cloudfront

Advertisement


Home > Politics - Gossip

స్లో పాయిజనింగ్‌ కాదు.. సెల్ఫ్‌ పాయిజనింగ్‌

స్లో పాయిజనింగ్‌ కాదు.. సెల్ఫ్‌ పాయిజనింగ్‌

2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తాను గద్దె ఎక్కడానికి కీలకంగా ఉపయోగపడిన రెండు తురుపుముక్కలు ఇప్పుడు ఆయన చెంతలేవు. ఆయన ఒంటరి. కాకపోతే.. నలభయ్యేళ్ల సీనియారిటీ మాత్రమే ఆయనతో ఉంది. ఆ ప్రస్థానంలో నేర్చిన కుటిలనీతి ఆయన బలం! తన అధికారానికి మూలకారకులైన వారిలో నరేంద్రమోడీకి, ఆయన పార్టీకి తన రాష్ట్రంలో నూకలు చెల్లని పరిస్థితిని సృష్టించేశానని ఆయన సంబరపడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ అనూహ్యంగా తెరమీదకు వచ్చిన కొత్త శత్రువు. ఆయనకు జనంలో క్రెడిబిలిటీ అనేది ఏమైనా ఉంటే దానిని సమూలంగా ఎలా తొక్కేయాలా అని ఇంకా వ్యూహాన్ని సిద్ధం చేయలేకపోతున్నారు.

అయితే ప్రజల ముందు జట్టుగా కనిపించిన ముగ్గురిలో ఇద్దరు శత్రువులుగా మారిపోగా.. వారిని స్లోపాయిజనింగ్‌తో అంతం చేయాలనేది బాబు ప్లాన్‌. మోడీ విషయంలో స్లో పాయిజనింగ్‌.. వర్కవుట్‌ అయినట్లే ఉంది. పవన్‌ విషయంలో ఇప్పుడే మొదలైంది. కాకపోతే.. కాస్తంత లోతులకు వెళ్లి గమనించినప్పుడు.... మిత్రత్వం వర్ధిల్లినంత కాలమూ.. వారిద్దరినీ ఆకాశానికెత్తేస్తూ చంద్రబాబు చేసిన ఆర్భాటం మొత్తం ప్రజలకు గుర్తుంది. అలా గుర్తుండడం అంటే.. వారికి ఇచ్చే స్లోపాయిజనింగ్‌ అనేది.. ఆయనకు కూడా 'సెల్ఫ్‌ పాయిజనింగ్‌' అవుతుందని భావించాల్సిందే.

తాను తవ్విన గోతిలో తానే పడినట్లు... ఈ సెల్ఫ్‌ పాయిజనింగ్‌ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునే కబళించేయబోతోందా..? ప్రస్తుతానికి ఇదే ప్రశ్న.

చంద్రబాబునాయుడు తాజా వ్యూహప్రణాళికలో పుష్కలంగా పరనిందలు కురిపించడం ద్వారా.. ఈసారి ఎన్నికల గండం గట్టెక్కాలని ఆయన అనుకుంటున్నారు. తన నోటితో 'మంచి' అనడానికి ఆయనకు రాష్ట్రంలో ఒక్క వ్యక్తి కూడా కనిపించడం లేదు. నిజానికి ఏ వ్యక్తికి అయినా సరే.. ఇది చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి. తనచుట్టూ ఉండే ప్రపంచంలో ఏ ఒక్కరిలోనూ మంచిని చూడలేని వ్యక్తి.. ఆలోచనా దృక్పథం గురించి మనం జాలిపడాలి.

ఇప్పుడు చంద్రబాబు అదేస్థితిలో ఉన్నారు. కనీసం తన సొంత మంత్రివర్గంలో అయినా సచ్ఛీలురు.. సత్ప్రవర్తనా పరులు ఉన్నారని ఆయన గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలరని అనుకోవడానికి వీల్లేదు. మహా అయితే నారాలోకేష్‌ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడంటూ కితాబులు ఇస్తే ఇవ్వవచ్చుగాక! ఇప్పుడు అదే లోకేష్‌ పుణ్యమాని తన పరువు బజార్నపడిందనే సంగతిని కూడా ఆయన గుర్తించడంలేదు. 
ఇలాంటి ప్రమాదకరమైన మానసిక స్థితిలో ఉన్న చంద్రబాబునాయుడు... తన పరిపాలనలోని అసమర్థత అడుగడుగునా బయటపడుతున్న ప్రస్తుత తరుణంలో.. ఏ క్షణాన ప్రజలు గుర్తించి తనను ఛీత్కరించుకుంటారో అనే భయంతో, అసహనంతో, పిరికితనంతో రగిలిపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఎవ్వరినీ విడిచిపెట్టకుండా ప్రతిఒక్కరి మీదా నిందలువేస్తూ.. చెలరేగిపోతున్నారు. 

