cloudfront

Advertisement


Home > Politics - Gossip

బీజేపీకి 'కన్నడ' దెబ్బ మళ్ళీ మళ్ళీ.!

బీజేపీకి 'కన్నడ' దెబ్బ మళ్ళీ మళ్ళీ.!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, దక్షిణాదిలో సత్తా చాటాలనుకున్న ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆశలు నెరవేరలేదు. నిజానికి, కర్నాటకలో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ఓటర్లు పట్టం కట్టారు. అయినాగానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలైనన్ని సీట్లను మాత్రం బీజేపీ సంపాదించుకోలేకపోయింది. ఓట్ల శాతం పరంగా చూసుకున్నా బీజేపీకి, చేదు అనుభవమే ఎదురయ్యింది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప, సీఎం పదవిలో కూర్చున్నా.. బలాన్ని నిరూపించుకోలేక పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

గత నెలలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే, ఆ తర్వాత కర్నాటకలో రెండు ఉప ఎన్నికలు జరిగాయి. ఆర్‌.ఆర్‌.నగర్‌ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీకి షాక్‌ తగిలింది. అక్కడ కాంగ్రెస్‌ గెలుపొందింది. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో జయనగర నియోజకవర్గం సైతం కాంగ్రెస్‌ 'హస్త'గతమవడం గమనార్హం. 'మెజార్టీ సీట్లు మాకే దక్కాయి.. ప్రజలు మాతోనే వున్నారు..' అని బీజేపీ చెప్పుకుంటూ వస్తోన్న ఈ తరుణంలో, వరుసగా ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్‌ మీద షాక్ తగులుతుండడం విశేషం.

తాజాగా, జయనగర ఉప ఎన్నికలో గెలుపుతో కాంగ్రెస్‌ బలం అసెంబ్లీలో 80కి చేరుకుంది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి మిత్రపక్షం జేడీఎస్‌ మద్దతు పలికింది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రస్తుతం కర్నాటకల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఇటీవలే పదవుల పందేరం కూడా పూర్తయ్యింది. కాంగ్రెస్‌ - జేడీఎస్‌ 'మైత్రి' మూణ్ణాళ్ళ ముచ్చటేనని బీజేపీ చెబుతోందిగానీ, 2019సార్వత్రిక ఎన్నికల్లోనూ తాము కలిసే వుంటామని ఆ రెండు పార్టీలూ అంటున్నాయి.

ఇదిలా వుంటే, తాజాగా కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి 'ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' విసిరిన ప్రధాని నరేంద్రమోడీ అభాసుపాలయ్యారు. 'నేనెప్పుడూ ఫిట్‌గానే వుంటానంటూ, ఫిట్‌నెస్‌ మోడీ ఛాలెంజ్‌ని లైట్‌ తీసుకున్నారు కుమారస్వామి. పైగా, 'నా వ్యక్తిగత ఆరోగ్యం కంటే, కర్నాటక రాష్ట్ర ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం. ప్రధాన మంత్రిగా కర్నాటకకు మీ నుండి పూర్తి సహకారం ఆశిస్తున్నా..' అంటూ నరేంద్రమోడీకి రిప్లయ్‌ పేరుతో గట్టి కౌంటరే ఇచ్చారాయన.