cloudfront

Advertisement


Home > Politics - Gossip

సుహాసిని నామినేషన్‌.. ఎన్టీఆర్‌ పరిస్థితేంటి.?

సుహాసిని నామినేషన్‌.. ఎన్టీఆర్‌ పరిస్థితేంటి.?

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కాస్సేపట్లో కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన సోదరుడు హరికృష్ణ కుమార్తెకు మద్దతుగా నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎన్టీఆర్‌ గాట్‌ వద్ద నివాళులర్పించే కార్యక్రమం మామూలే. బాబాయ్‌ బాలకృష్ణ, మావయ్య చంద్రబాబు, తాతయ్య ఎన్టీఆర్‌, తండ్రి హరికృష్ణ ఆశీస్సులతో రాజకీయాల్లో నిలదొక్కుకుంటాననీ, 'సేవ' కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నాననీ సుహాసిని అంటున్నారు.

అంతా బాగానే వుందిగానీ, ఈ ఎపిసోడ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాత్ర ఏంటి.? ఇదే ఇప్పుడు నందమూరి అభిమానుల్ని, టీడీపీ కార్యకర్తల్నీ తొలిచేస్తోంది. కూకట్‌పల్లిలో బాలకృష్ణ ప్రచారం ఖాయమైపోయింది. తెలంగాణ కోసం దాదాపు పది రోజులపాటు 'కాల్షీట్లు' బాలకృష్ణ ఇప్పటికే ఇచ్చేశారట.

ముఖ్యమైన నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటన టీడీపీకి కొత్త ఉత్సాహాన్నిస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. కళ్యాణ్‌రామ్‌ ఎలాగూ సుహాసిని తరఫున ప్రచారానికి వస్తాడు. తాజాగా తారక్‌రామ్‌ని కూడా ప్రచారం కోసం చంద్రబాబు పిలిపించినట్లు తెలుస్తోంది.

అయితే, జూనియర్‌ ఎన్టీఆర్‌ మాత్రం కూకట్‌పల్లిలో టీడీపీ తరఫున ప్రచారానికి వచ్చే అవకాశమే లేదట. బాలకృష్ణ, టీడీపీ తరఫున తెలంగాణలో పర్యటించినా, టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా నినదించినా.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబందాలు ఎలా కొనసాగించాలో ఆయనకు బాగా తెలుసు.

కానీ, ఎన్టీఆర్‌ పరిస్థితి అలా వుండదు. అందుకే, ఎన్నికల ప్రచారం విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దని ఇప్పటికే ఎన్టీఆర్‌, చంద్రబాబుకి తేల్చి చెప్పేశాడట. కళ్యాణ్‌రామ్‌కీ, సుహాసినికీ ఎన్టీఆర్‌ ఇదే విషయమై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్టీఆర్‌ ప్రచారం చేసిన నాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. అనవసరంగా రాజకీయ వివాదాలు కొనితెచ్చుకునేందుకు ఎన్టీఆర్‌ సిద్ధంగా లేడిప్పుడు.