Advertisement


Home > Politics - Gossip
సోషల్‌ మీడియాలో రాజకీయ విషం!

-అదుపు తప్పుతున్న పరిస్థితి
-కుట్ర అంతా పెయిడ్‌ వర్కర్లదే
-ప్రత్యేకంగా నియమితం అవుతున్న సైన్యం
-విషం చల్లిస్తున్న రాజకీయ పార్టీలు
-కత్తి మహేశ్‌ వెనుక కథేంటి?

ఫోర్త్‌ ఎస్టేట్‌ అనుకున్న మీడియానే మేనేజ్‌ చేస్తున్న రాజకీయ పార్టీలకు సోషల్‌ మీడియా ఒకలెక్కనా? దశాబ్దాలుగా ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా నడుస్తున్న మీడియా సంస్థ.. తమదే అత్యధిక సర్క్యులేషన్‌ అని చెప్పుకొంటూ.. తమ అనుకూలమైన పార్టీ అజెండాను సమర్థవంతంగా అమలు చేస్తున్నప్పుడు.. సోషల్‌ మీడియా కూడా అదేదారి పట్టడంలో పెద్ద విడ్డూరం ఏముంది?

మీడియాను కూడా వేలకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మార్చేసుకుని.. దాంతోనే ప్రభుత్వాలను కూల్చడం, నిలబెట్టడం చేయడాన్ని దశాబ్దాల కిందటే చేసి చూపించిన వారికి సోషల్‌ మీడియాను తమ కబంధ హస్తాల్లోకి తీసేసుకోవడం పెద్ద కథనా? ఇప్పుడు అదే జరుగుతోంది. సోషల్‌ మీడియా వచ్చేసింది.. ఇక మీడియాకు చెక్‌ పడినట్టే, సెల్ఫ్‌బ్రాడ్‌ కాస్టింగ్‌ మీడియా వచ్చేసింది.. ఇక పెయిడ్‌ మీడియాకు దెబ్బే.. అని అనుకున్నంతలోనే.. ఇక్కడ కథలు మారిపోతున్నాయి.

సోషల్‌ మీడియాను ఆయుధంగా వాడుకొంటూ.. తమ రాజకీయ అజెండాలను గట్టిగా అమలు చేస్తున్నాయి కొన్నివర్గాలు. మీడియాను అయితే ఎలా వ్యాపార లెక్కలో తీసుకొచ్చి.. విషాన్ని చల్లి తమ రాజకీయాన్ని కొనసాగించారో.. సోషల్‌ మీడియాతోనూ అదేపని చేయిస్తున్నారు. ఇక్కడా ఎత్తుగడలే.. జస్ట్‌ కొన్ని ఫేక్‌ అకౌంట్స్‌తో కథను మార్చేస్తున్నారు. తమకు సమస్యగా మారతారు అనుకునే వ్యక్తులకు చెక్‌ చెప్పడానికి కథను నడిపిస్తున్నారు.

అంతా వ్యూహాత్మకం.. విషరాజకీయం!

గత ఎన్నికల ముందు సోషల్‌ మీడియా ద్వారా జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఒకవైపు అనుకూల మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా ద్వారా.. లక్షకోట్ల ప్రచారాన్ని ముమ్మరంగా సాగించి, మరోవైపు అప్పటికి బడ్డింగ్‌ స్టేటస్‌లో ఉన్న సోషల్‌ మీడియాలోనూ అదే ప్రచారాన్ని చేయించారు. అప్పుడప్పుడే సోషల్‌ మీడియాకు దగ్గరయిన యువతలో జగన్‌పై తమ ప్రచారాన్ని బలంగా నాటారు.