పరనిందలు పనిచేస్తాయా?

పదిమంది మేకను కుక్క అనగానే.. అది కుక్క అయిపోతుందని ఒకసామెత. రాజకీయ ప్రత్యర్థులను నిందించడంలో చంద్రబాబునాయుడుకు పదిమంది కాదు.. వందల మంది తెలుగుతమ్ముళ్లు సాయం వస్తున్నారు. ఎవ్వరి మీదనైనా అధినేత ఒక నిందవేస్తే చాలు.. అదే నిందకు పదేపదే కోరస్‌ పాడుతూ.. తెలుగుతమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. అయితే ఇలాంటి గోబెల్స్‌ ప్రచారం ద్వారా చంద్రబాబు ఆశిస్తున్న ప్రయోజనం అంత సులువుగా దక్కుతుందా? సాధ్యమేనా? ప్రజలు మరీ అంత అమాయకుల్లాగా ఆయనకు కనిపిస్తున్నారా? అనేది చర్చనీయాంశం.

ఇవాళ్టి రాజకీయాల్లో పరనిందలకు వేల్యూ లేకుండా పోయింది. ఒక నాయకుడు ఎంత అవినీతికి పాల్పడినా.. ఎంత దుర్మార్గుడని తెలిసినా.. ఇతర పార్టీలకు చెందిన వారు ఆ విషయాలను బయట పెట్టినప్పుడు ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఇది కేవలం చంద్రబాబు ఇతరులను నిందించే విషయంలో మాత్రమేకాదు. చంద్రబాబు మీద వస్తున్న నిందలకు కూడా వర్తిస్తుంది. పవన్‌ కల్యాణ్‌.. మొన్నటికి మొన్న నారాలోకేష్‌ గురించి వేలకోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడంటూ విమర్శలు గుప్పిస్తే ఏమైంది? ఆ క్షణంలో పవన్‌ సభలోని అభిమానులు విజిల్స్‌ కొట్టారు.

అంతే ఇప్పటిదాకా దాన్ని గురించి పట్టించుకున్న వాడులేడు. చంద్రబాబు అవినీతి గురించి జగన్‌ చెబుతున్న సంగతుల పరిస్థితి కూడా అంతే. కాకపోతే.. జగన్‌కు ఆదరణ పెరుగుతుండడానికి, ఆయన యాత్రకు ప్రజలు వెల్లువెత్తుతుండడానికి.. ఆయన పట్ల జనాదరణ గ్రాఫ్‌ పెరుగుతుండడానికి ఆయన ఇస్తున్న జనాకర్షక హామీలు పెద్దకారణం అవుతాయే తప్ప.. చంద్రబాబు మీద వేస్తున్న నిందలు కాదు!

ఆధునిక రాజకీయ పోకడల్లో ఇది మౌలికమైన సత్యం. ఇంత మౌలికమైన సత్యం... నలభయ్యేళ్ల వార్ధక్యం వచ్చేసిన చంద్రబాబునాయుడుకు తెలియకపోవడమే విశేషం. ఆయన మోడీ మీద, జగన్‌, పవన్‌, వామపక్షాలు, భాజపా దళాలు అందరి మీద ఎడాపెడా నిందలు వేస్తూ విమర్శలు చేస్తూ.. అదేబాటలో పోతూ ఉంటే.. తన పబ్బం గడచిపోతుందని అనుకుంటున్నారు. నాయకుడు అనేవాడు.. తన సమర్థతను నిరూపించుకుని ప్రజల ఆదరణ పొందాలని అనుకోవాలి.

అంతేతప్ప.. ఇతరుల అసమర్థతల గురించి చాటిచెబుతూ.. వాళ్లంతా చేతగానివాళ్లు గనుక.. నన్ను ఎన్నుకోండి. మీకు నేను తప్ప మరో గత్యంతరంలేదు.. అని సంకేతాలు వచ్చేలా మాట్లాడడం ఎంతవరకు సబబు? అనేప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవుతోంది.

