cloudfront

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్ కు కాస్త మోదం.. కాస్త ఖేదం!

కేసీఆర్ కు కాస్త మోదం.. కాస్త ఖేదం!

కర్నాటక ఫలితాలు ఏయే నాయకులకు ఎలాంటి రుచిని కలిగించాయి? ఈ ప్రశ్న ప్రతి ఎన్నికల అనంతరం విధిగా రాజకీయ ఆలోచనలు ఉండే ప్రతి ఒక్కరికీ స్ఫురించేదే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సంబంధించి ఈ ఫలితాలు అచ్చంగా చేదు మాత్రల లాంటివే.

కేసీఆర్ విషయానికి వస్తే... మోడీ మీద ఆయన కూడా తిరుగుబాటు చేసి.. కాంగ్రెస్, భాజపా వ్యతిరేకతతో ప్రాంతీయ పార్టీలను ఫెడరల్ ఫ్రంట్ గా కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు గనుక.. ఇలా భాజపా ఘనవిజయం సాధించడం ఆయనకు కూడా చేదు మాత్రే కదా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ.. కేసీఆర్ విషయంలో ఈ ఫలితాలు కొంత ఖేదం, కొంత మోదం కలిగిస్తాయని భావించాలి.

ఎందుకంటే...

ఫెడరల్ ఫ్రంట్ పేరిట రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా మూడోఫ్రంట్ ఏర్పాటు చేయడానికి కేసీఆర్ నానాపాట్లు పడుతున్నారు. ఆయన బహిరంగంగా ఏం చెప్పుకుంటున్నప్పటికీ.. ఆయన ఆశించిన స్థాయిలో ఆ ఫ్రంట్ రెస్పాన్స్ దక్కడం లేదన్నది నిజం. ఎలాగంటే... కర్నాటకకు వెళ్లి దేవెగౌడతో భేటీ అయి, ఆ పిమ్మట, ఆహ్వానిస్తే తాను కర్నాటక ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్తానని, రెండు జాతీయ పార్టీలను ఓడించాలంటూ జేడీఎస్ కు అనుకూలంగా ప్రచారం కూడా చేస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారు.

కానీ ఆ ఆఫర్ ను దేవెగౌడ స్వీకరించలేదు. అలాగే, కేసీఆర్ చాలా కష్టపడి చెన్నై వెళ్లి రెండురోజులు బసచేసి డీఎంకే వారినందరినీ కలిసారు. వారు కనీసం ఆయనతో కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు సరికదా.. ఆయన వచ్చేసిన తర్వాత.. మూడోఫ్రంట్ గురించి మాట్లాడనే లేదంటూ.. తేల్చిపారేశారు. ఇలా ఆయన ప్రతిపాదన పట్ల ఎవ్వరూ స్పందించలేదు.

దేవెగౌడ కారణాలు వేరు. భాజపాతో ఎన్నికల అనంతరం కలవాల్సి వస్తుందనే కోరికతో కేసీఆర్ దరికి చేరలేదు. డీఎంకే కాంగ్రెస్ కూటమిలో సురక్షితంగా ఉన్నాం కదా.. ఇక ఎందుకులెమ్మని కేసీఆర్ ను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

భాజపాకు జేడీఎస్ అవసరంలేదు గనుక, వారు మూడోఫ్రంట్ కు జైకొట్టవచ్చు. అలాగే కాంగ్రెస్ ను నమ్ముకుంటే అథోగతే అని అర్థమైపోయింది గనుక.. డీఎంకే కూడా కేసీఆర్ కూటమి వైపు రావొచ్చు. భాజపాతో సఖ్యత ఎటూ చెడింది. ఆ రకంగా చూస్తే భాజపా విజయం కేసీఆర్ కు ఖేదమే గానీ.. తాను సంకల్పించిన మూడోఫ్రంట్ కు ఈ రెండు పార్టీలు జైకొట్టవలసిన అగత్యం ఏర్పడడం అనేది ఆయనకు మోదం కలిగిస్తుందని పలువురు భావిస్తున్నారు.