జగన్‌కు వ్యతిరేకంగా బోలెడన్ని ఫేస్‌బుక్‌ పేజీలు, ఆర్కుట్‌ గ్రూపులు, బ్లాగులు వెలిశాయి. జగన్‌పై విషప్రచారాన్ని కవితాత్మకంగా.. అందంగా.. నమ్మశక్యంగా.. చెప్పడమే వీటి పని. సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తే నమ్మేస్తారా? అనే సందేహం వద్దు. నమ్మేవాడు నమ్ముతాడు.. నమ్మని వాడితో పనిలేదు. వందకో.. వెయ్యికో.. ఒక్కడు బుట్టలో పడినా చాలు కదా! ఎంతోకొంత ప్రయోజనం నెరవేరినట్టే!

అప్పట్లో అదే జరిగింది. లక్షకోట్లు.. లక్షకోట్లు.. అంటూ తమ అజెండాను అమలు చేయడంలో దాదాపు విజయవంతం అయ్యారు. అనుకున్న అధికారాన్ని సాధించారు. ఇప్పటికి దాదాపు నాలుగు సంవత్సరాలు గడిచాయి. జగన్‌ నుంచి లక్షకోట్లు రాబట్టారా? లక్షకోట్లు కాదు.. కనీసం వేలకోట్లు కూడా చూపించలేకపోయారు. 2010-14ల మధ్య సోషల్‌ మీడియాలో బాగా హైలెట్‌ అయిన వ్యవహారాలన్నీ నకిలీవే.. వాటిల్లో వాస్తవం శూన్యమే అనే అంశం ఇప్పుడిప్పుడు తేలిపోతోంది. మరి ఇప్పుడు మరో అజెండా కావాలి!

అప్పుడు అవినీతి ఆరోపణలు చేశారు.. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు లక్షకోట్లు దోచుకున్నారు.. అని ప్రచారం చేశారు, ఇప్పుడు అదే ఖ్యాతినే తాము సొంతం చేసుకొంటున్నారు. అందుకే.. ఇప్పుడు గేమ్‌ మార్చారు. అప్పుడు మత రాజకీయం కూడా గట్టిగా చేశారు. అయితే ఇప్పుడు ఆ అవకాశమూ లేకుండా పోతోంది.. అందుకే ఇప్పుడు కుల రాజకీయాన్ని అందుకుంటున్నారు. తమచేతికి మట్టి అంటకుండా కథను నడిపిస్తున్నారు.

పవన్‌ కంటిని కాపులతోనే పొడిస్తున్నారా?

సోషల్‌ మీడియాలో ఏదైనా ఒక ఇష్యూ బయల్దేరింది అంటే.. అది ట్రెండింగ్‌లో ఉండేది కేవలం కొద్ది సమయం మాత్రమే. ఇష్యూను బట్టి.. ఒక్కరోజు హైలెట్‌ అయ్యే అంశం ఉంటుంది. రెండో రోజుకు సద్దుమణిగే అంశం ఉంటుంది. గరిష్టంగా వారం.. లేదంటే.. పదిరోజులు! ఇదీ ఏ అంశమైనా సోషల్‌ మీడియాలో వేడి మీద ఉండే వ్యవధి. ఇంతకు మించి.. దేనికి ఆయష్షు ఉండదు. ఎందుకంటే.. మరో వ్యవహారం తెరపైకి వస్తుంది. పాత వ్యవహారం తెరమరుగు అవుతుంది. ఇది హైలెట్‌ అవుతుంది. ఇదీ సోషల్‌ మీడియా ట్రెండింగ్స్‌ నైజం. ఇదీ సోషల్‌ మీడియాలో జరిగే వ్యవహారం.

అయితే.. ప్రస్తుతం తెలుగు సోషల్‌ మీడియాలో జరుగుతున్న రచ్చలో కత్తి మహేశ్‌ వ్యవహారం మాత్రం ఎంతకూ చల్లారడంలేదు. దాదాపు నెలన్నర నుంచి ఇది రచ్చ రచ్చగా మారింది. కత్తి మహేశ్‌ వర్సెస్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అనే పోరాటం.. నెమ్మదిగా మొదలై, క్రమంగా పుంజుకుంది. ఇప్పుడు ఇది పూర్తిగా దారితప్పింది. కత్తి మహేశ్‌పై కోడిగుడ్ల దాడి వరకూ వచ్చింది వ్యవహారం. నెలన్నర రోజుల్లో కత్తి మహేశ్‌ రేంజ్‌ ఎక్కడ నుంచి ఎక్కడ వరకూ వచ్చిందంటే.. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీచేసినా.. అతడిపై తను పోటీ చేస్తాను.. అని అతడు ప్రకటించుకోనేంత వరకూ!

బిగ్‌బాస్‌ షోలో అతడు పార్టిసిపేట్‌ చేస్తున్నాడు అన్నప్పుడు చాలామంది నవ్వుకున్నారు. ఇంతకీ ఎవరితడు? అని ప్రశ్నించిన వాళ్లు బోలెడు మంది. బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలు పాల్గొంటారు అని తెలుసు కానీ.. బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నాడని అతడికి సెలబ్రిటీ హోదా ఇచ్చారా? అని కొంతమంది వ్యంగ్యంగా ప్రశ్నించారు. అయితే ఇప్పడు కత్తి మహేశ్‌ రేంజ్‌ బిగ్‌బాస్‌కే బిగ్‌బాస్‌ స్థాయి వచ్చింది. బిగ్‌బాస్‌ షో ముగిసిన తర్వాత ఎవరికీ పట్టకుండా పోయిన అతడిని.. నెలన్నర రోజుల్లో.. పవన్‌ కల్యాణ్‌ పైకి అభ్యర్థిగా మార్చేంత స్థాయికి తీసుకొచ్చారు.

ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు జరుగుతోంది? ఇంకా ఏం జరగబోతోంది? అంటే.. ఒకవర్గం వారి వ్యూహం మేరకే ఇదంతా జరుగుతోందని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. పవన్‌ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని.. పవన్‌పై కత్తిని రెచ్చగొట్టి వదులుతున్నారు. కొన్ని ఫేక్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అకౌంట్లు.. కొన్ని ఫేక్‌ ఫోన్‌కాల్స్‌తో.. వ్యవహారాన్ని కాకమీదకు తీసుకొచ్చారు.

అదే సమయంలో.. కత్తి మహేశ్‌ను వైకాపా ఏజెంట్‌ అనే ప్రచారాన్నీ హోరెత్తించారు. ఇవతల కత్తి మహేశ్‌ పవన్‌ కల్యాణ్‌ను కడిగేస్తున్నాడు. అతడిని ప్రవేశపెట్టింది వైకాపా వాళ్లూ.. అనే ప్రచారం ద్వారా.. పవన్‌ అభిమానుల్లో ఎవరైనా వైకాపా అభిమానులు ఉంటే.. వారిని మరింత దూరంగా చేయడమే లక్ష్యంగా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇది బహిరంగ సత్యమే.

దీనికిగానూ.. కొన్ని ఫేక్‌ అకౌంట్లు.. ఒక టీవీ ఛానల్‌లో రోజుకో గంట వ్యవధిని పెట్టుబడిగా పెట్టి రచ్చను నడిపిస్తున్నారు. కీ ఇవ్వడం ఆ టీవీ ఛానల్‌ పని.. మరి కాస్త ఊపును ఇవ్వడం ఇటీవలే నియమితం అయిన ఒక పార్టీ సోషల్‌ మీడియా సైన్యం పని.. వీటి దెబ్బతో పవన్‌ ఫ్యాన్స్‌ రెచ్చిపోతారు. రంగంలోకి దిగుతారు. రచ్చ రచ్చ అవుతుంది. అసలు వాళ్ల ప్రయోజనాలు నెరవేరతాయి! ఇదీ నడుస్తున్న గేమ్‌.

అసలు లక్ష్యం అదే..?

