Advertisement


Home > Politics - Gossip
కేసీఆర్–మమతల మధ్య ఎక్కడో చెడిందే!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీల మధ్య మూడో కూటమికి సంబంధించిన మైత్రీబంధం ఉదయించలేదా? ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా వీరిద్దరి మధ్య చర్చల్లోనే.. స్నేహం అంకురించకుండా వాడిపోయిందా? ఇప్పుడు ఎవరికి వారు తమ తమ సత్తా నిరూపించుకోవడానికి విడివిడిగా కూటములను ఏర్పాటుచేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారా? అనే సందేహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా వినిపిస్తున్నాయి.

మూడో కూటమి పేరుతో ఈ ఇద్దరూ భావసారూప్యత గల ప్రకటనలు చేసినప్పటికీ.. ముఖాముఖీ భేటీ జరిగిన తర్వాత.. మైత్రి పొసగలేదని అనిపిస్తోంది. ‘మూడో కూటమి’ పేరుతో దేశంలో అనేక కూటములు అవతరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా కనిపిస్తోంది.

దేశంలో కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ఒక కొత్త కూటమి రావాల్సిన అవసరం ఉన్నదని, రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చేలా... రాష్ట్రాలకు సంపూర్ణాధికారం ఉండేలా కేంద్రం పాలన సాగాలని ఆ నడుమ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఘాటుగా ప్రతిస్పందించారు. ఆయన మాటలకు వివిధ రాష్ట్రాల్లోని అనేక పార్టీలనుంచి సానుకూల స్పందన వచ్చింది.

మమతా బెనర్జీ, హేమంత్ సోరెన్ తదితరులు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దాంతో కేసీఆర్ సంబరపడిపోయారు. ఇక తాను జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతానని, 2019లో ఎమ్మెల్యేగా పోటీ కూడా చేయబోనని ఆయన తేల్చేశారు. ఆ క్రమంలోనే ఆయన పశ్చిమ బెంగాల్ కు వెళ్లి మమతా బెనర్జీతోనూ భేటీ అయ్యారు. మూడో కూటమిని బలోపేతం చేసేందుకు చర్చలు జరిపారు.

అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ.. ఆ తర్వాత.. ఇద్దరి ప్రయత్నాలు చీలిపోయాయి. ఇద్దరూ విడివిడిగా మూడో కూటమి ప్రయత్నాలు సాగిస్తున్నారు. హేమంత్ సోరెన్ ఆ తర్వాత హైద్రాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిసి వెళ్లగా, మమతా బెనర్జీ ఢిల్లీ కేంద్రంగా పలువురు పార్టీ నేతలను కలుస్తూ తన కూటమికి మద్దతు కూడగడుతున్నారు. తాజాగా ప్రస్తుతం కాంగ్రెస్ కు అనుకూలంగా యూపీఏలో ఉన్న తమిళనాడులోని డీఎంకే పార్టీ మమతా బెనర్జీ కూటమితో జట్టుకడుతుందంటూ స్టాలిన్ ప్రకటించడం విశేషం.

అయితే మూడో కూటమికి ప్రధాన నేత ఎవరు? అనే విషయంలోనే మమతా దీదీ, కేసీఆర్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఉండవచ్చుననే మాట వినిపిస్తోంది. మమతా బెనర్జీకి ప్రథాని కావాలనే ఆలోచన చాలాకాలం ముందునుంచి ఉన్నట్లు పుకార్లున్నాయి. కొత్తగా కేసీఆర్ దాదాపు అలాంటి కోరికతో తెరమీదకు రావడాన్ని ఆమె సహించి ఉండకపోవచ్చునని కొందరు అనుకుంటున్నారు.

ఈ రకంగా మూడో కూటమి పేరుతో అనేక కూటములు ఏర్పడి.. ఎన్నికల బరిలో పరస్పరం తలపడితే.. మోడీ వ్యతిరేక ఓటు చీలిపోయి.. అంతిమంగా భాజపాకే లాభం చేకూరుతుంది కదా అనే వాదన కూడా వినిపిస్తోంది.