నాయకుడు తన సమర్థత గురించి 'చెప్పుకుని' ఓట్లు రాబట్టే సమయం దాటిపోయింది. మాటలు నమ్మి జనం ఓసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వారికి చేతలు చూపించాలి. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. ఆ విషయాల్లో తాను పూర్తిగా విఫలం అయిన తర్వాత.. అటు రాజధాని, పోలవరం, ప్రగతి పనులు శవాసనం వేసిన తర్వాత.. ఎన్నికల వాకిట్లో ఆయన ఇతర పార్టీలన్నీ అభివ ద్ధికి అడ్డు పడుతున్నాయంటూ.. తన చేతగానితనం కవర్‌ చేసుకోవడానికి మాటలు పేరిస్తే.. నమ్మడానికి జనం వెర్రివాళ్లా?

సెల్ఫ్‌ పాయిజనింగ్‌

ప్రధానంగా మోడీ మరియు భాజపా, పవన్‌ కల్యాణ్‌ల సంగతి చెప్పుకోవాలి. ఇవాళ వారిని భారీగా నిందిస్తున్నారు. అయితే నిన్నటిదాకా పరిస్థితి ఏమిటి? పార్టీ నాయకులు హర్ట్‌ అయి పవన్‌ మీద తాము వ్యక్తిగతంగా ఫైర్‌ అయినా కూడా.. చంద్రబాబు వారిని మందలించారు. పవన్‌ కల్యాణ్‌.. ఒక్క ఓటుకు ఠికానా లేని, బొడ్డూడని పార్టీ అధినేత సచివాలయానికి వస్తే.. రెడ్‌కార్పెట్‌ స్వాగతం చెప్పి.. చంద్రబాబు ఎంత సిగ్గుమాలిన హడావిడి చేశారో అందరికీ తెలుసు. అంతగా వారిని ఆయన నెత్తిన పెట్టుకున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతిని ప్రశ్నించగానే.. పవన్‌ ఆయనకు చేదు అయిపోయాడు. కుట్రలు పన్నుతున్న వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. ప్రజాకంటకుడిగా, ప్రగతి నిరోధకుడిగా పవన్‌ను కూడా ఇప్పుడు చంద్రబాబు అభివర్ణిస్తున్నారు. భాజపా విషయంలో కూడా అచ్చంగా ఇంతే. కాకపోతే.. ప్రత్యేకహోదా అనే డిమాండ్‌ ప్రజల్లో కూడా ఉన్నది గనుక.. ఆ సెంటిమెంటు ప్రభావితం చేస్తున్నది గనుక.. మోడీ మీద విషం చిమ్మడం అనేది ఆయనకు వర్కవుట్‌ అయింది.

పవన్‌ విషయంలో బెడిసి కొడుతోంది. అయితే ఒక్క అంశం నిజం. ఈ ఇద్దరి మీద 'స్లో పాయిజనింగ్‌'ను జనం నమ్మినా కూడా.. నిన్నటిదాకా వారిని నెత్తిన పెట్టుకున్నందుకు వారి పాపంలో.. చంద్రబాబుకు కూడా భాగం ఉందని అనుకోవాల్సిందే కదా! బతుకంతా పాపాలు చేసి.. తుదిశ్వాసకు ముందు తులసితీర్థం తాగితే డైరక్టుగా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అనుకోవడం ఎంతభ్రమో.. నాలుగేళ్లు మోడీ, పవన్‌ల భజన చేసి.. ఇప్పుడు తిట్టిపోస్తే.. ఆ పాపంలో తన వాటాని ప్రజలు గుర్తించరు అనుకోవడం కూడా అంతే భ్రమ. అందుకే.. వారి మీద చేసే విమర్శలన్నీ చంద్రబాబుకు స్వయంగా సెల్ఫ్‌ పాయిజనింగ్‌ అవుతాయని కూడా పలువురు అంటున్నారు. 

పిరికితనమే బ్రహ్మాస్త్రం!

సాధారణంగా వ్యక్తులు ఎవరైనా... తమ బలహీనతల గురించి తమకు వాస్తవాలు తెలిసినప్పుడు ఆత్మన్యూనతకు గురవుతారు. ఇతరులు కూడా తమ బలహీనతలను గుర్తిస్తారేమో అని... బెరుకుగా బతుకుతారు. కానీ.. చంద్రబాబునాయుడు తీరు వేరు! దేశ రాజకీయాల్లో నలభయ్యేళ్ల సుదీర్ఘ, అపార అనుభవం ఆయన సొంతం. బలహీనతలను కూడా అస్త్రాలుగా మార్చుకోవడం ఎలాగో ఆయనకు తెలుసు. నలభయ్యేళ్ల అనుభవం పండిపోయి వార్ధక్యంగా మారిపోయిన దరిమిలా.. తనలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పిరికితనం గురించి ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది.