తెలుగు సోషల్‌ మీడియాతో మొదలై.. టీవీ ఛానళ్ల వరకూ ఎక్కి.. జరుగుతున్న పీకే వర్సెస్‌ కేఎమ్‌(కత్తి మహేశ్‌) హ్యాష్‌ ట్యాగ్‌ పోరాటం అసలు లక్ష్యం పవన్‌ కల్యాణ్‌ను డీఫేమ్‌ చేయడం. ఆ డీఫేమ్‌ చేస్తున్నది వైకాపా వాళ్లు.. అని చెప్పడం. దీన్నివెనుక ఉండి నడిపిస్తున్నది ఒక రాజకీయ పార్టీ ప్రైవేట్‌ సైన్యం. ఇటీవలే.. ఆ పార్టీ వాళ్లు సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌ కోసం.. ప్రత్యేక సైన్యాన్ని నియమించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆఫీసులోనే అందుకు సంబంధించి ట్రైనింగ్‌ నడిచింది.

అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఒక్కోరికి కొంత జీతం ఇచ్చి.. మధ్యాహ్న భోజనం ఆఫీసులోనే పెట్టిస్తూ.. సోషల్‌ మీడియాలో.. తమ వ్యతిరేకులపై విషంచల్లే విషయంలో ట్రైనింగ్‌ ఇచ్చారు. కేవలం ఫేక్‌ అకౌంట్లను నడపడం.. వెబ్‌సైట్లను ఫాలో అవుతూ.. కామెంట్లుగా జగన్‌ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తూ ఉండటం.. తమ రొటీన్‌ లక్షకోట్ల కామెంట్‌ను కొనసాగించడంతో పాటు.. పనిలో పనిగా.. పవన్‌ కల్యాణ్‌ను ఒక ఆట ఆడేసుకొంటూ.. దానికి కారణం వైకాపా వాళ్లు అని మరో ప్రచారాన్ని చేస్తూ.. ఒకేదెబ్బకు రెండు పిట్టల సూత్రాన్ని ఫాలో అవుతోంది ఈ టీమ్‌.

దీనికిగానూ.. తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్‌ ఒకటి బాధ్యత తీసుకుంది. మొదట్లో పవన్‌ కల్యాణ్‌ను కాస్త పొగిడిన ఈ ఛానల్‌ ఆ తర్వాత రూటు మార్చింది. తమ అనుకూల పార్టీ అజెండాకు అనుగుణంగా.. గేమ్‌ను నడిపిస్తోంది. అటు పవన్‌ ఫ్యాన్స్‌ను కత్తి మహేశ్‌పై ఉసిగొల్పి విజయవంతంగా ఉచ్చులోకి లాగారు. కత్తి మహేశ్‌ను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టిస్తూ.. మంట ఆరకుండా చూస్తున్నారు. అందుకే.. ఈ వ్యవహారం చల్లారడంలేదు. చల్లారుతుంది అనుకున్నప్పుడల్లా పెట్రోల్‌ పోస్తున్నారు.

పవన్‌ను డీఫేమ్‌ చేస్తే వచ్చేదేంటి?

చిరంజీవి మీద కానీ.. పవన్‌ కల్యాణ్‌ మీద కానీ.. వాళ్లకు ఏనాడూ సాదాభిప్రాయం లేదు. దానికి కారణం వారి సామాజికవర్గమే. ఆంధ్రా ఏరియాలో ఆ సామాజికవర్గం పొడ ఈ సామాజికవర్గాకి ఎప్పటికీ గిట్టదు. పవన్‌ కల్యాణ్‌ తమ సామాజికవర్గం పార్టీకే గత ఎన్నికల్లో మద్దతు ప్రకటించినా.. ప్రస్తుతం కూడా పవన్‌ కల్యాణ్‌ తమ సామాజికవర్గం పార్టీకే మద్దతుగా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్‌ కల్యాణ్‌ తమ సామాజికవర్గ పార్టీకే మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నా.. కూడా.. పవన్‌పై వాళ్లకు ఎప్పటికీ సాదాభిప్రాయం రాదు. రాబోదు.

అన్నను గెలిపించుకోలేని పవన్‌ కల్యాణ్‌.. మమ్మల్ని గెలిపించాడా? అనేది ఇప్పుడు కూడా వాళ్ల నుంచి వచ్చేమాట. ఇదంతా కొత్తగా చెప్పేదేమీ కాదు. బహిరంగ రహస్యమే. ఈ విషయం ఎవ్వరికీ తెలియనిది కాదు. మెగా ఫ్యామిలీ మీద.. మెగా ఫ్యామిలీ సినిమాల మీద.. వాళ్లకు ఆది నుంచి అక్కసే.. అది ఇప్పటికీ ఉంది. రాజకీయంగా అయినా అంతే. ఇప్పుడు మద్దతు ప్రకటిస్తున్నాడు కదా.. అని పవన్‌ మీద పాజిటివ్‌గా రియాక్ట్‌ అయితే.. రేపు మేకు అవుతాడు అనేది వారి భయం.

ఆ పార్టీ అధినేత తీరే అంత. వెన్నుపోట్లు.. పక్కనూ కూర్చోబెట్టుకుని గుంతలు తవ్వడం.. తమచుట్టూ ఉన్న వాళ్ల వెన్ను విరగగొట్టి కూర్చోబెట్టుకోవడం.. వాళ్ల సిద్ధాంతం. ఆ మేరకే.. పవన్‌ కల్యాణ్‌ను డీఫేమ్‌ చేసే ప్రక్రియలో.. ఆ పార్టీ అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్‌ మీడియా సైన్యం, ఆ పార్టీ అనుకూల కులం.. బిజీగా ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా వాళ్లు బహిరంగంగానే చెబుతున్నారు.

ఆ మధ్య ఆ పార్టీ అనుకూల మీడియాధినేత ఓపెన్‌గానే.. ఓపెన్‌ హార్టుతోనే ఈ విషయాన్ని చెప్పాడు. పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు ఆ పార్టీకి అనుకూలం కాబట్టి.. అంతో ఇంతో పాజిటివ్‌గా స్పందిస్తున్నాం.. లేకపోతే.. కథ వేరేలా ఉంటుంది అని! ఇంత క్లియర్‌ కట్‌గా చెప్పాకా? ఇంకా కథను అర్థం చేసుకోలేని వాళ్లు ఎవ్వరైనా ఉంటారా? పవన్‌ కల్యాణ్‌కు ఆ పార్టీ ఎందుకంత నచ్చిందో.. ఏం జరుగుతున్నా ఎందుకు మద్దతు పలుకుతున్నాడో.. తన విషయంలోనే వాళ్లు విష ప్రచారం చేశారని చెప్పుకొంటూ.. అయినా తను వాళ్లకే మద్దతు పలుకుతున్నాను అని ఎందుకు చెప్పుకొంటున్నాడో.. ఆయనకే తెలియాలి కానీ, అతడిని అన్ని రకాలుగానూ భ్రష్టు పట్టించడానికి ఆ పార్టీ సైన్యం తీవ్రంగా కష్టపడుతోంది. అందుకు పక్కా ప్లాన్‌తో.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది!

పవన్‌ లేవకుండా.. మళ్లీ కోలుకోకుండా.. వ్యూహాన్ని నడిపిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ తాజా సినిమాపై పెద్దఎత్తున జరిగిన నెగిటివ్‌ పబ్లిసిటీలో కూడా ఆయన సమర్థిస్తున్న పార్టీ వాళ్ల, ఆ పార్టీ అనుకూల సామాజికవర్గం వాళ్ల ప్రమేయం ఉందని కూడా వేరే చెప్పనక్కర్లేదు. ఎంతోకొంత ఎంటర్‌టైన్‌ మెంట్‌ను అందించే ఆ సినిమాకు మరీ సున్నా మార్కులు వేసి.. బీభత్సమైన స్థాయిలో నెగిటివ్‌ ప్రచారం చేయడంలో.. వాళ్ల ప్రమేయం సుస్ఫష్టం. పైకి అన్ని అనుమతులు ఇచ్చినట్టుగానే ఇచ్చి.. లోలోన మాత్రం నెగిటివిటీని దట్టించి స్ప్రెడ్‌ చేశారు.

ఇప్పటికీ.. రాజకీయంగా అయినా.. సినిమాల విషయంలో అయినా.. మెగా ఫ్యామిలీ పొడగిట్టదు. రాజకీయం విషయంలో అయినా.. సినిమా విషయంలో అయినా.. తమ టాక్టిక్ట్స్‌ను ఉపయోగిస్తూ.. నెగిటివ్‌ పబ్లిసిటీతో దుమ్మురేపుతున్నారు. ఈ దుమ్ములో పవన్‌ ఫ్యాన్స్‌ చిక్కుకుపోతున్నారు. ఉపిరి ఆడనట్టుగా విలవిల్లాడుతున్నారు. వీళ్లు తీవ్రంగా రియాక్ట్‌ అయిపోతూ.. పవన్‌ కల్యాణ్‌కు మరింత నెగిటివ్‌ ఇమేజ్‌ను తీసుకొస్తున్నారు.

మీడియానే గాక.. సోషల్‌ మీడియాను వాడేసుకొంటూ.. వాళ్లు ఆడిస్తున్న ఆటలో వీళ్లు పావులవుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ రచ్చను మరింత పతాక స్థాయికి తీసుకెళ్లి.. పవన్‌ కల్యాణ్‌ను భ్రష్టాచారిగా మార్చడంలో ఆ వర్గంవాళ్లు, వాళ్ల గేమ్‌ విజయవంతం అవుతున్నట్టుగానే కనిపిస్తోంది.

వాళ్ల చేతికి మట్టి అంటకుండా...!

వాళ్లకు ఆదర్శం గొబెల్స్‌.. ఒకే అబద్ధాన్ని పదిసార్లు చెప్పు.. అదే నిజం అవుతుంది అనేది వాళ్ల ఆదర్శ సిద్ధాంతం. ఈ సిద్ధాంతంతోనే దాదాపు ఇరవై మూడేళ్ల నుంచి రాజకీయం నడిపిస్తున్నారు. అందరినీ బ్లఫ్‌ చేస్తూ అధికారాన్ని సాధించుకొంటూ వస్తున్నారు. దీనికి మీడియా సహకారం చాలా అవసరంగా నిలిచింది. ఆ మేరకు ఒకటికి రెండు మీడియా సంస్థలను పదికిపైగా న్యూస్‌ ఛానళ్లను కనుసన్నల్లో నడిపిస్తున్నారు. వారి ప్రత్యర్థులపై విషం గక్కడంతో ఇవి ముందుంటాయి.

ఇదే సమయంలో సోషల్‌ మీడియా ఎదుగుతూ వచ్చింది. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా.. ఈసారి పార్టీ ఆఫీసు నుంచినే కథను నడిపిస్తున్నారు. ప్రత్యేక సైన్యాన్ని నియమించి రచ్చ చేయిస్తున్నారు. తమ అనుకూల అజెండాను అమల్లో పెడుతున్నారు. ఈ విషయాన్ని బాహాటంగా ప్రకటించుకున్నారు కూడా. అయినా కూడా మిగతావాళ్లు ఆ ఉచ్చులో చిక్కుకుపోవడం.. వీళ్ల అమాయకత్వం. వారి కన్నింగ్‌ నెస్‌కు నిదర్శనమంతే! ముందు ముందు ఇది మరింత హీటెక్కడం ఖాయం. అందుకు తగ్గట్టుగా ఆజ్యం పోస్తున్నారు! ఆ ఆజ్యంలో వారి వ్యతిరేకులు మండిపోతున్నారు!

-ఎల్‌.విజయలక్ష్మి