అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు. అధికారాంతమందు కానీ ఆటిట్యూడ్ వైనం తెలిసిరాదు. జేసి బ్రదర్స్ ఇప్పుడు ఇలాగే బాధపడుతున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
జగన్ విషయంలో చాలా దూకుడుగా వెళ్లామని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడామని, కడపలో మీటింగ్ పెట్టి మరీ మాటల తూటాలు విసిరామని ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నారట.
జేసి బ్రదర్స్ లో ప్రభాకర రెడ్డి జైలులో వున్న సంగతి తెలిసిందే. ములాఖత్ లో తనను కలిసిన వారితో ఈ మేరకు ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ పై విపరీతంగా నోరు పారేసుకోవడం వల్ల నియోజకవర్గంలో ఇటు రెడ్లు కలిసిరాలేదు. అటు బిసిలతో పోటీ రావడం వల్ల వారు కలిసిరాలేదు. ఇప్పుడు ఈ విపత్కాలంలో ఎవరికోసం ఇదంతా చేసారో ఆ చంద్రబాబు కలిసి రాలేదు అని బాధపడుతున్నారట.
అచ్చెంనాయుడు విషయంలో గుంటూరులో పార్టీ జనాలను పోగేసి చేసిన హడావుడిలో రవ్వంత అయినా తమ విషయంలో చేయలేదని జేసి బ్రదర్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జైలు, బెయిలు వ్యవహారం పూర్తయిన తరువాత ఇక భాజపాలోకి వెళ్లిపోక తప్పదని జేసి బ్రదర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో వుండి తాము ఇక సాధించేది ఏమీ లేదని జేసి బ్రదర్స్ డిసైడ్ అయినట్లు బోగట్టా. చంద్రబాబు దగ్గర వుండడం వేరు, ఆయన మెప్పు కోసం అనవసరంగా జగన్ మీద ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం వేరు. పైగా తమ దగ్గరలో బోలెడు తప్పులు వున్నవారు రాజకీయాల్లో జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే రోజులు ఎప్పుడూ ఒకలా వుండవు.
రాజకీయాల్లో ఎంతో అనుభవం వున్న జేసి బ్రదర్స్ ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో? ఇప్పుడు బాధపడుతున్నారు.