cloudfront

Advertisement


Home > Politics - Gossip

సుహాసినిపై బెట్టింగ్.. దండుకున్న తమ్మళ్ళు.?

సుహాసినిపై బెట్టింగ్.. దండుకున్న తమ్మళ్ళు.?

తెలుగుదేశం పార్టీలో నందమూరి హరికృష్ణకు జరిగిన అవమానాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వర్గీయ నందమూరి తారకరామారావుని రాజకీయంగా చంద్రబాబు వెన్నుపోటు పొడవడం, ఆయన కుమారుడు హరికృష్ణని టీడీపీలోకి తీసుకున్నట్టే తీసుకుని, వేధింపులకు గురిచేయడం, ఆ తర్వాత హరికృష్ణ తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో టీడీపీ తరఫున ప్రచారం చేయించి, అతన్నీ రాజకీయంగా టీడీపీకి దూరం పెట్టడం.. ఇవన్నీ తెల్సిన విషయాలే.

ఇక్కడితో కథ అయిపోలేదు, తాజాగా సుహాసినిని రాజకీయంగా బలిపశువుగా మార్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇది చంద్రబాబుకి మాత్రమే తెలిసిన వెన్నుపోటు విద్య. కూకట్‌పల్లిలో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చంద్రబాబు అనుకుని వుంటే, అందుకు తగ్గట్టుగా ఆయన వ్యూహాలు రచించేవారేమో.!

చంద్రబాబు తన సతీమణిని రాజకీయాల్లోకి తీసుకురావొచ్చు, కోడలు బ్రాహ్మణినీ దింపేందుకు వీలుంది. చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్‌ తరచూ టీడీపీ కార్యక్రమాల్లో కన్పిస్తుంటాడు.. అతన్నీ ట్రై చేసి వుండొచ్చు. కానీ, చంద్రబాబు ఇవేమీ చేయలేదు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు గనుక, ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందని చంద్రబాబు భావించారు.

అటు హరికృష్ణ కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యతనిచ్చినట్లు వుంటుందనీ, 'వెన్నుపోటు' ఆరోపణల నుంచి తప్పించుకోవచ్చనీ చంద్రబాబు ఆలోచించారే తప్ప, సుహాసిని గెలుపుకోసం చంద్రబాబు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

అన్నట్టు, బెట్టింగ్‌ కోసం కూడా చంద్రబాబు అండ్‌ టీమ్‌ సుహాసిని గెలుపుతో ఆటలాడారన్న విమర్శలూ వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఎట్టిపరిస్థితుల్లోనూ కూకట్‌పల్లిలో టీడీపీ గెలుస్తుందంటూ, ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నేతలు విపరీతమైన హంగామా సృష్టించారు.

ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నడిచిన ఈ హంగామా, అక్కడ చాలామంది అమాయకుల్లో బెట్టింగ్‌పై ఆశలు రేకెత్తించింది. అలా టీడీపీ నేతల మాటలు నమ్మి, అప్పటికప్పుడు తమ ఆలోచనల్ని మార్చుకుని.. సుహాసిని గెలుపుపై చాలామంది పందాలు కాశారట.

'ఇదంతా టీడీపీ మద్దతుదారుల పనే.. మమ్మల్ని నట్టేట్లో ముంచేశారు..' అంటూ భీమవరం, నర్సాపురం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు కన్నీరు మున్నీరవుతున్నారు. వారంతా వేలల్లో.. లక్షల్లో.. డబ్బులు పోగొట్టుకున్నారు మరి.

అంటే, చివరి నిమిషంలోనూ సుహాసిని పేరుతో.. 'పచ్చ' రాజకీయం యధేచ్ఛంగా నడిచిందన్నమాట. ఇంతకీ, ఈ పచ్చ రాజకీయంలో లాభపడ్డ ఆ 'తమ్ముళ్ళు' ఎవరట.? బాధితుల్ని ప్రశ్నిస్తే, పేర్లతో సహా బయటపడ్తున్నాయి తమ్ముళ్ళ గాధలు.!

ప్రత్యేకించి.. విజయవాడకు చెందిన కొందరు అధికార పార్టీ నేతలు.. భీమవరం పరిసరాల్లో మకాం వేశారట.. బెట్టింగ్ కోసం. ఇదీ, నందమూరి కూటుంబంపై చంద్రబాబు అండ్ టీమ్ చూపించే ప్రేమ.