cloudfront

Advertisement


Home > Politics - Gossip

కాంగ్రెస్ పై కత్తివేటు

కాంగ్రెస్ పై కత్తివేటు

తెలంగాణ శాసనసభలో సోమవారం నాడు గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించినందుకు గాను.. కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు శాసనసభ్యులమీద స్పీకర్ కఠిన చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఉన్న 13మంది సభ్యుల్లో ఇద్దరిని ఏకంగా సభ్యత్వాలకు అనర్హుల్ని చేసేశారు. 11 మందిని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన రెండో రోజే తెలంగాణ అసెంబ్లీ.. ప్రతిపక్షం లేని సభగా మారిపోయింది.

సోమవారం నాడు శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి పారవేయడంతో పాటు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకు విరిచి.. గవర్నర్ మీదకు విసరి కొట్టారు. ఈ ప్రయత్నంలో ఆ మైకు మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలి గాయమైంది. ఆయన సరోజినినాయుడు కంటి ఆస్పత్రిలో చికిత్స పొందారు.

కాంగ్రెస్ సభ్యుల ఆగడాలతో సభలో అరాచకపర్వం నడిచిందనే చెప్పాలి. సోమవారం సభ మొత్తం రసాభాసగా మారింది. స్వామిగౌడ్ గాయపడిన తర్వాత.. ఇరు పార్టీల సభ్యులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.

అయితే మంగళవారానికి కాంగ్రెస్ సభ్యుల మీద స్పీకర్ మధుసూదనాచారి కత్తి వేటు వేశారు. వారిని ఏకంగా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు శాసనసభ నుంచి బహిష్కరించారు. ఇద్దరైతే సభ్యత్వాలనే కోల్పోయారు. మైకు విరిచి, విసిరిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దయ్యాయి. సీనియర్ సభ్యుడు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డి, మాధవరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పద్మావతి రెడ్డి, డికె అరుణ, వంశీచంద్ రెడ్డి, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క లను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభనుంచి సస్పెండ్ చేశారు. వీరు అరాచకానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ రావు వీరి సస్పెన్షన్ కు సిఫారసు చేశారు.

కాంగ్రెస పార్టీ సభ్యలు సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని తెలుగుదేశం ఎమ్మెల్యే  సండ్ర వెంకటవీరయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పాల్పడిన చర్యలను సమర్థించడం లేదు గానీ.. సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్ లు అనేవి ఏకపక్ష చర్యలుగా పేర్కొన్నారు.

మొత్తానికి ఒకే రోజులో ప్రస్తుతానికి తెలంగాణ శాసనసభ కూడా ప్రతిపక్షం అంటూ లేని సభగా తయారైపోయింది. ఏపీలో కూడా ప్రతిపక్షం లేకుండానే సభ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీకి సభలో రేవంత్ ఒక్కరే (ఆయన సభకు హాజరైతే) సభ్యుడిగా ఈ సమావేశాలు మొత్తం నడుస్తాయని అనుకోవాలి.