తిరుపతి ఉప ఎన్నిక విషయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఇప్పుడు మొరాయిస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీగా ఏడాదిన్నరగా తెలుగుదేశం వాళ్లు ఎక్కడిక్కడ ఇళ్లకే పరిమితం అయ్యారు.
అధినేత చంద్రబాబు నాయుడే దీనికి మినహాయింపు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బై పోల్ రాగానే.. వచ్చి నామినేషన్ వేస్తే పనబాక లక్ష్మి అయినా మరొకరు అయినా గెలవడం అనేది జరిగే పని కాదు.
ప్రజల మధ్యన లేకుండా పోయాకా.. అది అధికార పక్షం అయినా, ప్రతిపక్షం అయినా ప్రజలు కూడా పట్టించుకోవడం మానేస్తారు. ఈ నేపథ్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ కి కఠినమైన పరీక్ష అవుతున్నాయి.
ఈ పరిణామాల్లో అక్కడ నుంచి పోటీ చేసేందుకు పనబాక లక్ష్మిని ఎంపిక చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే తను పోటీ చేయాలని అనుకోవడం లేదని పనబాక లక్ష్మి అధిష్టానానికి వర్తమానం పంపినట్టుగా తెలుస్తోంది.
తీరా అభ్యర్థిని ప్రకటించాకా.. ఇప్పుడామె పోటీ చేయకపోతే.. తెలుగుదేశం పార్టీకి అంతకు మించిన ఝలక్ ఉండకపోవచ్చు. నోటిఫికేషన్ రాక ముందే ఆర్బాటంగా అభ్యర్థి ప్రకటన చేసి, తీరా ఆ అభ్యర్థి తప్పుకుంటే అంతే సంగతులు. ఈ పరిణామాల్లో పనబాక లక్ష్మికి ధైర్యం చెప్పి ఆమెను బరిలో నిలిపే బాధ్యతలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించినట్టుగా ఉన్నారు టీడీపీ అధినేత. అందులో భాగంగానే ఆమెతో సమావేశం అయ్యి సోమిరెడ్డి ధైర్యం చెప్పినట్టుగా ఉన్నారు.
ఓటమికి కుంగిపోకుండా పోటీ చేయాలని ధైర్యం చెప్పడానికి బహుశా సోమిరెడ్డి కన్నా తగిన రాజకీయ నేత మరొకరు ఉండకపోవచ్చు. సుమారు అరడజను సార్లు ఓటమిని మూటగట్టుకుని కూడా ఇంకా ఆయన ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చెప్పిన ధైర్యం పనబాక లక్ష్మికి సరిపోతుందో లేదో ఆమె నామినేషన్ వేస్తే గానీ తెలియదు.
అయితే ఊరికే పోటీ చేయమంటే ఎవరైనా చేస్తారని, ఖర్చు దగ్గరే సదరు అభ్యర్థులు మొరాయిస్తూ ఉంటారు. ఆ ఖర్చు విషయంలోనే చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి ద్వారా భరోసాను అందించే ప్రయత్నం చేశారని, నోటిఫికేషన్ కు ముందే డబ్బు సర్దుబాటు గురించి అభయం ఇచ్చి.. బరిలో నిలిచేందుకు పనబాక లక్ష్మికి చంద్రబాబు నుంచి సోమిరెడ్డి ద్వారా తగినంత భరోసా లభించినట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది.