్థిగా ప్రకటించాడు. గత ఎన్నికల సమీకరణాలే రిపీట్‌ అయితే మాత్రం.. జగన్‌ ప్రకటించిన తొలి అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకే అనుకోవాలి. అయితే ఇప్పటికే హత్యల వరకూ వచ్చిన ఈ నియోజకవర్గ రాజకీయం ముందు ముందు ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాల్సి ఉంది.

మరోవైపు జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీలతో మమేకం అవుతున్నాడు. అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో టీడీపీ ఉనికి చాటుకుంటోంది అంటే.. అందుకు బీసీలు, అందునా బోయలు ముఖ్యకారణం. అయితే బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది టీడీపీ. ఈ వైనం కూడా అందరికీ స్పష్టం అవుతోంది. అనంత వంటిజిల్లాలో బీసీల, బోయల ఓట్లు లేకపోతే టీడీపీ ఉనికే లేదు. అలాంటి చోట కూడా ఐదుమంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ.. తగినంత మంది బీసీ ప్రజాప్రతినిధులు లేరు. ఒకవేళ ఉన్నా.. వాళ్ల ప్రభావం నామమాత్రమే. రాజకీయం అంతా కమ్మ వాళ్ల కనుసన్నల్లో నడుస్తోంది.

ఇలాంటి నేపథ్యంలో జగన్‌ బీసీలకు ఎంపీ సీట్లు ఇస్తా, అందులోనూ బోయలకే ఒక సీటును ఇస్తా అంటున్నాడు. పాదయాత్ర పూర్తికాగానే బీసీ గర్జన అనే ప్రకటన కూడా చేశాడు వైసీపీ అధినేత. మరి తెలుగుదేశం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్న వర్గాన్ని జగన్‌ మరింత దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలకు, పాదయాత్రకు ఫలితం ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికలు పూర్తి అయితే కానీ అర్థంకాదు!