Advertisement


Home > Politics - Gossip
శిల్పా మోహన్ రెడ్డి.. డీల్ సెట్ అయ్యిందా..?

తను కడపలో జగన్ తో సమావేశం అయ్యాను, కాదు కాదు, బెంగళూరులో జగన్ తో సమావేశం అయ్యాను.. అని మీడియాకు లీకులు ఇచ్చినప్పుడే శిల్పామోహన్ రెడ్డి కథాకమామీషేమిటో స్పష్టం అయిపోయింది. ఇదంతా బాబును బెదరించే వ్యూహం తప్ప.. అంతకు మించినదేమీ లేదని. మొదటిరోజు కార్యకర్తల సమావేశంలో వైకాపాలో చేరతాం... అని హెచ్చరించిన ఈయన రెండోసారి బాబుతో సమావేశం అయ్యాకా.. నేను పోటీచేయడం మాత్రం ఖాయం అన్నాడు, అంతే కానీ వైకాపాలో చేరతా అనేమాట ఇప్పుడులేదు! నాలుగైదు రోజులపాటు ఆలో చించుకొమ్మని బాబు తనకు సమయం ఇచ్చాడని కూడా శిల్పారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇంకేముంది.. ఇంకా శిల్పాను రెబల్ అనుకోగలమా? ఈయనకు అంత సీన్ లేదనే విషయం స్పష్టంగా అర్థమైపోలా? ఇప్పుడు శిల్పామోహన్ రెడ్డి మీడియాకు ముందస్తుగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు.. తన తమ్ముడికి మండలి చైర్మన్ పదవి ఇస్తానని బాబు హామీ ఇచ్చాడని.. బహుశా మీడియాకు కూడా ఇప్పుడే చెప్పేస్తే రేపు బాబు మళ్లీ మాట తప్పడానికి అవకాశం ఉండదనేది శిల్పారెడ్డి లెక్కకావొచ్చు. అయినప్పటికీ తను పోటీ పోటీనే.. అని శిల్పా చెప్పుకొచ్చాడు. తను పోటీ చేసేది కేడర్ ను కాపాడుకునేందుకు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే శిల్పామోహన్ రెడ్డి రెబల్ గా మారతాడు.. అంటే, అంత సీన్ లేదనే అభిప్రాయమే వినిపిస్తోందిప్పుడు. ఎలాగూ త్వరలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాలున్నాయి.. ఆ సమయంలో తనకు అవకాశం ఇవ్వాలనేది శిల్పా డిమాండ్ గా తెలుస్తోంది.

అయితే బాబు అది కుదరదు అంటున్నట్టుగా సమాచారం. వచ్చేసారి నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తాం కానీ, అంతలోపు ఎమ్మెల్సీ అంటే కుదరదనేది బాబు వాదనగా తెలుస్తోంది. ఇదే ఇద్దరి మధ్యనా ప్రధాన విభేదంగా తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో మొత్తం వ్యవహారం సెటిలవుతుందని సమాచారం. తమ్ముడికి మండలి చైర్మన్, ఈయనకు ఎమ్మెల్సీ నామినేషన్, అదనంగా.. కాంట్రాక్టులు, పనులు! శిల్పా చల్లారినట్టే అని, చప్పున చల్లారినట్టుగా అనిపించకుండా.. నాల్రోజుల సమయం.. కార్యకర్తల అభిప్రాయాలు.. అంటూ హడావుడితో సిసలైన రాజకీయ నేత మాటలు మాట్లాడుతున్నాడనేది ఇన్ సైడ్ టాక్.