cloudfront

Advertisement


Home > Politics - Gossip

స్వామీజీ ఏదో బేరం పెట్టినట్టుంది?!

స్వామీజీ ఏదో బేరం పెట్టినట్టుంది?!

చూడబోతే తెలుగు రాష్ట్రాల్లో ఒకచోట మరో కాషాయాధికారం తప్పేలాలేదు. కమలదళం మరో కాషాయాంబరధారిని రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నది. ప్రస్తుతానికి తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతున్న భాజపా.. తమ హిందూత్వ పార్టీ ట్రంప్ కార్డును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వెరైటీ అస్త్రాన్ని సంధించే ప్రయత్నంచేస్తోంది.

ఇంకా ఏ విషయమూ ఖరారు కాకపోయినప్పటికీ.. ఆధ్యాత్మికవేత్తగా పేరున్న స్వామీ పరిపూర్ణానంద ఇప్పుడు భాజపా తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. ఎన్నికల  ప్రచార బరిలోకి వెళ్లడానికి భాజపా సిద్ధం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.

పరిపూర్ణానంద ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసివచ్చారు. అయితే హస్తినలో ఆయన అమిత్ షాకు ఏదో ప్రత్యేకమైన బేరం పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ బేరం సంగతి తేలితే తప్ప తాను నిర్ణయం తీసుకోను అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్నారు.

‘‘తన ఆసక్తి ప్రధానం కాదని, అమిత్ షా ఏం నిర్ణయిస్తారో వేచి చూడాలని పరిపూర్ణానంద అంటున్నారు. ఆయన మాటల ప్రకారం, భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేయడమనేది అమిత్ షా నిర్ణయంపై ఆధారపడి ఉంటుందట. మరోసారి ఆయన్ని కలిసి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన పరిపూర్ణానంద, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రచారంపైనా ఓ నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు.

సీఎం అభ్యర్థిగా తన పేరు ప్రకటించినంత మాత్రాన.. తాను బలిపశువే తప్ప.. సీఎం కాబోయేది లేదని, తెలంగాణలో అంత సీన్ భాజపాకు లేదని పరిపూర్ణానందకు చాలా స్పష్టత ఉన్నట్లుంది. అయినా పార్టీ మాత్రం ఆయనను ఎన్నికల్లో వాడుకోవాలనుకుంటోంది.

పార్టీకి తాను ఉపయోగపడడానికి ఆయనకు అభ్యంతరంలేదు గానీ, ఇక్కడ ఓడిపోయిన తర్వాత.. తనను తెరమరుగు చేసేయకుడా, రాజ్యసభ సభ్యత్వం కేంద్ర రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చేట్లయితే తాను పార్టీలో చేరడానిక సిద్ధమేనని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తుంటానని ఆయన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

మరి బుధవారం తెలంగాణకు రానున్న అమిత్ షా ఈలోగా ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.