Advertisement


Home > Politics - Gossip
రైల్వేస్టేషన్ లో పడుకుంటే.. జోన్ వస్తుందా?

‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?’ అని సామెత. పోరాటం అని చెప్పుకోడానికే పరువు తక్కువగా అనిపించే తరహా ఉద్యమాలను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సాగిస్తూ ఉంటే.. ఆయన పార్టీ ఇతర నాయకులు మాత్రం.. అంతకంటె భిన్నమైన పోరాటాలు ఎలా చేస్తారు? వారి పోరాటాలు కూడా అదే తరహాలో.. రాజకీయ ప్రయోజనాలు తప్ప.. సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేని పోరాటాలుగానే సాగుతాయి.

ఇప్పుడు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ రాయుడు అలాంటిదే ఒక మొక్కుబడి ఉద్యమం చేస్తున్నారు. నెలకోసారి రైల్వేస్టేషన్ లోనే నిద్రపోవడం ద్వారా విశాఖకు రైల్వేజోన్ సాధించేస్తా అని ఆయన చాలా గంభీరంగా ప్రకటిస్తున్నారు. అయినా ఏదో జనం ముందు బిల్డప్ ఇచ్చుకోవడానికి తప్ప.. ఇలాంటి రైల్వే స్టేషన్ నిద్రల వల్ల.. జోన్ ను సాధించేంత ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద వస్తుందా? ఆచరణలో అది సాధ్యమేనా అనే విమర్శలు అనేకం వినిపిస్తున్నాయి.

ఎందుకంటే.. ఇలా స్టేషన్లలో నిద్రపోవడం, హాస్టళ్లలో నిద్రపోవడం వంటి జిమ్మిక్కులు నాయకులు చాలా చిన్న లక్ష్యాల విషయంలోనే వాడుతుంటారు. ఒకరికి మద్దతుగా ప్రజల్లో చైతన్యం కలిగించాలనుకున్నప్పుడు.. వసతుల విషయంలో అధికారుల్లో నిర్లక్ష్యం రాకూడదని చూస్తున్నప్పుడు ఇలాంటివి పనిచేస్తాయి. అంతే తప్ప.. కేవలం నెలకోరాత్రి రైల్వేస్టేషన్ లో పడుకున్నంత మాత్రాన రైల్వేజోన్ వచ్చేస్తుందా? అనేది జనంలో సందేహం.

ఎందుకంటే.. తెలుగుదేశం పార్టీ నూటికి నూరుశాతం చిత్తశుద్ధి లేని శివపూజ వంటి ఆందోళన కార్యక్రమాలనే నిర్వహిస్తోంది. వారికి పార్టీ మైలేజీ గురించి తప్ప.. సమస్యను పరిష్కరించడం గురించి ఎలాంటి పట్టింపు ఉండడం లేదు. విశాఖకు రైల్వేజోన్ సాధించడం గురించి.. నిజంగానే ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పట్టుదలే ఉంటే గనుక.. ఆముదాల వలస స్టేషన్లో పడుకోడం కాదు.. ఆ స్టేషన్ మీదుగా ఒక్క రైలు కూడా ఏపీ దాటి మరో ప్రాంతానికి వెళ్లగల అవకాశమే లేకుండా.. నిరవధిక రైల్ రోకో నిర్వహించాలి.

ఆయనను అరెస్టు చేస్తే ఆ మరురోజున మరొకరు రంగంలోకి దిగడం.. మళ్లీ అరెస్టులు జరిగితే.. మళ్లీ మరొకరు రంగంలోకి దిగడం ఈ రకంగా.. ఆ మార్గంలో రైల్వేశాఖకు నయాపైసా ఆదాయం రాని పరిస్థితిని తయారుచేయాలి. అప్పుడు మాత్రమే.. కేంద్రంలో కదలిక వస్తుంది. అలాంటి క్రియాశీల పోరాటాలు చేయకుండా.. ఇలా ఉత్తుత్తి నిద్రలు ఆగ్రహ ప్రకటనలతో జోన్ రావడం సాధ్యమేనా? ఈ పోరాటాలు కామెడీ కాదా అనే విమర్శలు వినవస్తున్నాయి.