cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ?

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ?

తోలుబొమ్మలు అనేది ఒక అద్భుతమైన జానపద కళారూపం. మానవాళి విస్తరించిన ప్రతిచోటా కొద్ది కొద్ది మార్పులతో ఈ తోలుబొమ్మలు అనే జానపద కళాప్రక్రియ ఉంటుంది. తెర మీద తోలుతో చేసిన బొమ్మలు హావభావ విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అయితే.. ఎదురుగా ఉండే ప్రేక్షకుడికి కనిపించకుండా.. ఆ తోలుబొమ్మల తల, కాళ్లు, చేతులు.. ఇలా ప్రతి అవయవానికి సన్నటి దారాలు కట్టిఉంటాయి. ఆ దారాలను తన చేతివేళ్లతో ఆడిస్తూ వాటి హావభావాలను నిర్దేశిస్తూ.. వాటి మాటలను తానే పలుకుతూ.. తెరవెనుక ఉండే వ్యక్తి కథను ముందుకు నడిపిస్తుంటాడు. ప్రేక్షకలోకాన్ని రంజింపజేస్తుంటాడు! ‘సూత్రం’ అంటే దారం అనే సంగతి మనకు తెలుసు. ఈ తోలుబొమ్మలకు కట్టిన దారాలను చేత్తో పట్టుకుని, వాటిని తాను చెబుతున్న కథకు, తాను వ్యక్తీకరిస్తున్న హావభావాలకు అనుగుణంగా ఆడిస్తూ ఉండేవాడే ‘సూత్రధారుడు’! ఆ పదం పుట్టింది తోలుబొమ్మలాటలోనే!

రాజకీయాల్లో కూడా ఇలాంటి తోలుబొమ్మలాటలు ఉంటాయి. తెరమీద ఆట ఆడుతున్న ప్రధానపాత్రలతో బాటు కేతిగాడు, బంగారక్క, జుట్టుపోలిగాడు వంటి హాస్యపాత్రలు కూడా ఉంటాయి. అయితే వారందరినీ మాటాడిస్తూ, వారితో పోరాటాలు చేయిస్తూ, ఆ పోరాటాలకు ముందు గైడెన్స్ ఇస్తూ, తర్వాత ప్రమోషన్ చేస్తూ.. వారితో ఆటాడించే సూత్రధారుడు మరొకరు ఉంటారు. వారిని రాజకీయాల్లో అయితే ‘కింగ్ మేకర్’ అని, ‘రాజగురువు’ అని అంటూ ఉంటారు. 

వెన్నెముక లేని వ్యక్తులు.. జవసత్వాలు ఉడిగిపోయిన వృద్ధులు.. తెరమీద ప్రధాన పాత్రలు అయినప్పుడు.. అది సూత్రధారుల రాజ్యం కాక మరేమవుతుంది. తెలుగు రాజకీయాల్లో అదే జరుగుతోందినప్పుడు. అటు తెలుగుదేశం, ఇటు జనసేన రెండు పార్టీలకూ స్క్రిప్టు సమకూర్చడం దగ్గరినుంచి, యాక్షన్ కట్  చెప్పడం దగ్గరినుంచి, చివరికి వారి సినిమా మార్కెటింగ్‌ను కూడా భుజస్కంధాల మీదికి ఎత్తుకుంటున్న వారు వేరే ఉంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలన్నింటికీ కలిపి సింగిల్ కార్డు వేసుకోగల ఆ ఘనులెవ్వరు.. అనేదే గ్రేటాంధ్ర విశ్లేషణ! 

రాజకీయాల్లోకి వచ్చే వారికి స్వబుద్ధి ఉండాలి. సొంత వివేచన ఉండాలి. ప్రజల పట్ల, ప్రపంచం పట్ల ఒక రకమైన కన్సర్న్ ఉండాలి. ఆ కన్సర్న్ నుంచి.. గమనించిన విషయాలను.. స్వబుద్ధితో బేరీజు వేసుకుని.. సొంత వివేచనతో కార్యచరణ రూపొందించుకునే సత్త ఉండాలి. వారి కార్యచరణ అనేది.. సమస్య పరిష్కారానికి ఉపయోగపడేలా ఉండాలి గానీ.. వారు ఏదో చేసేస్తున్నట్టుగా బిల్డప్ ల కోసం ఉద్దేశించినది అయి ఉండకూడదు. హైప్ కోసం కొన్ని రకాల నిందలు వేయడం, కొన్ని రకాల పోరాటాలు చేయడం.. వాటికి పోరాటానికి మించిన ప్రచారం ఆశించడం.. తద్వారా తాము మహాద్భుతమైన పోరాటాలు చేస్తున్నట్టుగా, తమను మించిన ప్రజా నాయకులు లేరన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించడం.. ఇదీ వరస.

