Advertisement


Home > Politics - Gossip
తనయుడి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్న జేసీ?

ఇది తరిమెల నాగిరెడ్డి, తమ మార్గదర్శకుడు నీలం సంజీవరెడ్డిల కాలంకాదని జేసీ దివాకర్‌రెడ్డికి తెలియనిది కాదు. ఎవరో కొందరు మినహాయింపు గానీ.. మెజారిటీ నేతలు అవకాశవాద రాజకీయాలు చేసే వాళ్లే. ఎవరో వరకూ వద్దు.. దివాకర్‌రెడ్డి కూడా అదే బాపతు కదా. విభజన సమయంలో కూడా అమ్మ.. అమ్మ.. అంటూ సోనియాకు ప్రదక్షిణలు చేశాడు ఈయన. తీరగా కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు అని తేలాకా.. కిరణ్‌తో ప్రయోజనం లేదని గ్రహించాకా.. సన్నగా తెలుగుదేశం పార్టీలో చేరాడు దివాకర్‌రెడ్డి.

మరి ఆ తెలుగుదేశంతో దివాకర్‌రెడ్డికి ఉండిన వైరం గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. దశాబ్దాలుగా పచ్చ పార్టీతో వైరమే. అయితే.. దివాకర్‌రెడ్డికి తెలుగుదేశం అవసరం, తెలుగుదేశానికి దివాకర్‌ రెడ్డి అవసరం ఉన్న వేళ ఫిరాయింపు సాఫీగా జరిగిపోయింది. మరి అలా ఫిరాయించి.. ఎంపీగా గెలిచినప్పటికీ దివాకర్‌రెడ్డికి ప్రశాంతత అంటూ ఏమీలేదు. అనునిత్యం మామాట జరగడంలేదు, మా మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు.. అంటూ దివాకర్‌రెడ్డి పెడబొబ్బలు పెడుతూనే ఉన్నాడు.

మరి ఆ రచ్చ అలా ఉండగానే.. మరోవైపు ప్రతిపక్షనేత జగన్‌ మోహన్‌రెడ్డిపై దివాకర్‌రెడ్డి విరుచుకుపడుతూ ఉంటాడు. మరి తెలుగుదేశంలో ఉన్న చాలా మంది జగన్‌ను విమర్శిస్తారు కానీ.. జేసీలా హద్దులు మీరి మాట్లాడేవాళ్లు కొద్దిమందే ఉన్నారు. తనకు దురద లేకపోయినా.. పరాపరా గోక్కొంటున్నట్టుగా వ్యవహరిస్తాడు దివాకర్‌రెడ్డి. శ్రుతిమించి విమర్శలు చేస్తే అయినా చంద్రబాబు కరుణిస్తాడనేది దివాకర్‌రెడ్డి ఆశ.

అయితే చంద్రబాబు ఏమీ తిక్కలోడు కాదు.. ఎవరు ఎందుకు ఎలా మాట్లాడతారో ఆయనకు తెలియనిది కాదు... దివాకర్‌రెడ్డి ఇంతకాదు... జగన్‌ను తిట్టడంలో రోడ్డెక్కి చొక్కా చించుకున్నట్టుగా వ్యవహరించినా.. బాబు లెక్కలు బాబుకు ఉంటాయి. దివాకర్‌రెడ్డి కోరుతున్న సీట్లన్నింటినీ తెలుగుదేశంలో సంపాదించుకోవడం అంటే.. తలకిందుల వేలాడి తపస్సు చేసినా సాధ్యంకాదు. అయినప్పటికీ దివాకర్‌రెడ్డి తగ్గడంలేదు.

మరి ఈయన దురదలేని గోకుడు వల్ల జేసీకి రక్తాలు కారడం లేదేమో కానీ.. తనయుడికి మాత్రం బొబ్బలు లేస్తున్నాయని టాక్‌! తండ్రి జగన్‌ మీద రెచ్చిపోయి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జేసీ పవన్‌ తెగ నొచ్చుకొంటూ ఉన్నాడని సమాచారం. మరి జగన్‌ అంటే జేసీ పవన్‌కు ప్రత్యేకాభిమానం ఏమీలేదు కానీ.. రేపటి రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

అన్నేళ్ల కాంగ్రెస్‌ పార్టీనే తమకు శాశ్వతం కాలేదు.. బద్ధవిరోధ తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సి వచ్చింది. ఇక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకు సాగిస్తున్నారు. మరి రేపటి ఎన్నికల్లో బాబు ఎలాంటి ట్విస్టు ఇస్తాడో ఎవరికీ తెలీదు. మీరు తాడిపత్రికి మాత్రమే పరిమితం కండి.. అనంతపురం ఎంపీ టికెట్‌ కూడా ఇచ్చేదిలేదు.. అని బాబు తెగేసి చెబితే.. జేసీ ఫ్యామిలీ ఏం చేస్తుంది?

జేసీ తోకలు కట్‌ చేయడానికి బాబు రెడీగా ఉన్నాడనే మాట కూడా వినిపిస్తోంది. వీళ్లు ఏరోజుకు అయినా ప్రమాద కారులే.. వైఎస్‌ ప్రాపకం కోసం అంతగా ప్రయత్నించి, ఇప్పుడు జగన్‌ను ఇంతలా తిడుతున్న వీళ్లు ఎంత గుండెలు తీసిన బంటులో ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అందుకే బాబు కూడా వీళ్లతోకలు కట్‌ చేసే అవకాశాలున్నాయి. అప్పుడంటే జేసీల అవసరం పార్టీకి ఉంది కాబట్టి.. బాబు అనంత ఎంపీ టికెట్‌ ఇచ్చాడు. రేపటి ఎన్నికల్లో వీరి అవసరం బాబుకు లేదు!

అనంత ఎంపీ టికెట్‌ను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికైనా ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి జేసీల ఇంట్లో దివాకర్‌రెడ్డి రిటైరవుతాడు అనుకుంటే.. పవన్‌, ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి... పోటీ కోసం మూడు నియోజకవర్గాలు కావాలి. బాబు తాడిపత్రి మాత్రమే ఇస్తాను అంటే.. చెక్క కొట్టుకోవాలి! జరగబోయేది కూడా ఇదేనని సమాచారం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు దివాకర్‌రెడ్డి, అటు ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌పై పోటీలు పడి రెచ్చిపోతున్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు.

వీళ్లదేముంది కథ క్లైమాక్స్‌కు వచ్చింది. ఇప్పటికిప్పుడు కాకపోతే.. కొన్నాళ్లకైనా వైకాపాలోకి వెళ్లాల్సి వస్తే.. అప్పుడు తండ్రి, చిన్నాన్న మాటలు తనకు ఇబ్బందిగా పరిణమిస్తాయేమో అని పవన్‌రెడ్డి భయపడుతున్నాడట. నోటికి అడ్డూ అదుపు లేకుండా రెచ్చిపోతున్న వాళ్ల వల్ల తన భవిష్యత్తు రాజకీయానికి ఎలాంటి ఇబ్బంది వస్తుందో.. అనే ఆందోళనతో ఉన్నాడట పవన్‌రెడ్డి. తండ్రికి చెబుతున్నా.. తగ్గేలా లేడు. తీవ్రమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న దివాకర్‌రెడ్డి బాబును ఏమీ అనలేక.. జగన్‌ మీద పడుతున్నాడు. ఈ విధంగా పవన్‌కు జేసీ దివాకర్‌రెడ్డి పెద్ద సమస్యగా తయారయ్యాడు!