Advertisement


Home > Politics - Gossip
ఈ మాటలు సోమును ఇంకా కెలుకుతాయేమో?

ఏపీ భాజపా అధ్యక్ష పదవిని తనకు కట్టబెట్టబోతున్నట్లుగా కొన్ని సంవత్సరాలుగా ఊరించి, చివరికి దానిని వలసనేత కన్నా లక్ష్మీనారాయణ నెత్తిన పెట్టడం అనేది సోము వీర్రాజుకు షాకింగ్ పరిణామమే. ఆయన అలకపూని, ఫోను స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన వర్గం మొత్తం రాజీనామాలు చేశారు. అయితే తెలంగాణకు చెందిన నాయకుడు, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీ మనోహర్ రావు మాత్రం ఈ అసంతృప్తులన్నీ టీకప్పులో తుపాను లాంటివి మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

అసంతృప్తి రేగడమే చిత్రం అనుకుంటూ ఉంటే.. దానిని సహజమే అంటూ తేలిగ్గా తీసుకోవడం గమనిస్తోంటే.. కాంగ్రెస్ సంస్కృతి గుర్తుకు వస్తోంది. కాకపోతే.. ఈ మాటలు – ‘తన అసంతృప్తిని కూడా చాలా తేలిగ్గా తీసుకున్నా’రని అనిపించేలాగా.. సోము వీర్రాజును మరింతగా కెలికే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

సిద్ధాంతాలు, విలువలు ఎన్నడో వదిలేసి చెలరేగుతున్న భారతీయ జనతా పార్టీ- ప్రస్తుతం మిగిలిఉన్న నాయకులనుంచి క్రమశిక్షణను ఆశించడం కూడా కామెడీనే అవుతుంది. అలాంటి నేపథ్యంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల సోము వీర్రాజు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన వర్గం మొత్తం తిరుగుబాటు బావుటా ఎగరేసి రాజీనామాలు చేయడం వంటి పరిణామాల గురించి ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అటు పరిపాలన దగ్గరినుంచి, ఇటు పార్టీ నిర్వహణ వరకు అన్ని రకాలుగాను మోడీ సారథ్యంలోని భాజపా, కాంగ్రెస్ అడుగుజాడల్లోనే నడుస్తున్నదని అనుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పరమవైభవ స్థితిలో ఎన్నడూలేదు. గతంలో కూడా ఎన్నడూ ఆ పార్టీ బలంగా ఉన్న సందర్భాలు కూడా లేవు. పైగా ఇప్పుడు చంద్రబాబునాయుడు సాగిస్తున్న ప్రచారానికి చాలా చోట్ల వారికి సింగిల్ ఓట్ పడకపోయినా కూడా ఆశ్చర్యం లేదని పలువురి భావన. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు మీద సమర్థంగా ఎదురుదాడి చేయగలిగిన వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించుకోవడం వారు అవసరంగా భావించడంలో తప్పులేదు.

కానీ.. అలాగని పార్టీలోనే కుంపట్లను రగిలించే నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. నిర్ణయం అధికారికంగా వెలువడడానికి ముందే.. సోము వీర్రాజు లాంటి వాళ్లని ట్యూన్ చేసి ఉంటే ఇలా పరువు రచ్చకెక్కేది కాదు. పైగా ఆయన టీకప్పులో తుపాను అంటూ పార్టీనే అంటోంటే.. ఆ మాటలు ఆయనను మరింతగా కెలికితే పరిణామాలు మరింత విషమంగా మారినా ఆశ్చర్యం లేదు.