వారి అత్యాశలకు తగ్గట్టుగా ఆడేవాళ్లు కొందరుంటారు. వారి కాంక్షలకు తగ్గట్టుగా ఆడించేవాళ్లు కూడా కొందరుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నదంతా ఈ తరహా రాజకీయమే. 

అధికార పార్టీని పక్కన పెడదాం. ఎందుకంటే.. వారు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. తాము మళ్లీ మళ్లీ నెగ్గడానికి ఇప్పుడు చేపడుతున్న సంక్షేమ పథకాలు చాలు.. ఇంకే అక్కర్లేదు అనే ఊహలతో ఉన్నారు. తమకు కావాల్సిన ప్రచారం కోసం.. అత్యధిక సర్కులేషన్ తో ఒక సొంత పత్రికను కలిగి ఉన్నారు. ఇక వారి వ్యవహారం అంతా కూడా ఏకపక్షంగానే సాగిపోతుంది. ప్రతిపక్షాలనే పరిశీలించాలి. ప్రతిపక్షంగా గుర్తింపు ఉన్న తెలుగుదేశం ఒకవైపు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా.. రాబోయే ఎన్నికల్లో మా నాయకుడే ముఖ్యమంత్రి అని చెప్పుకునే జనసేన మరోవైపు! వీరిద్దరూ తామే నిర్మాణాత్మక ప్రతిపక్షం అని గుర్తింపు తెచ్చుకోవడానికి పాటు పడుతున్నారు. 

నిజానికి అలాంటి గుర్తింపు కోసం ఏం చేయాలో వారికి తెలియదు.. కానీ.. ఆ రకమైన ప్రచారం మాత్రం పుష్కలంగా కావాలి. కీర్తి కావాలి. కష్టం ఉండకూడదు. ఇలాంటి అడ్డదారులు వెతుక్కునే వారికి అప్పనంగా కలిసి వచ్చేదే సోషల్ మీడియా.. అందుకే.. ప్రజా నాయకులుగా గుర్తింపు పొందాలనుకునే దుగ్ధతో ప్రజలకు దూరంగా నాలుగ్గోడల మధ్యనుంచి సోషల్ పోరాటాలు సాగించే ఖర్మమార్గంలో సాగుతున్నారు.

ప్రచారకక్కుర్తి ప్రధాన సమస్య

ఈ రెండు పార్టీలకు ప్రచారం కక్కుర్తి ఉంది. సాధారణంగా రాజకీయాల్లో ఎవ్వరికైనా సరే.. ఈ ప్రచారం కక్కుర్తి చాలా కామన్ సంగతి. ముందే చెప్పుకున్నట్టు అధికార పార్టీ సొంత మీడియాలోనే అదంతా కోరుకుంటోంది. ఇక ఈ విపక్షాలు.. ప్రచారం కోసం.. జగన్ వ్యతిరేక పచ్చ మీడియా ప్రాపకంతో చెలరేగిపోతున్నాయి. ఆ మీడియాను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. అక్కడే రకరకాల కొత్త తమాషాలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇదివరకటి రోజుల్లో అయితే. రాజకీయ నాయకులు ఒక ప్రజా పోరాటాన్ని నెత్తికెత్తుకుంటే.. దానికి ప్రచారాన్ని కోరుకునే వారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మన నాయకులు మార్చారు. పత్రికల వాళ్లు/ మీడియా దేనికైతే ప్రచారం బాగా ఇస్తారో అలాంటి పనులు మాత్రమే చేస్తున్నారు. రాజకీయాల్లో రాణించడానికి మీడియా దన్ను ఒక కీలకమైన బలం అనేది తెలుగు రాజకీయాలు కొన్ని దశాబ్దాల కిందటే నిరూపించాయి. తొలిసారిగా ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా గద్దెమీద కూర్చోబెట్టడంలో.. రామోజీ రావు పాత్ర ఎంతో గణనీయమైందనే ప్రచారం తెలుగునాట ముమ్మరంగానే ఉంటుంది. అదే రీతిగా.. చంద్రబాబు నాయుడు , మామ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు.. అచ్చంగా రామోజీరావు మద్దతు మాత్రమే.. చంద్రబాబు కుట్రను ఫలించేలా చేసిందన్నది జగమెరిగిన సత్యం. 

