cloudfront

Advertisement


Home > Politics - Gossip

సీమ‌కు నీళ్లు, పంట‌లే కాదు... న్యాయ‌మూ క‌రవే

సీమ‌కు నీళ్లు, పంట‌లే కాదు... న్యాయ‌మూ క‌రవే

రాయ‌ల‌సీమ అంటే క‌ర‌వుకు ప‌ర్యాయ‌ప‌దం. సీమంటే క‌ర‌వుకాట‌కాల‌కు పుట్టినిల్లు. ఈ ప్రాంత ప్రజ‌లు సాగు, తాగునీళ్లకు నోచుకోని శాప‌గ్రస్తులు. ప్రకృతి ప‌గ‌బ‌ట్టి వాన‌ల‌ను కురిపించ‌దు. తామేం త‌క్కువ అని పాల‌కులు సాగునీళ్లను తెప్పించ‌రు. న‌ర‌కం ఎక్కడో ఉంటుందంటారు గాని... అది అబ‌ద్ధం.  రాయ‌ల‌సీమ‌లోనే న‌ర‌కం ఉంద‌న‌డం నిజం. నేరాలు చేసినవారు, త‌ప్పులు చేసినవారు న‌ర‌కానికి పోవ‌డం సంగ‌తేమో గాని... రాయ‌ల‌సీమ‌లో పుడుతార‌నిపిస్తోంది.

రాయ‌ల‌సీమ ప్రజానీకం దుర్భర జీవితాల కంటే న‌ర‌క‌మే న‌యం అనిపిస్తుంది. చిత్తూరుజిల్లా మ‌న్నవ‌రం ప్రాజెక్టు లాభ‌దాయ‌కంగా లేక‌పోవ‌డంతో ఎత్తేస్తున్నామ‌ని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ మంగ‌ళ‌వారం రాజ్యస‌భ‌లో కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత‌పూర్వక స‌మాధానం ఇచ్చారు.  సీమ‌కు కేంద్రం ఎంతో అన్యాయం చేస్తోంద‌ని టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతుంటే న‌వ్వాలో, ఏడ్వాలో తెలియ‌ని అయోమ‌యంలో రాయ‌ల‌సీమ ప్రజానీకం ఉంది. అస‌లు రాయ‌ల‌సీమ‌కు ఎప్పుడు మాత్రం న్యాయం జ‌రిగింది. అన్యాయం మా జ‌న్మహ‌క్కు అన్నట్టు అక్కడి ప్రజ‌లు ప్రతిరోజూ పాల‌కుల వంచ‌న‌కు న‌ష్టపోతూనే ఉన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం వ‌చ్చిన కొత్తలో రాయ‌ల‌సీమ‌పై క‌క్ష క‌ట్టిన‌ట్టుగా తిరుప‌తి పద్మావ‌తి మెడిక‌ల్ కాలేజీ అడ్మిష‌న్స్‌కు రాయ‌ల‌సీమ జోన‌ల్ వ్యవ‌స్థ ఎత్తేస్తూ జీఓ 120 జారీ చేశారు. దీనివ‌ల్ల రాయ‌సీమ‌తో పాటు నెల్లూరు జిల్లాలోని 90మంది ఆడ‌బిడ్డలు వైద్యవిద్యా సీట్లను కోల్పోయ్యారు. అస‌లే క‌ర‌వు ప్రాంత ఆడ‌బిడ్డలు. తినీతిన‌కా, రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్టించి చ‌దివి గంపెడాశ‌, ఆశ‌యంతో సాధించుకున్న మెడిసిన్ సీట్లను బాబు నిర్ణయం వ‌ల్ల పోగొట్టుకోవాల్సి వ‌చ్చింది.

విభ‌జ‌న చ‌ట్టంలో గాలేరు-న‌గ‌రి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల‌ను స‌త్వరం పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం త‌న‌కు పోల‌వ‌రం, అమ‌రావ‌తి రెండు క‌ళ్లు అని చెప్పుకున్నారు. రాయ‌ల‌సీమకు ఎన్నో ప్రయోజ‌నాలు చేకూర్చే, అత్యవ‌స‌రంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల‌ను గాలికొదిలేశారు. విభ‌జ‌న చ‌ట్టంలో లేని ప‌ట్టిసీమ ప్రాజెక్టును కేవ‌లం కృష్ణాడెల్టా ప్రజ‌ల మూడోపంట సాగు కోసం యుద్ధప్రాతిప‌దిక‌న నిర్మించారు.

శ్రీ‌బాగ్ ఒప్పందం ప్రకారం రాజ‌ధానిని రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాలి. ఒక‌వేళ అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో హైకోర్టును రాయ‌ల‌సీమ‌లో నెల‌కొల్పాలి. రాజ‌ధానిని కోస్తాలో ఏర్పాటు చేయ‌డంతో క‌నీసం హైకోర్టునైనా త‌మ ప్రాంతంలో నెల‌కొల్పాల‌ని రాయ‌ల‌సీమ వ్యాప్తంగా లాయ‌ర్లు నెల‌ల త‌ర‌బ‌డి ఆందోళ‌న‌లు చేస్తున్నా చంద్రబాబు స‌ర్కార్ లెక్క చేయ‌డంలేదు. పెద్ద మ‌నుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డం న్యాయ‌మేనా?

ఎయిమ్స్‌ను అనంత‌పురంలో స్థాపించాల్సి ఉండ‌గా మంగ‌ళ‌గిరిలో ప్రారంభించి రాయ‌ల‌సీమ‌కు వైద్యాన్ని కూడా అంద‌ని ద్రాక్షలా చేయ‌డంలో బాబు ఘ‌న‌తే ఉంది. తిరుప‌తిలో క్యాన్సర్ ఆస్పత్రిని పెట్టాల్సి ఉండ‌గా, రాజ‌ధాని ప్రాంతానికి త‌ర‌లించ‌డం వెనుక ఎవ‌రి హ‌స్తం ఉందో బాబుగారే చెప్పాలి. చిత్తూరు జిల్లా దాహార్తిని తీర్చేందుకు కిర‌ణ్‌కుమార్‌రెడ్డి రూ.6వేల కోట్లతో కండ‌లేరు జ‌లాశ‌యాన్ని త‌ర‌లించేందుకు మంజూరు చేసిన ప్రాజెక్టును సీఎం చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ర‌ద్దుచేశారు. ఇది న్యాయ‌మా? అన్యాయ‌మా? 

రాష్ర్టంలో ఏ అసాంఘిక ఘ‌ట‌న జ‌రిగినా రాయ‌ల‌సీమ ప్రజ‌లే కార‌ణ‌మ‌ని స్వయంగా ఆ ప్రాంత‌వాసైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రక‌టిస్తుండ‌టం రాయ‌ల‌సీమ ప్రజానీకం మ‌నోభావాల‌ను దెబ్బతీయ‌డం కాదా? రెండేళ్ల క్రిత‌మే మ‌న్నవ‌రం ప్రాజెక్టును త‌ర‌లిస్తున్నార‌నే భ‌యంతో చిత్తూరు జిల్లాలోని ప‌లు ప్రజాసంఘాల నేత‌లు, కార్యక‌ర్తలు మ‌న్నవ‌రం ప్రాజెక్టు వ‌ద్ద ఆందోళ‌న చేశారు. అప్పట్లో కేంద్రంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ నిమ్మకు నీరెత్తిన‌ట్టు వ్యవ‌హ‌రించ‌డం నిజంకాదా? ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయ‌నే కార‌ణంతో మ‌న్నవ‌రంపై నోరు తెర‌వ‌డం స్వార్థం, అవ‌కాశ‌వాదం కాదా?

రాయ‌ల‌సీమ‌లో ప‌ట్టుబ‌డిన ఎర్రచంద‌నం దుంగ‌ల‌ను వేలం వేయడం ద్వారా వ‌చ్చిన వేలకోట్ల సొమ్మును క‌ర‌వు ప్రాంత‌మైన రాయ‌ల‌సీమ అభివృద్ధి కోసం కాకుండా అభివృద్ధి చెందిన ప్రాంతాల కోసం ఖ‌ర్చు పెట్టడం ఏం న్యాయ‌మో జ‌వాబు చెప్పాలి. ఎప్పుడైనా ఈ ప్రాంతానికి న్యాయం చేసి ఉంటే ఇత‌రుల అన్యాయంపై ప్రశ్నించే హ‌క్కు ఉండేది. పాల‌కులంతా క‌క్ష క‌ట్టిన‌ట్టు రాయ‌ల‌సీమ‌కు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఈ ప్రాంత ప్రజ‌లు రాజ‌కీయ పార్టీల‌పై విశ్వాసం కోల్పోయి నైరాశ్యంలో ఉన్నారు. నైరాశ్యం కాస్త తిరుగుబాటు అయ్యేవ‌ర‌కే రాజ‌కీయ నేత‌ల ఆట‌లు. ఆ త‌ర్వాత జాగ్రత్త‌!
-ఎస్వీ ర‌మ‌ణారెడ్డి