అందుకే ఆయన తన సమర్థతను ప్రజలు గౌరవించాలని కోరుకోకుండా.. ప్రజలు తన మీద జాలిచూపించాలని ఆరాటపడుతున్నారు. భాజపాతో విభేదించిన నాటినుంచి నా మీద కేసులు పెట్టాలని కుట్ర చేస్తున్నారు. నా మీద కేసుల్ని తిరిగి బయటకు తీస్తాం అంటున్నారు.. అంటూ చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. ఆయనలోని పిరికితనం ఇన్ని మాటలు మాట్లాడిస్తోంది. ఒక రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న నాయకుడు ఇంత బేలగా మాట్లాడడం చిత్రమే. అందరూ తనను చూసి జాలిపడాలి. ఆ జాలిలోంచి వచ్చే ఎన్నికలలో ఓట్లు పిండుకోవాలి.. అని ఆయన భావిస్తున్నట్లుంది.

కానీ.. అలాంటి జాలి గొలిపే బేలమాటలు అధికారాన్ని కట్టబెట్టవు. ప్రజలు కావాలంటే జాలి చూపిస్తారు.. అయ్యోపాపం అంటారు. కానీ.. ఇన్ని ఇబ్బందులున్న వాడు నాయకుడిగా ఏం చేస్తాళ్లే అని పక్కన పెడతారు. అదే జగన్మోహన రెడ్డి విషయంలో పూర్తిగా భిన్నం. ఆయన అప్పట్లో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను అధికారంలో ఉన్న పార్టీలో తాను చట్టసభ సభ్యుడిగా ఉంటూనే పార్టీనుంచి బయటకు వచ్చి.. తనమీద అప్పటికప్పుడు కేసులు బనాయించినా.. ఎన్ని కేసులయినా పెట్టుకోండి.. నేను పోరాడి నా నిజాయితీని నిరూపించుకుంటా.. అని సవాళ్లు విసిరారు.

అంత దూకుడుగా ఉన్నందుకే ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది వెరవలేదు. వెళ్లారు వచ్చారు. ఇప్పుడు మబ్బులు తొలగినట్లుగా కేసులు తొలగుతున్నాయి. చంద్రబాబు అసలు కేసుల విచారణ అంటేనే బెంబేలెత్తి పోతుంటారు. బేల పలుకులు పలుకుతుంటారు. ఇలాంటి మాటల వల్ల ప్రజల్లో విలువ దక్కదని ఆయన తెలుసుకోవాలి. 

పసిపిల్లలకు నేర్పే పాఠం తెలియదా?

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు? అనేది పసిపిల్లలకు నేర్పే పాఠం. పరులవైపు వేలెత్తి చూపించేప్పుడు.. తతిమ్మా నాలుగు వేళ్లూ మనల్నే చూపిస్తుంటాయని తెలుసుకోవాలని కూడా కొందరు అంటుంటారు. చంద్రబాబు నాయుడుకు ఈ ప్రాథమికమైన సంగతి తెలియకపోవడం చోద్యం. ఆయనకు తెలిసిన విద్య ఒక్కటే. పరనింద. ఎడాపెడా ప్రతివాళ్లనూ తిట్టడం ఒక్కటే ఆయనకు తెలుసు. ఆ క్రమంలో నిన్నటిదాకా తనే నెత్తిన పెట్టుకున్న వాళ్లను ఇప్పుడు తిట్టడమూ, నిన్నటిదాకా తిట్టిన పనులను ఇప్పుడు తనే నెత్తికెత్తుకోవడమూ... ఇలాంటి ద్వంద్వ వైఖరులను ప్రజలు గమనించరు అని చంద్రబాబు అనుకోవడం భ్రమ. ఆయన ప్రత్యర్థులను గురించి ఒక లోపం ప్రస్తావించి నింద వేసినప్పుడు.. అదే కోణంలో ప్రజలు ఆయనలో వంద లోపాలను గుర్తించగలరు! అంటే తన మాటలు తనకు కూడా చేటు చేస్తాయని ఆయన తెలుసుకోవాలి. 

ప్రేమించే వాళ్లలో జాలి పుట్టవచ్చు.
కానీ జాలి పుట్టించడం వలన ప్రేమ కలగదు.

ఈ సూత్రం జనాదరణకు వర్తిస్తుంది. అధికారానికి వర్తిస్తుంది. ఆ విషయం గ్రహించి వ్యర్థ ప్రేలాపనలు మానుకుంటే.. తీరు మార్చుకుంటే చంద్రబాబుకే మంచిది..!

-కపిలముని
kapilamuni.a@gmail.com