ఆ అనుభవాలు ఇప్పుడు ఈ విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు కొత్త పాఠాలు నేర్పుతున్నాయి. వీరికి ప్రధానంగా కావాల్సింది ప్రచారం. గోరంత చేస్తే కొండంత ప్రచారం కావాలి. అందుకే.. పచ్చమీడియా పెద్దలు ఏం చెబితే అది చేయడానికి వీరు సిద్ధపడుతున్నారు. రామోజీరావుకు ఆల్రెడీ రాజగురువు ముద్ర ఉంది. నిజానికి పచ్చమీడియాలో పలువురు పెద్దలు తమందరికీ కూడా అలాంటి రాజగురువు ముద్ర కావాలని తహతహలాడుతున్న వారే. వారు ఏం చెబితే అదే తాము చేస్తే.. వారు తమను అక్కున చేర్చుకుని, తమకు దండిగా ప్రచారం ఇస్తారనే యావ ఈ ఇద్దరు నాయకులది! సరిగ్గా అలాంటి పాయింట్ దగ్గరే మొత్తం రాజకీయం మొత్తం భ్రష్టు పట్టిపోతోంది. 

ఆట అక్కడే మొదలవుతోంది

సరిగ్గా ఈ నాయకుల వెంపర్లాట దగ్గరే అసలు సిసలు రాజకీయ తోలుబొమ్మలాట ప్రారంభం అవుతోంది. సూత్రధారి పాత్రను పోషిస్తూ.. ఆధునిక తరంలో కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నది పచ్చమీడియా సారథులు! అందరికీ ఇప్పుడు విడవకుండా పట్టుకున్న వర్షాలు వారికి చాలా బాగా కలిసొచ్చాయి.  వర్షాల్లో ఎటూ రోడ్లు గుంతలు పడతాయి.. వర్షాలు ఆగేవరకు ఆ గోతులను పూడ్చి రోడ్లు మరమ్మతు చేయలేరు. సరిగ్గా అక్కడినుంచి మొదలైంది డ్రామా!

మామూలుగా ఎక్కడైనా రోడ్లు బాగోలేకపోతే.. పత్రికల్లో ఆయా జోనల్ పేజీల్లో వేస్తుంటారు. కానీ.. పచ్చ మీడియా రాజులు తలచుకుంటే పేజీలకు కొదవేముంది. అందుకే.. దెబ్బతిన్న రోడ్ల గురించి పత్రికల్లో పతాక శీర్షికల్లో అచ్చొత్తించడం ప్రారంభించారు. ఇలా పత్రికల ప్రధాన పేజీల్లో కూడా రోడ్ల సమస్య వంటివి రావడం కద్దు. కానీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలనుంచి రోడ్ల దుస్థితిని తెప్పించి.. సమగ్రమైన స్టోరీగా రూపొందించినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. ఈసారి మాత్రం.. రోడ్లు గురించే ప్రతిరోజూ కథనాలే. ఆ రకంగా తొలి దశలో పచ్చ మీడియా కథ తయారు చేస్తుంది. 

రెండో దశలో స్క్రీన్ ప్లే అందిస్తారు. తాము ఎత్తి చూపించిన రోడ్ల సమస్య మీద ఆ పార్టీలు, నాయకులు ఎలా పోరాడాలి? అనేదే ఆ స్క్రీన్ ప్లే. సోషల్ మీడియా వారికి అందివచ్చిన అస్త్రం. నాయకులు ఇంట్లోంచి కదిలే పనిలేదు. ఎక్కడో తమ కార్యకర్తలు ఒక ఫోటో/వీడియో తీసి పంపుతారు.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డ్రామా నడిపిస్తూ ఉంటే సరిపోతుంది. అదంతా కూడా తాము అందించిన స్క్రీన్ ప్లే ప్రకారం జరుగుతున్న వ్యవహారమే కాబట్టి.. పచ్చమీడియా.. సదరు నేలబారు సోషల్ మీడియా పోరాటాలను కూడా.. తమ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తూ ఉంటుంది. 

మూడో దశ దర్శకత్వ ప్రతిభ మరింత సమర్థమైనది. ప్రభుత్వం ఎక్కడో ఒకచోట వర్షం తెరపి ఇచ్చిన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులను చేస్తూ పోతుంది. ఆ వెంటనే పచ్చ మీడియా అందుకుంటుంది.. మేం కథనాలు ప్రచురించినందుకు  ప్రభుత్వం కదిలింది.. స్పందించింది.. ఇదంతా మా ఘనత అని చెబుతుంది. ఆలోగా ఈ పుచ్చు నాయకులు కూడా అందుకుంటారు. మేం పోరాటాలు చేశాం.. మా పోరాటాలు చూసి సర్కారు బెదిరిపోయింది అని చెప్పుకోవడం ప్రారంభిస్తారు. ఇలా ఈ ప్రహసనం సుదీర్ఘంగా సాగుతూనే ఉంటుంది. 

ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా.. ఇవన్నీ సిండికేటెడ్ పాలిటిక్స్! మీడియా భూతద్దాలను మాత్రమే ధరిస్తూ ఉంటుంది. అదనంగా చిలవలు పలవలు చేర్చి, మసాలా దట్టించి అందిస్తుంది. ఎటూ ఆ స్క్రిప్టును అందుకుని, సభను రంజింపజేయడానికి ఈ జోడు నాయకులు సదా సిద్ధంగానే ఉంటారు. 

ఈ భావ దారిద్ర్యం ఎందుకొచ్చింది..?

ముందే చెప్పుకున్నట్టు నాయకులకు స్వబుద్ధి లేదు. సొంత వివేచన లేదు. ప్రజల సమస్యల పట్ల తమదైన కన్సర్న్ లేదు. కన్సర్న్ విషయంలో ఈ ఇద్దరు నాయకులది వేర్వేరు శైలి. కన్సర్న్ తో స్పందించడం ఎన్నడో మర్చిపోయి.. మూర్తీభవించిన కుట్రరాజకీయంగా తయారైపోయిన మనిషి చంద్రబాబునాయుడు. ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా.. ఆయనకు రాజకీయం లాగా మాత్రమే కనిపిస్తాయి. అందులోంచి ఎలాంటి రాజకీయ లబ్ధి దొరుకుతుందా అని ఆయన చూస్తారు. 

చంద్రబాబునాయుడు.. నలభయ్యేళ్లు దాటిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రజల సమస్యల గురించి కన్నీళ్లు పెట్టుకోవడం ఎవరైనా చూశారా? తన భార్య మీద నిందలు వేశారని ఏడవడం తప్ప మరే సందర్భంలోని కన్నీళ్లు చూపించని వ్యక్తి చంద్రబాబు. తన మీద నక్సల్ దాడి జరిగినా.. దాన్ని రాజకీయం ఎలా చేయాలో ఆలోచించాడో తప్ప.. మరోటి లేదు. కేవలం తన షూటింగ్ ముచ్చట కారణంగా.. పదుల సంఖ్యలో భక్తులు గోదావరి పుష్కరాల్లో చనిపోతే.. కనీసం వారికి సంతాపంగా కూడా ఒక కన్నీటి బొట్టు రాల్చని పాషాణుడు చంద్రబాబు. ఆయనలో ప్రజల సమస్యల పట్ల నిజమైన కన్సర్న్ ను ఊహించలేం. 

పవన్ కల్యాణ్ విషయం వేరు. ఆయనకు ప్రజలంటే కన్సర్న్ ఉంది. కానీ.. ఆ కన్సర్న్ ను ఏం చేసుకోవాలో తెలియని అవగాహన లేమి. ఆవేశంగా నాలుగు రంకెలు వేయడంలో ఆ కన్సర్న్ ను చల్లార్చేసుకుంటారాయన. అంతే తప్ప వాటి పరిష్కారానికి నిజమైన పోరాటం చేసిన చరిత్ర పవన్ కల్యాణ్ కు లేదు. ఎవరు ఏ సమస్య తో వచ్చినా దాని మీద కొన్నాళ్లు రంకెలేయడం.. తర్వాత గాలికొదిలేయడం ఆయన పద్ధతి. 

ఇలాంటి అసమర్థ నాయకులు ప్రతిపక్షాలుగా ఉండడం వల్లనే పచ్చమీడియా.. వీరిని తోలు బొమ్మల్లాగా ఆడిస్తోంది. తమ సొంత ప్రజాబలం మీద తమకు నమ్మకం ఉన్న వాడెవ్వడూ.. మీడియా ప్రచారం కోసం ఆరాటపడడు. ఈ ఇద్దరు నాయకుల్లో, ఈ రెండు పార్టీల్లో ఆ ఆరాటమే వారి బలహీనత. వారలా తోలుబొమ్మలుగా మారిపోయి.. ఎవరో ఆడిస్తున్నట్లుగా ఆడుతూ ఉన్నంతకాలమూ.. పచ్చ మీడియా అనేది తోలుబొమ్మలాట సూత్రధారుడి పాత్రను దాటి.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉంటుంది.

.. ఎల్. విజయలక్ష్మి

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి