Advertisement


Home > Politics - Gossip
సీమలో సీట్ల రచ్చ పతాక స్థాయికి..!

ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉండగానే.. రాయలసీమలో సీట్ల రచ్చ పతాక స్థాయికి చేరుతోంది. చాలా సీట్ల విషయంలో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించిన ఒక వ్యూహం ఈ రచ్చకంతా కారణం కావడం గమనార్హం. ఫిరాయింపులు.. ఈ వ్యవహారమే ఇప్పుడు సీమలో సీట్ల రచ్చను పతాక స్థాయికి చేరుస్తోంది. ఫిరాయింపులతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గట్టిగా దెబ్బతీయవచ్చు అని బాబు అనుకున్నాడు. తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలిచినట్టుగా.. చంద్రబాబు లెక్క పూర్తిగా అడ్డం తిరిగిన వైనం స్పష్టం అవుతోంది.

సీమలోనే ఎక్కువ ఫిరాయింపులు జరిగాయి. అలాంటి సీట్లలో పాతకాపులు ఉండనే ఉన్నారు. కొత్తవాళ్లు వచ్చిన రోజు నుంచినే పాతవాళ్ల సణుగుడు మొదలైంది. అయితే ఇన్ని రోజులూ టీడీపీ చేతిలో అధికారం ఉంది.. కాబట్టి, నేతలు ప్రస్తుతానికి క్యాష్‌ చేసుకుందాం అన్నట్టుగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు కాన్సన్‌ ట్రేషనంతా టికెట్ల మీదే ఉంది. 

ఫిరాయింపుల లొల్లి మాత్రమేకాదు, సిట్టింగులపై వ్యతిరేకత అనే అంశం కూడా ఇప్పుడు సీమలో చర్చనీయాంశంగా మారింది. చాలామంది సిట్టింగు ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇవ్వకూడదు అనేది చంద్రబాబు లెక్కగా తెలుస్తోంది. ఈ పరిణామాలు కూడా పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచుతున్నాయి. 

ఫిరాయింపుల విషయానికి వస్తే.. అనంతపురం జిల్లాలో కదిరి, కడపజిల్లాలో జమ్మలమడుగు, కర్నూలు జిల్లాలో నంద్యాల నియోజకవర్గాల్లో టికెట్‌ పోటీ తీవ్రమైన స్థాయికి వెళ్లింది. అలాగే ఆళ్లగడ్డ సీటు విషయంలో కూడా ఈ మధ్య ఫైట్‌ ముదిరింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఈ ఫైట్‌ రచ్చకెక్కింది. ఇక కర్నూలు ఎమ్మెల్యే సీటు పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ ఫిరాయింపు నేతకూ, టీడీపీ ఆశావహుడికి మధ్య రచ్చ జరుగుతోంది.

ఇక మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనామకులుగా మారిపోయారు. వారికి మళ్లీ పోటీ మీద ఆశలు కూడా కనిపించడం లేదు. ఇంతటితో కెరీర్‌ ఖతం అన్నట్టుగా వీళ్లు కామ్‌ అయిపోయారు. వీళ్లు కేవలం వైసీపీ ఇమేజ్‌తో గత ఎన్నికల్లో నెగ్గినవాళ్లు. వీళ్లకు వచ్చేసారి చంద్రబాబు అవకాశం ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

కేవలం ఫిరాయింపులే కాదు, సిట్టింగులను మార్చనున్నారు అనేమాట కూడా ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సీమలోని టీడీపీ సిట్టింగుల్లో దాదాపు పది మందికి చంద్రబాబు వచ్చేసారి అవకాశం ఇవ్వడట. వీళ్లలో అనంత నుంచినే మెజారిటీ ఎమ్మెల్యేలున్నారు. నాలుగు జిల్లాలో టీడీపీ గత ఎన్నికలు గెలిచిన సీట్ల సంఖ్యే స్వల్పం. వాటిల్లో సగం సీట్లలో కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తారనే ప్రచారం సంచలనం అవుతోంది.

ఇప్పటికే కొత్త అభ్యర్థులను కూడా బాబు ఎంపిక చేసినట్టే అని, లోలోపల ప్రిపరేషన్‌ అంతా జరుగుతోందని, ఆఖరి నిమిషంలో సిట్టింగులకు ఝలక్‌ నిచ్చే ప్రోగ్రామ్‌ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా పెరుగుతున్న పొలిటికల్‌ హీట్‌.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచినే జనాలకు మంచి వినోదాత్మకమైన వ్యవహారంగా మారుతోంది!